మాడే జీవితాల్లోని కాంతి | Girl Burn Brighter By Shobha Rao About An Indian Girl | Sakshi
Sakshi News home page

Nov 26 2018 1:03 AM | Updated on Nov 26 2018 1:03 AM

Girl Burn Brighter By Shobha Rao About An Indian Girl - Sakshi

రచయిత్రి శోభారావు

‘నువ్వు పుట్టే కొన్ని రోజుల ముందు, ఒక సాధువు మీ అమ్మ కలలోకి వచ్చి, నీ పేరు పూర్ణిమ అని పెడితే మాకు మగపిల్లాడు కలుగుతాడని చెప్పాడు’

అది 2001. ఆంధ్ర రాష్ట్రపు ఇంద్రవల్లి గ్రామంలో, పూర్ణిమ తల్లి మరణిస్తుంది. తండ్రి– పదహారేళ్ళ పూర్ణిమకి పెళ్ళి సంబంధాలు చూస్తుండగా, ‘గర్ల్స్‌ బర్న్‌ బ్రైటర్‌’ నవల మొదలవుతుంది. 
‘నువ్వు పుట్టే కొన్ని రోజుల ముందు, ఒక సాధువు మీ అమ్మ కలలోకి వచ్చి, నీ పేరు పూర్ణిమ అని పెడితే మాకు మగపిల్లాడు కలుగుతాడని చెప్పాడు’ అని పూర్ణిమకు చెప్పిన తండ్రి, ఆమె చంటిబిడ్డగా ఉన్నప్పుడు వొకసారి నదిలో పడబోతుంటే, ‘ఆడపిల్లేగా? ఒక చిన్న తోపు తోసేస్తే చాలు, పీడ విరగడవుతుంది’ అనుకున్నవాడు. అతను చీరలు నేస్తాడు. చెత్తకుప్పలనుంచి ప్లాస్టిక్‌ ఏరుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న పదిహేడేళ్ళ సవితను పనిలో పెట్టుకుంటాడు. 

పూర్ణిమ, సవితలకి స్నేహం కుదురుతుంది. పూర్ణిమ చదువు పదిహేనవ ఏట ఆగిపోతుంది. సవిత చదువేకోదు. ‘నీలిమందు బట్టలోనూ, పెరుగన్నంలో అరిటిపండు కలిపిన గిన్నెలో కూడా అందాన్ని చూడొచ్చు’ అని పూర్ణిమకి నేర్పిస్తుంది సవిత. ‘ఆకాశాన్ని చూడు. ఎన్ని నక్షత్రాలో!’ అంటూ సంతోషపడే స్వభావం. శాంతంగా ఉండే పూర్ణిమ తన పెళ్ళి గురించి మాట్లాడుతూ, ‘మరి ప్రేమ వద్దా?’ అని సవితను అడిగినప్పుడు, ‘ప్రేమంటే ఏమిటి పూరీ, ఆకలే కదా!’ అన్న తిరుగు ప్రశ్న వేస్తూ, ‘అర్థం చేసుకో. ముక్కలు ముక్కలుగా మింగబడటం కన్నా ఒకేసారి కబళించబడటం నయం’ అని వివరిస్తుంది. 

పెళ్ళి ఏర్పాట్లవుతుండగా, పూర్ణిమ తండ్రి సవితని బలాత్కారం చేస్తాడు. సవిత ఊరు వదులుతుంది. ఇక్కడినుండీ, రచయిత్రి శోభారావు రాసిన కథ, అమ్మాయిలిద్దరి దృష్టికోణాలని మార్చిమార్చి చూపిస్తుంది.
పూర్ణిమ పెళ్ళయి, భర్త నుండి హింసాత్మకమైన లైంగిక దాడులనీ, అత్తగారి వ్యతిరేకతనీ ఎదుర్కుంటూ కూడా సవిత గురించి ఆలోచించడం మానదు. ‘నన్ను లెంపకాయ కొట్టని రోజు కానీ, క్షమాపణ అడగమని హింసించని రోజూ కానీ గుర్తు లేదు’ అనుకున్న పూర్ణిమను రెండేళ్ళ తరువాత, ‘గొడ్రాలు’ అంటూ మరుగుతున్న నూనె మొహంమీద పోసి గెంటేస్తారు అత్తింటివారు. ‘నా వద్దున్న 5,000 రూపాయలూ, రెండు గాజులూ నన్ను ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు’ అని తెలిసిన పూర్ణిమ చీకటిరాజ్యంలోకి అడుగు పెడుతుంది. 
 
సవిత కోసం వెతుకుతూ, విజయవాడలో సరితను గుర్తుంచుకున్న ఆగంతుకుడిని కలుసుకుంటుంది. అతను సవిత పని చేసిన వేశ్యాగృహానికి పూర్ణిమను తీసుకువెళ్తాడు. పూర్ణిమ స్నేహితురాలిని కలుసుకునే ముందే, సవితను సియాటల్‌లో ఉండే భారతీయుడికి అమ్మేస్తారు. పూర్ణిమ డబ్బు కూడబెడుతుతూ, ఇంగ్లిష్‌ నేర్చుకుంటూ, పాస్‌పోర్ట్‌ తెచ్చుకుంటుంది. అమెరికాలో కాలు పెట్టిన సవిత మొదట, ‘నేను మంచి, దయగల దేశంలో ఉన్నట్టున్నాను’ అనుకుంటుంది. ఇళ్ళు తుడుస్తూ, తన్ని సియాటల్‌ తెచ్చిన మోహన్‌కు దగ్గరవుతుంది. ఆమెని ఎత్తుకుపోయి, ఒక షెడ్లో ఆమెపైన సామూహిక అత్యాచారం జరుపుతారు కొందరు.

ఇంతలో, పూర్ణిమ సియాటల్‌ చేరుకుని మోహన్‌ను కలుసుకుంటుంది. ఇద్దరూ కలిసి, సవితని వెతుకుతారు. పూర్ణిమ పెట్రోల్‌ పంపు బాత్రూమ్‌ బయట నిలుచునుండగా, లోపల సవిత ఉందన్న సూచనతో నవల ముగుస్తుంది.

ప్రధాన పాత్రలు రెండూ తాము బాధితురాళ్ళమని అనుకోవు. ఎవరినీ వేలెత్తి చూపవు. కఠినమైన అడ్డంకులను ఎదుర్కుంటూ కూడా, ఏదో రోజు తామిద్దరం కలుసుకుంటామన్న ఆశను వదిలిపెట్టవు. చదువు అందుబాటులో లేని ఆడపిల్లలు ఎదుర్కునే గృహ/లైంగిక హింస, పేదరికం, అసమానత, స్నేహం గురించిన ఈ పుస్తకంలో ఉన్న వచనం ఉత్కంఠభరితమైనది. 
ఏడేళ్ళ వయస్సుండగా ఇండియా నుండి అమెరికా వెళ్ళిన రచయిత్రి శోభారావు, ‘కాథెరిన్‌ ఆన్నె అవార్డ్‌’ గ్రహీత. 2016లో ఆమె రాసిన 12 కథల సంకలనం ‘అన్‌ అన్‌రిస్టోర్డ్‌ వుమన్‌’, భారతదేశపు విభజన గురించినది. యీ తొలి నవలని ఫ్లాటయాన్‌ బుక్స్‌ 2018లో ప్రచురించింది.
-కృష్ణ వేణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement