ఐదు రోజుల వెలుగుల పండుగ.. దీపావళి

Diwali Special Story Dhana Trayodashi To Bhagini Hasta Bhojanam - Sakshi

సంస్కృతిని ప్రతిబింబిచేవే పండుగలు. అందులో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే వెలుగుల పండగే దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం. అయితే కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి.

ధనత్రయోదశి
అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీ దేవిని భార్యగా స్వీకరించిన శ్రీమహా విష్ణువు ఆమెను ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడు. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఈ రోజును ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మ దినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

అందుకే దీన్ని ధన త్రయోదశి అంటారు. అందుకే ఈ రోజున కాస్తయినా బంగారం కొంటారు. లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌కు చేరుతుంది. కుబేరుడు ఆమెను పూజించి అనుగ్రహం పొంది ఎంతో ధనవంతుడు అయ్యాడు. ఆ అమ్మ భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు.

నరక చతుర్దశి
దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తెల్లవారుజామునే లేచి, నరకాసురుని బొమ్మని చేసి కాలుస్తారు. ఈ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి.

కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి, నూనెతో తలంటి హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. అందుకే సాధారణంగా ఈ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు. కొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటారు.

దీపావళి
ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. 

గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం.

ధనాధిపతి కుబేరుడినీ పూజించాలి. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. 

బలి పాడ్యమి
దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

భగినీ హస్త భోజనం
సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు, అతడి సోదరి యమి. ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. 

దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది.

Read latest Festival News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top