ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!


ఉన్నత చదువులు చదివి... గొప్ప ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తి సినీదర్శకుడు అవడమేంటి?  

 తొలి సినిమానే సరైన సమయానికి విడుదల కాలేదు. అలాంటి  వ్యక్తి... 73 సినిమాల దర్శకునిగా ఎదగడమేంటి?  ‘వీడు గనుక దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి చంపేస్తాడ్రా’ అని అందరితో అనిపించుకున్న వ్యక్తి ముప్ఫై ఏళ్ల పాటు జనాలను ఏకధాటిగా నవ్వించడమేంటి?

ఇన్నాళ్ల ఆ నవ్వుల ప్రయాణం వెనుక చెరగని ఆ కన్నీటి మరక ఏంటి?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుందా! అయితే చదవడం మొదలుపెట్టండి. దర్శకుడు రేలంగి నరసింహారావు కామెడీ వెనుక ఎంత కథ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత కన్నీరుందో...


 

తెరపై మీదో ప్రత్యేక సంతకం కదా! మీరిలా సెలైంటయ్యారే?



1996 నుంచి వరుసగా నాలుగేళ్లు కన్నడ సినిమాలు చేశా. తెలుగు సినిమా పూర్తి స్థాయిలో హైదరాబాద్‌కు షిఫ్టయ్యింది అ టైమ్‌లోనే. కన్నడంలో కమిట్‌మెంట్‌లు పూర్తి చేసుకొని 1999లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికే జరగకూడని డామేజీ జరిగిపోయింది. నా గ్యాప్ ఇక్కడ భర్తీ అయిపోయింది. ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి బిజీ అయ్యారు. ఒక్కసారి వెనుక పడ్డాక, ముందుకెళ్లడం చాలా కష్టం. ట్రెండ్ కూడా మారింది. పైగా ‘రేలంగి నరసింహారావు కన్నడంలో స్థిరపడిపోయాడు’ అనే వార్తలు అప్పటికే పేపర్లలో వచ్చాయట. నిజానికి నేను అక్కడ సెటిల్ అవ్వలేదు. మా అత్తగారి ఊరు బెంగళూరు. అందుకే కొన్ని రోజులు అక్కడే ఉండి సినిమాలు చేశా. దానికి ప్రతిఫలమే ఈ విరామం. ఇక్కడకు రాగానే  రాజేంద్రప్రసాద్‌తో ‘అమ్మో బొమ్మ’ తీశా. ఆడలేదు. ఆ తర్వాత ‘ప్రేమించుకున్నాం పెళ్లికి రండి’ తీశా. అదీ ఆడలేదు. తర్వాత దుకాణం తెరిచి ఉంచినా మన దగ్గరకు ఎవరూ రాలేదు. ఏం చేస్తాం.

     

వరుసగా సినిమాలు చేసిన మీకు ఈ విరామం ఇబ్బందిగా లేదా?



నా అదృష్టం ఏంటంటే.. ఇంకా నా పేరు మరుగున పడలేదు. ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, పోలీసుభార్య, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, బ్రహ్మచారి మొగుడు’ లాంటి చిత్రాలు టీవీల్లో వస్తుంటే జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్టయినా మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నా నమ్మకం. త్వరలో మా గురువు గారైన దాసరి గారి బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ రెడీ. త్వరలోనే సెట్స్‌కి వెళతాం.  

     

అసలు దర్శకునిగా మీ తొలి అడుగు ఎలా పడింది?



