మెడీ కూచిపూడి!

మెడీ కూచిపూడి!


హార్మోనల్ సింఫనీ

 

ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్.



దేహనిర్మాణం, గ్రంథుల పనితీరు, వాటి సమన్వయం గురించి పాఠాలు చెప్పే గురువు. హఠాత్తుగా ఓ రోజు కాలికి గజ్జెకట్టి  కూచిపూడి నాట్యం చేశారు.  ఆ నృత్యరూపకం కూడా దేహధర్మాల ఇతివృత్తంతోనే. వైద్యశాస్త్రాన్ని, సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని కలబోశారు డాక్టర్ జయంతీరమేశ్.

 

కూచిపూడి చరిత్రలోనే ఇదో వినూత్న ప్రక్రియ!



 కూచిపూడి నాట్యంలో పౌరాణిక, సామాజిక, చారిత్రక ఇతివృత్తాలకు నాట్యరూపం ఇచ్చాను. వైద్యరంగాన్ని నాట్యంతో సమ్మేళనం చేయాలనే ఆలోచన కొత్తది. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది ఒక కథ కాదు. దేహనిర్మాణాన్ని చెప్పాలి. కంటికి కనిపించని హార్మోన్లను పరిచయం చేయాలి. వాటి పనితీరును కళ్లకు కట్టాలి.

 

 ఇందుకు కూచిపూడి నాట్యంలో ముద్రలు లేవు. ఇంత కష్టపడ్డా డాక్యుమెంటరీలా తప్ప నాట్యప్రయోగంలా  అనిపించదేమోననే సందేహం ఒక పక్క. అయినా సరే శాస్త్రాన్ని, శాస్త్రీయ నృత్యానికి ఆపాదిస్తూ బాలేని రూపొందించాం. ఈ రూపకంలో మేము చెప్పదలుచుకున్న సందేశం చక్కగా ప్రసారమైంది. పధ్నాలుగు మంది పాల్గొన్న ఈ బాలే ప్రేక్షకులను అలరించింది కూడ.

 - భాగవతుల సేతురామ్, కూచిపూడి నాట్యాచార్యులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

 

ఏప్రిల్ ఆరు ఆదివారం సాయంత్రం. హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. మర్నాడు అంటే ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకలవి. డాక్టర్ జయంతీరమేశ్ బృందం ‘హార్మోనల్ సింఫనీ’ నృత్యరూపకం ప్రదర్శిస్తోంది. ఆద్యంతం రసవత్తరంగా సాగిన వైద్యనాట్యరూపకానికి గొప్ప ప్రశంస లభించింది. ఇదో వినూత్న ప్రయోగమని కితాబిచ్చారు నాట్యకారులు. ఇంతకీ ఈ ప్రయోగం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని డాక్టర్ జయంతీరమేశ్‌ని అడిగినప్పుడు ‘నా పేషెంట్లు, వారి అనారోగ్యాలే’ అన్నారాయన.

 

డాక్టర్ జయంతీరమేశ్‌ది విశాఖపట్నం. బాల్యం విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో గడిచింది. స్వతహాగా కళల పట్ల ఆసక్తి ఉండడంతో మెడిసిన్‌లో చేరడానికి ముందు రెండేళ్లపాటు వైజాగ్‌లో ‘కూచిపూడి’ నేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వైద్యవిద్యతోపాటు ఒడిస్సీ సాధన చేసినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. క్రమంగా వైద్యరంగంలో నిమగ్నమయ్యారు. వృత్తిలో ఎంతగా విలీనమైనప్పటికీ తన కళాభినివేశాన్ని మరవలేదు. అలాంటి స్పందనల్లో ఒకటి ఇలా నాట్యరూపకంగా మనముందుకొచ్చింది. అదే విషయాన్ని చెప్తూ ‘‘మా దగ్గరకు వచ్చే పేషెంట్లను చూస్తుంటే బాధ కలుగుతుంది.

