పుస్తకం.. పెన్ను

పుస్తకం.. పెన్ను - Sakshi


వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కొన్ని ఘట్టాలు



వైఎస్‌ ఉదయం నాలుగున్నరకే లేచేవారు. గంటసేపు వ్యాయామం, ట్రెడ్‌మిల్‌ మీద వాకింగ్‌... పదినిమిషాలు ధ్యానంతో తన రోజును ప్రారంభించేవారు. ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు పక్కనే చిన్నపుస్తకం.. పెన్ను పెట్టుకునేవారు. ఏదైనా ఆలోచన వస్తే వెంటనే రాసేసుకోవడం ఆయనకు అలవాటు.  2007 ఫిబ్రవరి 15న శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ ‘నాకు బ్రాహ్మీముహూర్తంలో బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తాయి. అలా వచ్చిందే ఇందిరమ్మ కార్యక్రమం. ‘‘ఇళ్లు, పెన్షన్లు, మౌలిక సదుపాయాలను సంతృప్త స్థాయికి తీసుకువెళ్లాలనే మంచి ఆలోచన ఎలా వచ్చింది’’ అని గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డి.శ్రీనివాస్‌ చాలాసార్లు అడిగారు నన్ను. తెల్లవారు ఝామున ఏకాంతంగా ప్రశాంతతో గడపడం వల్ల’ అని చెప్పాను’ అంటూ తన అలవాటు గురించి వైఎస్‌ వివరించారు కూడా.



పరిశుభ్రత పట్టింపు

అన్నీ నీట్‌గా... పొందిగ్గా ఉంటేనే ఇష్టపడేవారు వైఎస్‌. విడిచిన బట్టలను కుప్పలా పారేయడం నచ్చేది కాదు. అందుకే ఎక్కడికైనా టూర్లకు వెళ్లినప్పుడు విడిచిన బట్టలను చేతులతోనే ఇస్త్రీ చేసినట్టుగా మడతపెట్టి సూట్‌కేస్‌లో సర్దేవారు. గదిలో ఒక్క కాగితం ముక్క కనపడినా స్వయంగా తీసి డస్ట్‌బిన్‌లో వేసేవారు. టేబుల్‌ మీదున్న వస్తువులను చిందరవందరగా ఉండనిచ్చేవారు కాదు. న్యూస్‌పేపర్లను కూడా టైటిల్స్‌ కనిపించేలా ఒక క్రమంలో సర్దుకునేవారు. చదివేసిన పేపర్లను సైతం అప్పుడే వచ్చిన పేపర్‌లా పొందిగ్గా పెట్టేవారు. బాత్రూమ్‌ నీట్‌గా లేకపోతే ఆయనకు నచ్చేదికాదు. తన బాత్రూమ్‌ని ఇంకెవరూ వాడరాదు. ఏళ్లకు ఏళ్లు వైఎస్‌ హైదరాబాద్‌ నుంచి కడపకు రైల్లోనే వెళ్లారు. వైఎస్‌కు రిజర్వ్‌ అయిన కోచ్‌ తాలూకు బాత్రూంను ఇద్దరు మనుషులను పెట్టించి క్లీన్‌ చేయించేవాడట సూరీడు.



 ఘంటసాల పాటలు...

ప్రతిరోజూ నలభైనిమిషాలు కుటుంబ సభ్యులతో గడిపేవారు వైఎస్‌. సాధ్యమైనంత వరకు ఆదివారాన్ని ఆదివారంలాగే అంటే రిలాక్స్‌డ్‌గా ఉండడానికి ప్రయత్నించేవారు. పనిదినాల్లో.. బయటి ఒత్తిడిని ఇంటికి ఏమాత్రం మోసుకొచ్చేవారు కాదు. సచివాలయం నుంచి ఇంటికి వెళ్తూ కార్లో అయిదు నిమిషాలపాటు కళ్లు మూసుకొని గట్టిగా గుండెల నిండా శ్వాస తీసుకొని వదిలేవారు. ఇలా రెండుసార్లు చేసేవారు. దాంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేవారు. ఇంట్లోకి అడుగుపెడతూనే ఘంటసాల పాటలు వినడమంటే చెప్పలేనంత ఇష్టం. ఆ సమయంలో టీవీ ఆన్‌ చేసి ఉంటే వెంటనే కట్టేసేవారు. చివరకు విజయలక్ష్మిగారు చూస్తున్నా సరే!



ఏంటా భాష?

2003, మార్చి 22... శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతోంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జేసి దివాకర్‌రెడ్డి .. ‘మున్సిపల్‌ ఎన్నికల్లో పరిటాల రవి చేసిన దౌర్జన్యాన్ని నువ్వు సమర్థించడం భావ్యం కాదు’ అన్నారు. అప్పుడు వెంటనే వైఎస్‌ జోక్యం చేసుకొని ‘దివాకర్‌ .. ఏంటా భాష? నువ్వు అంటావేటిమి? ఎవరితో మాట్లాడినప్పుడయినా ‘మీరు’ అని సంబోధించడం మంచిది’ అన్నారు. కాస్త నొచ్చుకొని , తనను తాను సమర్థించుకుంటూ దివాకర్‌రెడ్డి.. ‘మన రాయలసీమ భాషలో నువ్వు అనడం మామూలే కదా అన్నా’ అన్నాడు. వైఎస్‌.. ‘సమర్థించుకోకయ్యా... తప్పు సర్దుకో.. సరిదిద్దుకో’ అన్నారు కాస్త గట్టిగా. దాంతో జేసీ దివాకర్‌రెడ్డి ... చంద్రబాబుకు ‘సారీ’ చెప్పారు.



గుడ్‌ మార్నింగ్‌ ఎవ్రీబడీ...

క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ను కలవడానికి వచ్చిన వారందరినీ కలియచూస్తూ... ‘గుడ్‌ మార్నింగ్‌ ఎవ్రీబడీ’ అంటూ చిరునవ్వుతో పలకరించేవారు. అలాగే ఎప్పుడైనా క్యాంప్‌ కార్యాలయానికి రావడం ఆలస్యమైతే వీఐపీలు ఎదురు చూస్తున్నా సరే.. ముందుగా సామాన్యులు ఉండే గ్యాలరీకే వెళ్లేవారు. ‘వీఐపీలు రేపైనా రాగలరు... బీదాబిక్కీ మళ్లీ మళ్లీ రాలేరు కదా’ అని అంటుండేవారు. అలాగే వచ్చిన వారు తనను తాను పరిచయం చేసుకుంటే ఆ వ్యక్తి పేరు, అతను ఉండే ఊరిపేరునూ గుర్తుపెట్టుకునేవారు. ఆ తర్వాత మళ్లీ ఏదైనా పని మీద ఆ ఊరు వెళ్లినప్పుడు ఆ రోజు తనను క్యాంప్‌ ఆఫీస్‌లో కలిసిన ఫలానా పేరు గల మనిషి బాగున్నాడా అంటూ గుర్తుచేసేవారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top