మా నాన్నగారు రేలంగి శ్రీరంగనాయకులు మా ఊళ్లో పేరున్న వైద్యులు. నన్ను కూడా డాక్టర్‌గా చూడాలనేది నాన్న కోరిక. అందుకే బీఎస్సీలో చేర్పించారు. మార్కులు సరిగ్గా రాలేదు. నిరుత్సాహానికి లోనై, ‘డాక్టర్ చదువుకి నేను పనికిరాను’ అని నాన్నకు నిర్మొహమాటంగా చెప్పేశాను. నా పరిస్థితిని గమనించిన నాన్న.. ‘ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహించడం కరెక్ట్’ అనుకొని మద్రాస్ తీసుకెళ్లారు. రవిరాజా పినిశెట్టి తండ్రి పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు మా నాన్నకు మంచి మిత్రుడు. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. అక్కడే గురువుగారు దాసరిగారిని తొలిసారి చూశా. రామ్మూర్తిగారి రికమెండేషన్‌తో ‘మహ్మద్‌బీన్ తుగ్లక్’ సినిమాకు దర్శకుడు బీవీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆ చిత్రానికి దాసరిగారే రైటర్. అప్పట్నుంచీ ఆయనతో టచ్‌లో ఉండేవాణ్ణి. తర్వాత నేను కేఎస్‌ఆర్ దాస్‌గారి దగ్గర ‘ఊరికి ఉపకారి’ చిత్రానికి అసిస్టెంట్‌గా చేరాను. అప్పుడే గురువుగారి ‘తాతామనవడు’ మొదలైంది. ‘వచ్చేస్తాను సార్’ అన్నాను. ‘సినిమా మధ్యలో వదిలిపెట్టి రావద్దు. మంచి పద్ధతి కాదు. కష్టమైనా నష్టమైనా ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసి రావడం ధర్మం’ అని కచ్చితంగా చెప్పేశారు గురువుగారు. గురువుగారి రెండో సినిమా నుంచీ నేను ఆయన బృందంలో చేరిపోయాను. అలా 1973 నుంచి 1979 వరకూ దాసరిగారితో నా ప్రయాణం సాగింది. ‘సర్కస్‌రాముడు’ నిర్మాత కోవై చెళియన్ గురువుగారితో ఓ సినిమా చేయాలనుకున్నారు. గురువుగారికేమో విపరీతమైన కమిట్‌మెంట్లు. దాంతో ‘మా నరసింహారావు చేస్తాడు లెండీ. నేను పర్యవేక్షిస్తాను’ అని దర్శకునిగా నాకు ప్రమోషన్ ఇప్పించారు  గురువుగారు. అలా ‘చందమామ’తో దర్శకుణ్ణి అయ్యాను.

     

మరి మీ తొలి సినిమా ‘చందమామ’కు ఇబ్బందులొచ్చాయట..



నిర్మాత చెళియన్‌గారికి, పంపిణీదారులకీ మధ్య మనస్పర్థలొచ్చాయి. వాళ్లే తన దగ్గరకొస్తారని ఆయనా, ఆయనే వస్తారని పంపిణీదారులు భీష్మించుకొని కూర్చోవడంతో సినిమా విడుదల ఆగింది. అప్పుడు గురువుగారు కలుగజేసుకొని నిర్మాతకు, పంపిణీదారులకూ మధ్య రాజీ కుదిర్చారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత సినిమా విడుదలైంది. అప్పటికే నా దర్శకత్వంలో ‘నేనూ మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు’ చిత్రాలు విడుదలై నాకు కామెడీ ఇమేజ్ వచ్చేసింది. దాంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. నిజానికి అది చాలా మంచి కథ. సీరియస్ సబ్జెక్ట్. మురళీమోహన్, మోహన్‌బాబు, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి ఇలా హేమాహేమీలు నటించారు. సరైన సమయంలో అది విడుదలైతే, నా ప్రయాణం వేరేలా ఉండేది. బహుశా నా నుంచి సీరియస్ సినిమాలే వచ్చేవేమో!

     

అసలు కామెడీ బాట ఎలా పట్టారు?



‘చందమామ’ తర్వాత అనుకోకుండా కామెడీ కథ చేయాల్సొచ్చింది. రాంబాబుగారని.. ఎన్టీఆర్‌గారి బావమరిదికి బావమరిది. తను నిర్మాత. గురువుగారు దర్శకత్వ పర్యవేక్షణ. సినిమా పేరు ‘నేను - మా ఆవిడ’(1980). ఓ బ్రహ్మచారి కథ అది. పెద్ద హిట్. వందరోజులాడింది. ఆ సినిమా పుణ్యమా అని నాకు కామెడీ ఇమేజ్ పడిపోయింది.

     

కామెడీకే అంకితమైపోయానని ఎప్పుడైనా బాధపడ్డారా?



ఆ ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. ఇప్పటికీ నాకు నేను అదృష్టవంతునిగా ఫీలవుతా. సాధారణంగా సినీరంగంలో పోటీ ఎక్కువ. కానీ.. నాకు జంధ్యాల మాత్రమే పోటీ. జంధ్యాల తెలుగుకే పరిమితం అయ్యారు. నేను ఇతర భాషల్లోనూ చేశా. కన్నడంలో ఏడు సినిమాలు చేశాను. తమిళంలో నగేశ్ గారబ్బాయి ఆనంద్‌బాబుతో ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ రీమేక్ చేశాను. హిందీలో కూడా అదే సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. రిషి కపూర్ హీరో. కానీ జస్ట్ మిస్. లేకపోతే హిందీలో కూడా నాది ఓ సినిమా ఉండేది.

     

వంద సినిమాలకు దగ్గర పడుతున్నట్లున్నారు...



లేదండీ... 73 సినిమాలు చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద సినిమాలు చేయడం కష్టమే. కన్నడంలోకి వెళ్లకపోతే మాత్రం కచ్చితంగా వందకు దగ్గర పడేవాణ్ణి. ఏంటండీ... ఒక్క 1989లోనే నావి 11 సినిమాలు విడుదలయ్యాయంటే నమ్ముతారా!. ఏడాదికి 11 సినిమాలతో ఓ మలయాళ దర్శకుడు అప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉన్నాడు. కృష్ణంరాజుగారి ‘యమధర్మరాజు’ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. అయితే... ఆ సినిమా ఆ మరుసటేడు 1990లో విడుదలైంది. అలా ఒక్క చిత్రంతో గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా.

     

లేకపోతే, దాసరిగారితోపాటు వారి శిష్యుల్లో కూడా ఒకరు గిన్నిస్ రికార్డ్‌లో ఉండేవారన్నమాట?

 

గురువుగారితో పోలిక వద్దండీ. ఆయన మహానుభావుడు. నా తొలి సినిమా ‘నేనూ మా ఆవిడ’ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభోత్సవం అవుతుందనగా... ఎన్టీఆర్‌గారు అన్నమాట నాకింకా గుర్తు. ‘అందరు గురువుల్లాంటి గురువు కాదండీ మీ గురువు. అందరూ విద్య నేర్పి వదిలేస్తారు. కానీ మీ గురువు మీ అభ్యున్నతికి కూడా బాటలు వేస్తారు. అరుదుగా ఉంటారు అలాంటి గురువులు. నేను నీ తొలి సినిమా ప్రారంభోత్సవానికి వస్తాను. మొదటి కొబ్బరికాయ నేనే కొడతాను’ అని దీవించారు. అన్నట్లుగానే వచ్చి దీవించారు. రామారావుగారు అన్నారని కాదు కానీ... మా గురువుగారు నిజంగా అంతటి గొప్పవారే. కొంతమంది గురువులు శిష్యులు పైకొస్తున్నా తట్టుకోలేరు. కానీ మా గురువుగారికి అలాంటి అసూయ ఇసుమంత కూడా ఉండదు. ఎప్పడూ మమ్మల్ని ప్రేమించారు. ఆయనకు తీరిక లేకపోతే... మా పేర్లు సూచించిన సినిమాలు చాలా ఉన్నాయి. గురుధర్మాన్ని గొప్పగా అవలంబించేవారాయన. ఆ గొప్పతనాన్ని దగ్గరగా చూశాం కాబట్టే మా అందరికీ ఆయన దైవం అయ్యారు. పరిశ్రమ పచ్చగా ఉండాలనే దృక్పథంతో సాధ్యమైనంతవరకూ ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆయన దారినే అనుసరిస్తూ శిష్యులమైన మేము కూడా గణనీయంగా సినిమాలు చేశాం. నేను 73 సినిమాలు చేస్తే... కోడి రామకృష్ణ తీసినవాటి సంఖ్య ఇప్పటికే 130 దాటిపోయింది. రవిరాజా పినిశెట్టి యాభైకి పైనే తీశాడు. ఇదంతా మా గురువుగారి ప్రేరణే.

