పరిపాలన, సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, రాష్ట్ర, జిల్లా స్థాయి పాలన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్స్,
గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి పాలిటీలోని గవర్నెన్స్ అంశాలను ఎలా చదవాలి? రిఫరెన్‌స పుస్తకాలను సూచించండి?
- జి. నాగ శిరీష, నూజివీడు
పరిపాలన, సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, రాష్ట్ర, జిల్లా స్థాయి పాలన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్స్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), చారిటీలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, పాలనలో నైతిక విలువలు, కేంద్ర నిఘా సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థ, లోక్‌పాల్, లోకాయుక్త, ఏసీబీ, వినియోగదారుల రక్షణ వ్యవస్థలు; సమాచార హక్కు చట్టం- 2005 వినియోగం, ప్రభావం, పాలనా సంస్కరణలు తదితర అంశాలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ఆయా అంశాలపై అడిగిన ప్రశ్నలకు విశ్లేషణాత్మక అనువర్తనతో తన అభిప్రాయాన్ని రాయాలి.
ప్రభుత్వం, పరిపాలన అనేవి అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రభుత్వం అంటే ఒక నిర్మాణం. దానిలో వివిధ అంచెలుంటాయి. పాలన అంటే ప్రభుత్వ పనితీరు, నిర్వహణ. ప్రభుత్వం రాశి పరమైంది, పాలన వాసి (క్వాలిటేటివ్)తో కూడుకున్నది. ఆధునిక ప్రభుత్వాలు ప్రజలకు గరిష్ట సేవలు అందించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా వచ్చినవే సుపరిపాలన, ఇ-పరిపాలన.
గతంలో ప్రభుత్వం అంటే కేవలం ఒక సంప్రదాయమైన శాసనాలు, వాటి అమలుకు పరిమితమై ఉండేది. కానీ, ప్రజలు నేడు ప్రభుత్వం కంటే పాలన కోరుకుంటున్నారు. అయితే ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి గరిష్ట, సత్వర ప్రామాణిక సేవలను కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే అందించలేవు. వాటికి తోడు పౌర సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సంస్థల సహకారం, సామాజిక బాధ్యత కూడా అవసరం. కాబట్టి సుపరిపాలనకు అవసరమయ్యే అంశాల స్వభావాన్ని, ఆవశ్యకతను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి.
పాలనలో నైతిక విలువల ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాలనలో రాజకీయ జోక్యం.. ప్రభుత్వ అధికారులపై, ప్రజలకు అందించే సేవలపై ప్రభావం చూపుతుంది. అవినీతిని, ఆశ్రీత పక్షపాతాన్ని అరికట్టాలంటే ప్రజలకు వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. అందులో భాగంగా వచ్చినవే ఈ-పౌర, సిటిజెన్ చార్టర్స్, పారదర్శకత, జవాబుదారీతనం. ఈ నేపథ్యంలో పౌర సమాజం, ప్రజావేగుల పాత్ర, ఆవశ్యకత, నిఘా సంస్థలైన లోక్‌పాల్, లోకాయుక్త, సమాచార హక్కు చట్టం, రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ నివేదికలను జాగ్రత్తగా చదివి వాటి ప్రాముఖ్యతను విశ్లేషించుకోవాలి.
సులభంగా, శీఘ్రగతిన సేవలు అందించేందుకు సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను ముఖ్యంగా ఇంటర్నెట్, వెబ్‌సైట్ ఆధారిత సేవలు, ఇ-సేవ, మీ-సేవలు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను, పరిమితులను చదవాలి.
రిఫరెన్స్ బుక్స్:
తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోని ‘భారతదేశ పాలన’ పాఠ్యపుస్తకం.
యోజన తదితర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు.