వెస్ట్రన్‌ సిస్టర్స్‌ మహిళా ఉద్యమ వారధులు

Western Sisters for ladys movement - Sakshi

మారామనీ, మారుతున్నామనీ ఎంతగా చెప్పుకుంటున్నా.. సమాజంలో స్త్రీ, పురుషులింకా ఈక్వల్‌ ఈక్వల్‌ కాలేదు. లైంగిక సమానత్వం కోసం కలిసి ప్రయాణించవలసిన దూరం ఇంకా మిగిలే ఉంది! అయితే అసలంటూ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టినవారు కూడా మహిళలే కావడం స్ఫూర్తినిచ్చే విషయం. వారిని మన ప్రతి అడుగులోనూ గుర్తుచేసుకోవడం.. మన సమానత్వ ప్రయాణానికి చోదక శక్తి అవుతుంది.

మహిళా సమాజానికి ప్రేరణను, శక్తిని ఇచ్చిన ఆ మహిళల్లో ఎక్కువమంది వర్కింగ్‌ ఉమెనే!  వాళ్ల ప్రయత్నం, వాళ్ల సంకల్ప బలం కారణంగానే సమానత్వం వైపుగా ఇవాళ మనం ఇంతమాత్రపు ‘ఈక్వాలిటీ’నైనా సాధించగలిగాం. ‘ఫస్ట్‌ లేడీ’ సంప్రదాయ పాత్రను మార్చిన ఎలినార్‌ రూజ్వెల్ట్‌ దగ్గర్నుంచి, యు.ఎస్‌. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ షిర్లీ ఛిజమ్‌ వరకు.. ప్రపంచ గతిని మలుపు తిప్పిన  పది మంది మహిళల వివరాలు, విశేషాలు ఇవి.

రోజీ ది రివెటర్‌
‘వియ్‌ కెన్‌ డు ఇట్‌’ అనే క్యాప్షన్‌ ఉన్న చిత్రం ప్రపంచ ప్రసిద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమెరికన్‌ గృహిణుల్ని ఇళ్లలోంచి బయటికి రప్పించి.. పరిశ్రమల్లోకి, కర్మాగారాల్లోకి, సైనిక దళాల్లోకి ఉద్యోగినులుగా వచ్చేందుకు వాళ్లకు స్ఫూర్తినిచ్చిన ఈ పోస్టర్‌కు ప్రేరణ... నవోమీ పార్కర్‌ ఫ్రేలే అనే స్త్రీ మూర్తి ఫొటో.

కాలిఫోర్నియాలో ఆమె వెయిట్రెస్‌గా పనిచేస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటో తీసి ఓ పత్రికకు ఇస్తే, ఆ పత్రికలో నవోమీని చూసిన ఓ చిత్రకారుడు ‘వియ్‌ కెన్‌ డు ఇట్‌’ చిత్రాన్ని రూపొందించారు. దానిని అమెరికా ప్రభుత్వం తన అధికార మహిళా నియామకాలకు ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రంగా ఉపయోగించుకుంది.

రూస్‌ బేడర్‌ గిన్స్‌బెర్గ్‌
1993లో బిల్‌ క్లింటన్‌ సుప్రీంకోర్టు అసోసియేట్‌ జస్టిస్‌గా రూస్‌ను నియమించారు. అప్పటికి సుప్రీంకోర్టుకు ఆమె రెండో మహిళా న్యాయమూర్తి. అంతకుముందు 1980లో జిమ్మీకార్టర్‌ రూస్‌ను కొలంబియా సర్క్యూట్‌ డిస్ట్రిక్ట్‌కు యు.ఎస్‌.అప్పీళ్ల న్యాయమూర్తిగా నియమించారు. అయితే రూజ్‌ ప్రతిభా సామర్థ్యాలు తన విధి నిర్వహణకు మాత్రమే పరిమితం కాలేదు. స్త్రీ, పురుష సమానత్వం, మహిళల హక్కుల కోసం ఆమె కృషి చేశారు. ‘ఉమెన్‌ రైట్స్‌ ప్రాజెక్టు’కు స్వచ్ఛంద న్యాయవాదిగా పని చేశారు.

షిర్లీ ఛిజమ్‌
రాజకీయవేత్త, టీచర్, రచయిత్రి. యు.ఎస్‌. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసిన తొలి మహిళ కూడా. రాజకీయాల్లోకి వెళ్లే ముందు వరకు బ్రూక్లిన్‌లో, మన్‌హట్టన్‌లో స్కూళ్లు, డేకేర్‌ సెంటర్లు నిర్వహించారు. తన కెరీర్‌ మొత్తంలో, ఏడుసార్లు యు.ఎస్‌. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో.. మహిళల, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడ్డారు. విద్యకు, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు.

మేరీ టైలర్‌ మూర్‌
1960లు, 70లు, 80లలో హాలీవుడ్‌ చిత్రాల్లోని మహిళల మూస పాత్రలు.. కాస్త వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలుగా పరివర్తన చెందడంలో మేరీ టైలర్‌దే ప్రధాన పాత్ర. అలా దర్శకుల్ని, నిర్మాతల్ని ఆమె ‘ఎడ్యుకేట్‌ చెయ్యగలిగారు. అప్పట్లో టీవీలో ‘ది మేరీ టైలర్‌ మూర్‌ షో’ పెద్ద సంచలనం. పురుషాధిక్యంపై ఆ షోలో ఆమె పిడిగుద్దులు కురిపించేవారు.

ఉద్యోగినులుగా, పరిశ్రమల నిర్వాహకులుగా మహిళల సామర్థ్యాన్ని చూపించే కార్యక్రమాలను రూపొందించారు. సామాజిక, రాజకీయ రంగాలలోనూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మేరీ టైలర్‌.. ఆ రంగాలలోనూ మహిళ సమానత్వం కోసమే వ్యూహరచన చేశారు.

గ్లోరియా స్టైనమ్‌
ఎనభై ఏళ్ల వయసులోనూ గ్లోరియా లైంగిక సమానత్వం కోసం పోరాడారు! గ్లోరియా ఫెమినిస్టు. యాక్టివిస్టు. 1960లు, 70లలో అమెరికన్‌ ఫెమినిస్టు ఉద్యమంలో ఆమెది సారథ్యగళం. ప్రసిద్ధ ‘ఎస్‌క్వెయర్‌’, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికలకు ఫ్రీలాన్సర్‌గా పనిచేశారు.

ప్రధానంగా మహిళా సమస్యల్యే రిపోర్ట్‌ చేశారు. ‘ఉమన్‌ యాక్షన్‌ అలయెన్స్‌’, ‘నేషనల్‌ ఉమెన్స్‌ పొలిటికల్‌ కాకస్‌’, ‘ఉమెన్స్‌ మీడియా సెంటర్‌’, ‘మిస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఉమెన్‌’ వంటి సంస్థలకు సహ వ్యవస్థాపకురాలిగా, వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.

బిల్లీ జీన్‌ కింగ్‌
‘బ్యాటిల్‌ ఆఫ్‌ సెక్సెస్‌’తో బిల్లీ జీన్‌ కింగ్‌ ప్రసిద్ధురాలయ్యారు. ప్రపంచ చరిత్రలో స్త్రీ, పురుషుల మధ్య మొట్టమొదటిసారిగా జరిగిన ఆ టెన్నిస్‌ ‘యుద్ధం’లో ఓడిపోయింది ఎవరో తెలుసా? పురుషులు!! అధికులమని, అరివీరభయంకరులమని నిత్యం నిద్రలేవడంతోనే అహకరిస్తుండే పురుషులు ఆ రోజున తోక ముడిచి, మహిళల ఆత్మవిశ్వాసానికి మోకరిల్లారు.

ప్రపంచ మహిళల పరువును నిలబెట్టడం కోసం టెన్నిస్‌ బరిలోకి దిగిన బిల్లీ జీన్‌ కింగ్‌... 6–4, 6–3, 6–3 తేడాతో మగ దురహంకార వరాహం... బాబీ రిగ్స్‌ను ఘోరాతిఘోరంగా ఓడించి మగవాళ్ల ఆధిక్యపు లోకాలను తిరగేసి, తలకిందులు చేశారు. టీవీల ముందు కూర్చుని సుమారు ఐదు కోట్లమంది, ప్రత్యక్షంగా ముప్పై వేల మంది చూస్తుండగా హోస్టన్‌లోని ఆస్ట్రోడోమ్‌ టెన్నిస్‌ కోర్టులో 1973 సెప్టెంబర్‌ 20న  ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సెక్సెస్‌’ సాగింది. పురుషాధిక్యపు ఓడలు తిరగబడిన రోజు అది.

ఎలినార్‌ రూజ్వెల్ట్‌
అమెరికాను ‘గ్రేట్‌ డిప్రెషన్‌’ నుండి తప్పించే ప్రయత్నంలో అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ డిప్రెషన్‌లో పడిపోకుండా చెయ్యి అందించిన గ్రేట్‌ ఉమన్‌.. మిసెస్‌ రూజ్వెల్ట్‌! దేశాన్ని గట్టెక్కించేందుకు రూజ్వెల్ట్‌కు వచ్చిన ‘న్యూ డీల్‌’ఐడియా.. డైనింగ్‌ హాల్లో మిసెస్‌ రూజ్వెల్ట్‌ ఇచ్చిందేనని డీల్‌కు కాళ్లడ్డు పెట్టిన కన్జర్వేటివ్‌ల అనుమానం. ఎవరేం అనుకున్నా.

ప్రత్యక్షంగా అధ్యక్షుడికి, పరోక్షంగా అగ్రరాజ్యానికీ ఆమె.. కొత్త ఊపిరి, ఉత్సాహం ఇచ్చిన మాట వాస్తవం. ఇందుకోసం ఎలినార్‌ వ్యూహ సారథుల శ్వేతసౌధాన్ని సైతం అమెరికన్‌ పౌరుల అతిథిగృహంలా మార్చారు.ఎలినార్‌ ప్రత్యేకించి మహిళల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు.

బెట్టీ ఫ్రైడే ఫ్రైడే
1963లో రాసిన ‘ది ఫెమినైన్‌ మిస్టిక్‌’ అనే పుస్తకంతో బెట్టీ మహిళా హక్కుల కార్యకర్తగా వెలుగులోకి వచ్చారు. ప్రసిద్ధ సంస్థ  ‘నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఉమెన్‌’ సహవ్యవస్థాపకులలో ఆమె ముఖ్యులు. ‘నేషనల్‌ అబార్షన్‌ రైట్స్‌ యాక్షన్‌ లీగ్‌’ ఆవిర్భావంలోనూ ఆమె కృషి ఉంది. తన జీవితకాలమంతా బెట్టీ మహిళల హక్కుల కోసమే పాటుపడ్డారు. అనేక పుస్తకాలు రాశారు.

బార్బారా వాల్టర్స్‌
అమెరికన్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టు. టెలివిజన్‌ పర్సనాలిటీ. వ్యాఖ్యాత. సామాజిక కార్యకర్త. మహిళల కోసం అనేక ‘షో’లను రూపొందించారు. మహిళా సమస్యలపై డిబేట్‌లు నిర్వహించారు. వృత్తిధర్మంగానే కాక, వ్యక్తిగతంగా కూడా బార్బారా.. మహిళా సంక్షేమం దిశగా సమాజంతో చైతన్యం తెచ్చే అనేక సూచనలు, సలహాలను తన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు.

మాయా ఏంజెలో
రచయిత్రి, కవయిత్రి, నాటకకర్త, నాట్యకారిణి, గాయని, హక్కుల కార్యకర్త. తన జీవితాన్ని సందేశంగా, సంకేతంగా తన సృజనాత్మక ప్రక్రియలతో మహిళలకు అందించారు. ఈజిప్టులో, ఘనాలో జర్నలిస్టుగా చేశారు. అక్కడి మహిళా సమస్యల్ని ప్రపంచం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా  లైంగిక వివక్ష, లైంగిక సమానత్వం అనే అంశాలపై జీవితకాల కృషి సల్పారు.                              

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top