     

అన్నట్లు... కోడి రామకృష్ణ, మీరూ చిన్ననాటి దోస్తులటకదా?

 

అవును.. కోడిరామకృష్ణ నా క్లాస్‌మేట్, రూమ్‌మేట్, బెంచ్‌మేట్ కూడా. పాలకొల్లులో మాది లంకంత ఇల్లు. మా తాతయ్యకు ఏడుగురు కొడుకులు. ఇంకో తాతయ్యకు అయిదుగురు కొడుకులు. అందరికీ ఒకటే వరండా. అక్కడ చదువు సాగడం చాలా కష్టం. అందుకని బయట రూమ్ తీసుకున్నా. కోడి రామకృష్ణ, నేను, మా ఇంకో మిత్రుడు సుబ్రహ్మణ్యం ఆ రూమ్‌లో ఉండేవాళ్లం. మొదట్నుంచీ రామకృష్ణకి సినిమాలపైనే దృష్టి. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని కలలు కనేవాడు. నాకేమో ఉన్నత చదువులు చదవాలని ఉండేది. నాటకాల రిహార్సల్స్ అంటూ ఎవరెవరినో గదికి తెస్తుండేవాడు. దాంతో నాకు, నా మిత్రుడు సుబ్రమణ్యంకి చిర్రెత్తుకొస్తుండేది. ఒక్కోసారి నేను, సుబ్రమణ్యం కలిసి రామకృష్ణను తెగ తిట్టేవాళ్లం. ‘అస్తమానం సినిమాలేంటి? నాటకాలేంటి? ఎప్పుడూ రూమ్ నిండా ఈ జనాలేంటి? అసలు నువ్వు మా రూమ్‌లో వద్దు. బయటకుపో’ అని సామాన్లు విసిరి కొట్టేవాళ్లం. కానీ... రామకృష్ణకు విపరీతమైన సహనం. అస్సలు కోపం  రాదు. చిన్నప్పట్నుంచీ అంతే. ఎంత తిట్టినా.. ‘రేపట్నుంచి ఉండదులే. బయట చూసుకుంటాం. ఈ ఒక్కరోజే’ అని ఎలాగోలా మభ్య పెట్టేవాడు. అవన్నీ మరిచిపోలేని రోజులు.

     

ఇంతకీ మీ అమ్మగారి గురించి చెప్పనే లేదు?

 

మా అమ్మ గృహిణి. పేరు శివరావమ్మ. అమ్మంటే నాకు చాలా ఇష్టం. కానీ ఓ చిన్న విషయం వల్ల మేం పదేళ్ల పాటు దూరమయ్యాం. చిన్న పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజం కదా! అలాగే, ఓ సారి మా తమ్ముణ్ణి కొట్టాను. అమ్మ తిట్టింది. ‘ఎందుకురా... పెద్దాడివై ఉండి... చిన్నాణ్ని పట్టుకొని అలా కొట్టడం. తప్పు కదా’ అని మందలించింది. ఆ చిన్న కారణం వల్ల పదేళ్ల పాటు అమ్మతో నాకు మాటల్లేవ్. బహుశా ఊళ్లో ఉంటే మాట్లాడేవాణ్ణేమో. నేను 1970లోనే మద్రాస్ వెళ్లిపోయా. దాంతో ఇక అమ్మతో మాట్లాడలేకపోయాను. ‘అమ్మ’ అనే పిలుపుకు కూడా ఆమెను దూరం చేశాను. 1968లో జరిగింది ఈ గొడవ. అమ్మ 1978లో చనిపోయింది.

     

అంత కోపం ఎందుకొచ్చింది?

