చీమ కుట్టినట్టు కూడా ఉండదు! | stitching will not have to! | Sakshi
Sakshi News home page

చీమ కుట్టినట్టు కూడా ఉండదు!

Nov 2 2016 11:22 PM | Updated on Sep 4 2017 6:59 PM

చీమ కుట్టినట్టు కూడా ఉండదు!

చీమ కుట్టినట్టు కూడా ఉండదు!

గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారం లేదా వెండి తీగలతో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు.

గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారం లేదా వెండి తీగలతో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీసెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. అయితే డాక్టర్ ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు.

ఇలా చెవి, ముక్కు, లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముక్కు, చెవులు కుట్టించడం మరింత అందంగా, ఆకర్షణీయంగా చేయవచ్చు.

అనర్థాలు ఇవి...
ఇన్ఫెక్షన్స్: కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు.

సిస్ట్/గ్రాన్యులోమా ఏర్పడటం:  ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం  కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి.

మచ్చ ఏర్పడటం: కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

అలర్జీలు: కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు...
చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని విచారించడం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయడం మంచి పద్ధతి. చెవులు, ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి.మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి.

 సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ...  ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్‌డ్ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది.చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,  త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement