
ఎఫ్‌బీ చేరిన కథ
ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో కాదు.. ఫేస్‌బుక్ చూడటంతోనే ఆ కళ్లకు తెల్లారుతుంది! తాళి కట్టు శుభవేళ కూడా నవ వధూవరులు ఫేస్‌బుక్ అప్‌డేట్స్ మార్చుకునే రోజులివి!
ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో కాదు.. ఫేస్‌బుక్ చూడటంతోనే ఆ కళ్లకు తెల్లారుతుంది! తాళి కట్టు శుభవేళ కూడా నవ వధూవరులు ఫేస్‌బుక్ అప్‌డేట్స్ మార్చుకునే రోజులివి! చివరకు అంపశయ్య మీద ఆపసోపాలు పడుతున్న మనిషి కూడా తన మరణాన్ని అప్‌డేట్ చేసుకునేంతగా మారిపోయింది కాలం. వీటితో పాపులర్ అయిన ఈ ఎఫ్‌బీని ఓ మంచి అభిరుచికి వేదికగా మలుస్తోంది ‘కథ’ అనే ఫేస్‌బుక్ గ్రూప్! కంచికి కాకుండా ఎఫ్‌బీ చేరిన ఈ కథ ఎందరినో అలరిస్తోంది.
సిటీలైఫ్‌లో ఇంట్లోవాళ్లతో మనసారా మాట్లాడుకునే అవకాశాన్నే ఇవ్వట్లేదు ఇక చదివే వెసులుబాటు కల్పిస్తుందా? చాన్సేలేదు. ‘ఉంది’అని నిరూపించారు మూడేళ్ల కిందట గ్రూప్‌గా ఫామ్ అయిన ఫేస్‌బుక్‌లోని పఠనాభిలాషులు. ఎందరికో చదవడం నేర్పారు.
కథ మొదలైంది..
ఈ కథాగ్రూప్ నిర్వాహకుల్లో ఒకరైన వేంపల్లి షరీఫ్ స్వతహాగా కథకుడు. ఆయన రాసిన ఓ కథను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఆయన ఎఫ్‌బీ మిత్రులు చాలామంది ఆ కథ చదివి.. మనకున్న మంచి జ్ఞాపకాన్ని ఇలా కథరూపంలో ఇంత సింపుల్‌గా.. ఇంత అందంగా చెప్పొచ్చా అని అబ్బురపడ్డారు. అంతే కాదు వాళ్ల జ్ఞాపకాలను కథగా రాయడానికి కలం కదిలించారు. దీంతో నిర్వాహకుడికి ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆసక్తి ఉన్నవాళ్లందరినీ ఎఫ్‌బీలో ఓ గ్రూప్‌గా కలిపితే బాగుంటుందనుకున్నాడు.
పత్రికల్లో, మ్యాగజైన్లలో, వెబ్ మ్యాగజైన్లలో వస్తున్న కథలన్నింటినీ అందులో పోస్ట్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తన మిత్రులతో పంచుకున్నాడు. వాళ్లూ ఓకే అనడంతో కథ గ్రూప్ పేజ్ మొదలైంది. సభ్యుల సంఖ్య చూస్తుండగానే వందలకు చేరుకుంది. ప్రస్తుతం కథాగ్రూప్‌లోని సభ్యుల సంఖ్య పన్నెండు వందలు. ఇక ఔత్సాహికులు రాసే కథలు, ఆలోచనలకు ఈ పేజ్ వేదిక అవుతోంది. సలహాలు, కామెంట్లు, లైక్‌లతో రచనావ్యాసంగానికి చక్కటి పాఠశాలవుతోంది. ‘కథ చెప్పనా’ శీర్షిక కొత్త కథలు చదివిస్తుంది. ‘కథాలోచన’ అనే శీర్షిక కొత్త రచయితలకు జన్మనిస్తోంది. పక్షంరోజుల్లో వచ్చిన కథలన్నిటినీ సమీక్షించడానికి ‘కథావీక్షణం’ కళ్లు తెరుచుకుంటుంది. మహాకవులు, వారి రచనలను పరిచయం చేసే ‘విస్తృతకథకులు’ అనే శీర్షికను ఓ గ్రంథాలయంగా అభివర్ణించవచ్చు. ఇవన్నీ పాఠకులకు ప్రతి రోజూ ఆరోగ్యకరమైన కాలక్షేపాన్ని అందిస్తున్నాయి.
పోటీ కథలు
ఓ పదిరోజుల కిందట ఫిల్మ్‌మేకర్ పూరి బాలరాజు తో కలసి ఈ గ్రూప్ కథలపోటీ నిర్వహించింది. కథల ఎంట్రీకి సెప్టెంబర్ 20 చివరి తేదీ. ‘నేను ఫీచర్‌ఫిల్మ్ తీయడానికి మంచి సబ్జెక్ట్ కోసం వెతుకుతుంటే కథాగ్రూప్ గురించి తెలిసింది. ఇంకేం కథా గ్రూప్‌లోని సభ్యులకే కథలపోటీ పెడితే కొత్తవారికి ఉత్సాహపరిచినట్టూ ఉంటుంది.. నాకు మంచి సబ్జెక్టూ దొరుకుతుంది కదా అని పోటీ గురించి గ్రూప్‌లో పోస్ట్ చేశాం. ఉత్తమ కథగా ఎంపికైన దాంతో సినిమా తీస్తాను. మొదటి మూడు కథలకు ఐదువేలు, మూడువేలు, రెండువేలు చొప్పున బహుమతులూ పెట్టాం’అని తెలిపారు బాలరాజు.
కొసమెరుపు
కథాగ్రూప్ నిర్వహిస్తున్న కథల పోటీకి వచ్చిన ఎంట్రీలు ఆశ్చర్యం కలిగించాయి. ఎవరైతే సాహిత్య ప్రపంచానికి దూరంగా ఉంటారో.. ఎవరు టెక్నాలజీతో సావాసం చేస్తారని అపోహ ఉందో వాళ్ల నుంచే.. అదే సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ సెక్టార్స్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు నిర్వాహకులు. మొత్తానికి ఫేస్‌బుక్ పేజీల్లోకి ఎక్కిన కథాగ్రూప్ సెల్ స్క్రీన్‌మీద నిక్షేపంగా జీవించేస్తోంది. లాంగ్ లివ్ రీడింగ్...! కథా.. కలకాలం వర్ధిల్లు!