విద్యార్థుల కోసం.. వ్యవస్థ కోసం... ఒక వేదిక

అమెరికన్ వర్సిటీ ప్రతినిధితో డాక్టర్ కన్నేగంటి రమేశ్ బాబు - Sakshi


అదొక వారధి... సమస్యకూ పరిష్కారానికీ మధ్య. విద్యార్థికీ వ్యవస్థకూ మధ్య. అదొక వేదిక... ఆలోచనలకు, అధ్యయనాలకు. అదే.. ‘సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్’. పేరులోనే  తన విభిన్నమైన లక్ష్యాన్ని ఇముడ్చుకొన్న సంస్థ ఇది. భారత ప్రభుత్వానికే ఒక అనధికార సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆ సంస్థ గురించి... అనేక మంది ప్రముఖ వ్యక్తులను ఆ వేదికపై తీసుకొచ్చి దాన్ని నడుపుతున్న విద్యావేత్త డా.కన్నెగంటి రమేశ్‌బాబు గురించి...

 

‘హ్యూమన్ సెక్యూరిటీ’ అంటే... మనిషికి భద్రతను ఏర్పాటు చేయడమే ఈ సంస్థ లక్ష్యం. ఏ విధంగా అంటే... అన్ని విధాలుగా అని చెప్పవచ్చు. దేశీయంగా, అంతర్జాతీయంగా మనిషికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ  వ్యవహారాల గురించి అధ్యయనం చేస్తూ... ప్రభుత్వాలకు, వివిధ వ్యవస్థలకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. అధ్యయనం మీద ఆసక్తి ఉన్న విద్యార్థులే బలంగా, అనేక మంది ప్రముఖుల మార్గనిర్దేశకత్వంలో... వివిధ అంశాల గురించి అధ్యయనం చేస్తూ అనేక ప్రభుత్వరంగ సంస్థలకు చేదోడువాదోడుగా ఉంటుంది ఈ సంస్థ.

 

దేని గురించి అధ్యయనం చేస్తారు?

శక్తి వనరులు, ఆహారం, ఆరోగ్యం, దేశీయ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, ఇంటర్నెట్-సైబర్ క్రైమ్, రాజ్యాంగ శాస్త్రం, తీర ప్రాంతభద్రత, నక్సలిజం, తీవ్రవాద నిరోధక చర్యలు, ఇంకా ఇతర సామాజిక అంశాలు...

 

ఎవరు అధ్యయనం చేస్తారు...

అధ్యయనం మీద ఆసక్తి ఉన్న అనేక మంది ముందుకొస్తున్నారు. చదువులో భాగంగా, ఆసక్తి కొద్దీ ఆయా అంశాలపై అధ్యయనం చేయాలనుకొనే విద్యార్థులు ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సంస్థతో చేతులు కలుపుతున్నారు.

 

పెద్దల సహకారం ఉంది!

పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు ఈ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.పద్మనాభయ్య గౌరవ డెరైక్టర్‌గా ఉన్నారు. వీరు గాక అనేక మంది మాజీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఈ సంస్థకు సహకారం అందిస్తున్నారు. వారి సహకారమే దీనికి ఆయువుపట్టు. ఎందుకంటే మేధోతనం, అనుభవం కలగలిసిన వారు ఔత్సాహికులైన అధ్యయనకర్తలను గైడ్ చేస్తారు. భారత ప్రభుత్వానికి ఆర్థిక, సామాజిక విషయాల్లో సలహాదారులుగా వ్యవహరించినస్థాయి వారు వివిధ అంశాల గురించి తగిన సలహాలు సూచనలు ఇస్తూ సహకరిస్తారు.



మరి అలాంటి వారి ఆధ్వర్యంలో అధ్యయనాలు సాగించే అవకాశం అంత సులభంగా లభించదు. అయితే ఈ సంస్థ దాన్ని సుసాధ్యం చేస్తోంది. మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు... ఎమ్.వి. కృష్ణారావు, కేసీ రెడ్డి, ప్రసాద రావు, ద్వారకా తిరుమల రావు, మాలకొండయ్య, ప్రవీణ్‌కుమార్, పీవీ రమేశ్, ఎన్‌వీఎస్‌రెడ్డి, అజయ్ మిశ్రా, మోహన్‌కందా తదితరులు ఇక్కడి అధ్యయనం చేసే వారికి ప్రవేశం ఉన్న అంశాల్లో మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. వీరు మాత్రమేగాక దేశంలోని, విదేశాల్లోని వివిధ వర్సిటీల వైస్‌చాన్సలర్‌లు కూడా ఈ సంస్థకు సహకరిస్తున్నారు.

 

అధ్యయన ఫలితాలు.. విలువైన సూచనలు

ఉన్న ఫళంగా తలెత్తే సమస్యల విషయంలోనైనా, దేశానికి, ప్రపంచాన్ని వేధిస్తున్న చిరకాల సమస్యల విషయంలోనైనా ఈ సంస్థ అధ్యయనాలుంటాయి. వివిధ అంశాల గురించి విదేశీవర్సిటీలు సీహెచ్‌ఎస్‌ఎస్‌తో అధ్యయనాల గురించి ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఆయా సమస్యలను ఎలా నివారించడం గురించి సలహాలూ సూచనలు ఇస్తుంది. నిర్ణయాధికారాన్ని కలిగిన ప్రభుత్వాలకు, వ్యవస్థలకు ఈ సంస్థ అధ్యయనాలు ఉపయుక్తంగా ఉంటాయి.

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ తదితర విద్యాలయాలకు విజిటింగ్ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్న కన్నెగంటి రమేశ్ బాబు ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వారు ఇచ్చే ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్(ఐవీఎల్‌పీ) సత్కారం పొందిన రమేశ్‌బాబు విద్యార్థులకు, వ్యవస్థకు ఉపయుక్తమయ్యే విధంగా ఈ సంస్థకు రూపకల్పన చేశామని చెబుతారు. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు లబ్ధికలగడమే కాకుండా, అనేక విషయాల్లో ప్రభుత్వానికి కూడా ఉపయుక్తంగా ఉందని ఆయన వివరిస్తారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top