చిన్నప్పట్నుంచీ అలర్జీ.. తగ్గేదెలా?

చిన్నప్పట్నుంచీ అలర్జీ.. తగ్గేదెలా?


నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? 

- అనిల్‌కుమార్, నిజామాబాద్


 అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కన్‌స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి...


 యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.


 ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ.


 హెపార్‌సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది.


 సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది.


 నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్‌లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు.


 ఫాస్: మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు.


 రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది.


 కాలీ ఎస్: ఆయాసం ఎక్కువగా ఉంటుంది.


 మెర్క్‌సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది.


పైన పేర్కొన్న మందులన్నీ హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top