 

 స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు, మహిళల్లో పీసీఓడీ  వంటివన్నీ జీవనశైలిలో చోటు చేసుకున్న విపరీత పరిణామాల వల్ల వస్తున్నవే. ఆ విషయం పేషెంట్లకు చెప్తూనే ఉన్నా...  ఎంతమందికని చెప్పగలను? నా దగ్గరకు వచ్చిన వారికి చెప్పగలను. వైద్యనిపుణుడిగా సదస్సులు పెట్టి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా వివరించవచ్చు. కానీ ఆ ప్రదర్శనకు ఎంతమందిని ఆకర్షించగలననేది మరో ప్రశ్న. అందుకే సాంస్కృతిక మాధ్యమాన్ని ఎంచుకున్నాను’’ అంటారు.

 

 రూపకల్పన కోసం...



ఈ తరం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన  కోసమే ఈ ప్రయత్నం అంటూ తన ప్రయత్నాలను వివరించారు. ‘‘నా ఆలోచనలు, భావాలను పాట రాసుకున్నాను. ఆ గేయానికి తగినట్లు కొరియోగ్రఫీ చేయడానికి చాలామంది ప్రముఖ నాట్యకారులను కోరాను. నా సంకల్పానికి ఆ దేవుడే అన్నీ అమర్చినట్లు భాగవతుల సేతురాం గారిని కలిపారు. ఆయన సంతోషంగా ఆ పనిలో మునిగిపోయారు. నేను ఈ రూపకం కోసం మళ్లీ నాట్యసాధన చేశాను’’ అన్నారు.

 

 ఆవిడే యాంకర్!

 

రమేశ్ ప్రయత్నానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు ఆయన శ్రీమతి డాక్టర్ శ్రీవల్లి. ఇదో సృజనాత్మకమైన ఆలోచన అంటారామె. ‘‘నేను థైరాయిడ్ సర్జన్‌ని. హార్మోన్ల అసమతౌల్యతతో వస్తున్న సమస్యలకు వైద్యం చేస్తుంటాను. కాబట్టి రమేశ్ ఈ నాట్యరూపకం గురించి చెప్పినప్పుడు ఎంతగా ఉద్వేగానికి లోనయ్యానంటే... ఇందులో నేను చేయగలిగింది ఏమైనా ఉందా అనిపించింది.



రమేశ్ తెలుగులో రాసిన గేయాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేశాను. ఈ హార్మోనల్ సింఫనీ రూపకాన్ని మొదట ఫిబ్రవరి ఒకటిన హైటెక్స్‌లో ఇంగ్లిష్ వెర్షన్‌లోనే ప్రదర్శించారు. వైద్యరంగానికి సంబంధించిన విదేశీ ప్రముఖులు హాజరైన కార్యక్రమం అది. ‘దేహనిర్మాణం- దాని పనితీరును భారతీయ సంప్రదాయ నాట్యరీతిలో చూడడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది’ అని ప్రశంసిస్తూ ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరమన్నారు వారంతా’’ అన్నారు శ్రీవల్లి.

 

 ఇతివృత్తం!



‘‘ప్రకృతితో మమేకమై మనిషి జీవించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ఆధునికతను స్వాగతించాలి. కానీ ప్రకృతికి దూరంగా వెళ్లకూడదు. ప్రకృతి విరుద్ధంగా సాగే జీవనంలో వికృతం విలయతాండవం చేయకముందే మేలుకో... అనే సందేశం ఉంటుంది. మనం ప్రకృతి క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే  హార్మోన్ల విడుదల కూడా క్రమం తప్పుతుంది.



హార్మోన్ల  విడుదల తీరు నాట్య లయకు తగినట్లు ఉంటుంది. నిర్దిష్టమైన చర్య ఉన్నప్పుడు దానికి ప్రతిచర్య కూడా అంతే నిర్దిష్టంగా ఉంటుంది. ఈ వరుస తప్పకూడదు. ఈ విషయాల పట్ల చైతన్యవంతం చేయడానికి దేశమంతా పర్యటించి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top