
నా వయస్సు 57 ఏళ్లు. ఒకసారి మాకు దగ్గర్ల ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాను. నా హార్ట్ వాల్వ్స్‌లో (గుండె కవాటాల్లో) సమస్య ఉందని అంటున్నారు. ఈ సమస్యకు గల కారణాలను తెలపండి. వాల్వ్ మార్చాల్సిందేనా? – రమేశ్‌బాబు, గుంటూరు
గుండె కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి...
1. వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్) 2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్)
వీటికి గల కారణాలు :
∙కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ∙కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల
∙మరికొందరిలో ఈ సమస్య పుట్టుకతోనే రావచ్చు
∙కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజరేటివ్) వచ్చే సమస్యగా రావచ్చు
వాల్వ్స్ సమస్యలకు చికిత్స : ఈ సమస్యలను కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేర్ చేయడానికి అప్పుడు వైద్యులు అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్‌నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌లు అయితే రిపేర్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గుండెపోటును గుర్తుపట్టేదెలా?
మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. మా నాన్నగారికి ఇదివరకు ఎలాంటి గుండెజబ్బులు కూడా లేవు. ఇలా ఎందుకు జరిగింది? ఎవరిలో ఎక్కువగా వస్తుంది. ముప్పు ఉన్నప్పుడు దాన్ని ముందుగానే తెలుసుకోవడం ఎలా? – జీవన్‌రెడ్డి, వరంగల్
మీరు చెప్పినదాన్ని బట్టి నాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్ లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం కుటుంబ సభ్యులో, స్నేహితులో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటివి సడెన్ కార్డియాక్ అరెస్ట్ జరిగిన వారిలో కనిపిస్తాయి.
ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది...
∙గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు ∙గుండె కండరం బలహీనంగా ఉన్నవారు
∙కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు ∙కుటుంబంలో గుండె విద్యుత్ సమస్యలు ఉన్నవారు ∙గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు
పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు.
ముప్పు ఉన్నా... రక్షించే మార్గమూ ఉంది...
క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య ఇది. అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి.
గుండెపోటును గుర్తుపట్టడం ఎలా?
ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనలను పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో పల్మునరీ రిససియేషన్–సీపీఆర్) చేయాలి. సీపీఆర్ వల్ల కీలక ఘడియల్లో ప్రాణంపోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది.గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ఆంబులెన్స్ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించడం అవసరం.
కరొనరీ హార్ట్ డిసీజ్ అంటే...?
ఇటీవల మా బంధువుల్లో ఒకరికి కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అంటే ఏమిటి? అది రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి.
– ఎమ్. తిరుమలమూర్తి, చిత్తూరు
శరీరంలోని ప్రతి అవయవానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకూ జరుగుతుంది. అన్ని అవయవాలకు అందినట్టే కరొనరీ ఆర్టరీ అనే రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం అందుతుంది. వీటిల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరకాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దాంతో కండరాలు బలహీనమైపోయి గుండె స్పందనలు కష్టమవుతాయి. గుండె తాలూకు రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీలు పూడుకుపోయి, తద్వారా గుండెకు రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో కొవ్వును ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాలతో పెద్దగా ఏర్పడి సన్నటి క్యాప్ కప్పినట్లు పెరుగుతాయి. వాటి ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50 శాతం కన్నా ఎక్కువగా పేరుకుపోతే, అలా తగ్గిన ప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అలా వచ్చే గుండె జబ్బులను కరొనరీ ఆర్టరీ డిసీజెస్‌గా చెబుతారు. మామూలు వ్యక్తుల కన్నా పొగతాగే వాళ్లలో ఎక్కువ. కొలెస్ట్రాల్ పెరగడం కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉంటాయి. అవి... 1) వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ పెరగడం 2) ఆహారం ద్వారా రక్తంలో కొవ్వులు పెరగడం. చిన్న వయసులో కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల వంశపారంపర్యంగా కొవ్వులు పెరగడం జరగవచ్చు. దాంతో కరొనరీ హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. ఇక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం (ఫ్యాట్స్) తీసుకోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. అధికబరువు, డయాబెటిస్, హైబీపీ వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఎక్కువ. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ వంటి వ్యాయమమైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకున్నా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామంతో ఈ కరొనరీ హార్ట్ డిసీజెస్‌ను చాలావరకు నివారించుకోవచ్చు.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల
కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.