 

అజ్ఞానం. తర్వాత తెలిసింది అది అజ్ఞానం అని. దాని వల్ల ఎంత పోగొట్టుకున్నానో తర్వాత తెలిసింది. 1978లో అమ్మ చనిపోయిందని మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆదుర్దాగా బయలు దేరాను. తెల్లారి పొద్దున్నే ఊళ్లోకి దిగాను. ఇంటి ముందు పందిరేసుంది. బయట బల్లలు పెట్టి ఉన్నాయి. కానీ అమ్మ భౌతిక కాయం మాత్రం అక్కడ లేదు. గుండె బరువెక్కింది. ‘అమ్మ ఏది?’ అని అక్కడున్నవాళ్లను కంగారుగా అడిగాను. ‘లేదయ్యా... రాత్రి అమ్మకు మళ్లీ ఊపిరొచ్చింది’ అని చెప్పారు. దాంతో పరుగు లాంటి నడకతో హాల్లోకి వెళ్లాను. అమ్మ పడుకొని ఉంది. మంచం చుట్టూ బంధువులు గుమిగూడి ఉన్నారు. కానీ... అమ్మ నా వైపే చూస్తోంది. నేను దగ్గరకు వెళ్లాను. అప్పటికే అమ్మకు మాట పడిపోయింది. నన్ను పట్టుకొని ‘ఆ... ఆ...’ అని ఏదో అంటోంది. నాకేం అర్థం కాక పక్కవాళ్ల వంక చూశాను. ‘ఏమీ లేదయ్యా... ఒక్కసారి ‘అమ్మా’ అని పిలవమంటోంది’ అన్నారంతా. ‘అమ్మా...’ అని పిలిచాను. అంతే... ఆమె కళ్లల్లో ఎప్పుడూ చూడనంత ఆనందం... బొటబొటా... కన్నీరు కార్చేసింది. నన్ను గట్టిగా కౌగిలించేసుకుంది. ‘ఇంకేం బాధ లేదు బాబూ... ఈ ఆనందంలో బతికేస్తుంది’ అన్నారంతా. కాసేపయ్యాక నేను లోపలకెళ్లి స్నానం చేసి వచ్చాను. ఇంతలో ఘొల్లున ఏడుపులు వినిపించాయి. ఏంటి? అంటే ‘అమ్మ చనిపోయింది’. నిజానికి అమ్మ ఆ ముందురోజు రాత్రే చనిపోయిందట. బయట పడుకోబెట్టేశారు. దండలు కూడా వేసేశారట. కానీ.. కేవలం నాతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసమే ఆమె మళ్లీ బతికింది. వైద్యశాస్త్రం ఇది అసంభవం అనొచ్చు. కానీ... కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో పుట్టిన వ్యక్తిగా దాన్ని నేను నమ్ముతాను. (కళ్లల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా..) అమ్మ విషయంలో నా తప్పు తెలుసుకున్నాను. కానీ... తప్పు తెలుసుకునేలోపే అమ్మే నాకు కరువైపోయింది. ఆ భగవంతుడు నాకు వేసిన పెద్ద శిక్ష అమ్మను దూరం చేయడం.

     

బాధపడకండి సార్... అమ్మ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అది సరే.. రేలంగి వెంకట్రామయ్యగారు మీకేమైనా బంధువా?

 

మా నాన్నకు కజిన్ రేలంగి గారు. నాకు పెదనాన్న అవుతారు. అయితే... నాకు ఆయనతో పరిచయం లేదు. ఆయన్ను తొలిసారి నేను చూసింది ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్‌లో. గురువుగారే దర్శకుడు. అందులో రేలంగి గారిది మంచి వేషం. టి.నగర్‌లోని ఆయన ఇంటి దగ్గరే షూటింగ్. నేను ఆయన బంధువునైనా ఏనాడూ ఆయన ఇంటికి కూడా వెళ్లలేదు. బంధుత్వం కలుపుకొని ఎదగాలనుకునే తత్వం కాదు నాది. అయితే... షూటింగ్ గ్యాప్‌లో ఓ సారి ఆయనే ‘ఏవయ్యా... ఇలా రా’ అని పిలిచారు. వెళ్లాను. ‘నీ పేరు రేలంగి నరసింహారావా? ఏ ఊరు నీది’ అనడిగారు. ‘పాలకొల్లండీ’ అని చెప్పాను. ‘ఎవరబ్బాయివేంటి?’ అనడిగారు. ‘రేలంగి రంగనాయకులుగారి అబ్బాయిని’ అని చెప్పాను. ‘ఓ హో... రంగడి కొడుకువా? వెరీగుడ్ వెరీగుడ్’ అనీ... ‘ఏమీ లేదయ్యా... మీ గురువు... నిన్ను తిడుతున్నాడో నన్ను తిడుతున్నాడో అర్థం కావడం లేదు. అయినా... నన్ను తిట్టేంత ధైర్యం అతనికి ఎక్కడుంది కానీ... నువ్వు ఓ పనిచేయ్. ‘నరసింహారావు’ అని పిలిపించుకో. రేలంగిని నేను ఉన్నానుగా’ అన్నారు ఆయన శైలిలో. నాకేమో ఓ వైపు నవ్వు, మరో వైపు... టెన్షన్. ‘అలా కాదండీ... గురువుగారి దగ్గరకెళ్లి అలా చెప్పలేనండీ’ అన్నాను. ‘అయితే ఓ పని చేసేయ్. ఈ సినిమా వరకు మానేయ్’ అన్నారు. ‘మా గురువుగారు మధ్యలో మానొద్దన్నారండీ’ అన్నాను. ‘ఏం గురువుగారయ్యా... అస్తమానం గురువుగారు.. గురువుగారు అనీ... పోనీ ఓ పనిచెయ్. పక్కనున్నవాళ్లతోనైనా ‘నరసింహారావు’ అని పిలిపించుకో. అప్పుడు మీ గురువు కూడా ‘నరసింహారావు’ అనే పిలుస్తాడు ఏమంటావ్’ అన్నారు. ‘సరే సార్’ అన్నాను. ఓ రెండ్రోజుల తర్వాత నిదానంగా గురువుగారికే ఈ విషయం చెప్పాను. ఆయన తాపీగా... ‘అలా అన్నారా!’ అన్నారు. అప్పట్నుంచీ షూటింగ్ అయ్యేంతవరకూ నన్ను ‘ఇదిగో ఇలా రా!’ అని పిలిచేవారు కానీ... ‘రేలంగీ...’ అనేవారు కాదు. రేలంగి గారితో నా తొలి అనుభవం అది.

     

మీ కుటుంబం గురించి చెప్పండి?



నా భార్య పేరు సాయిలక్ష్మి. పెద్దబ్బాయి హిప్నో థెరీపీ కోర్స్ చేశాడు. పాస్ట్‌లైఫ్ థెరపీ కూడా చేస్తాడు. ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిన్నవాడు అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఉద్యోగం. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. మనవళ్లు, మనవరాళ్ళు కోసం ఎదురుచూస్తున్నా.

 - బుర్రా నరసింహ

 

ఆ విషయంలో చంద్రమోహనే నా గురువు!



దర్శకునిగా నాకు గురువు దాసరిగారైతే.. కామెడీ విషయంలో మాత్రం చంద్రమోహన్‌గారు  గురువు. ఆయనతో 24 సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. బయట కూడా అద్భుతంగా నవ్విస్తారాయన. ఆయన్నుంచే నాకు హ్యూమర్ అలవడింది. గురువుగారి దగ్గర నాతోపాటు పనిచేసిన వారందరూ ఈ రోజు నన్ను చూసి ఆశ్చర్యపడుతుంటారు. ‘వీడు దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి జనాల్ని చంపేస్తాడ్రా’ అనేవాళ్లు అప్పుడంతా. అంత సీరియస్‌గా ఉండేవాణ్ణి. అలాంటి నేను కామెడీ డెరైక్టర్ని అయ్యానంటే... అదంతా దైవ నిర్ణయం. ఒక్క రాజేంద్రప్రసాద్‌గారితోనే 32 సినిమాలు చేశాను.

 

 నాకు నచ్చిన నా చిత్రాలు



 1. సంసారం

 2. చిన్నోడు పెద్దోడు

 3. పోలీసు భార్య

 4. ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం

 5 ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్

 6. బ్రహ్మచారి మొగుడు

 7. దాగుడు మూతల దాంపత్యం

 8. పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ

 9. మానసవీణ

 10. మామా అల్లుడు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top