రెచ్చిపోతున్న ‘నయా’వంచకులు

yber Crime Cases Rises in Hyderabad - Sakshi

కొత్త పంథాలు అనుసరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

నగరంలో ప్రతి రోజూ 20 మందికి టోకరా

కొత్త పంథాలు అనుసరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

నగరంలో ప్రతి రోజూ 20 మందికి టోకరా

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో :ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మానవాళికి ఎంతగా ఉపయోగపడుతోందో అదే స్థాయిలో సైబర్‌ నేరగాళ్లు పెరిగేందుకు కారణమవుతోంది. నేరగాళ్లు, నేరం జరిగే విధానం కనిపించకుండా లక్షల్లో కొల్లగొట్టడం వీరి ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు గణనీయంగా పెరిగాయి. సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు ప్రతి రోజూ గరిష్టంగా 20 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సైబర్‌ సేఫ్‌ సిటీ’ కోసం అధికారులు అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌’ అనే నానుడి ఆధారంగా ముందుకుపోతున్నారు. 

అకౌంట్‌ టేకోవర్‌...
ఇటీవల ఎక్కువగా నమోదవుతున్న నేరాలు అకౌంట్‌ టేకోవర్‌కు సంబంధించినవే. సైబర్‌ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ–మెయిల్స్‌ను హ్యాక్‌ చేస్తారు. ప్రధానంగా అన్‌ సెక్యూర్డ్‌ ఈ–మెయిల్‌ ఐడీలను ఎంపిక చేసుకుని లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. ఆపై అదును చూసుకుని నగదు చెల్లించాల్సిన వ్యక్తికి దానిని తీసుకునే వ్యక్తి పంపినట్లు మెయిల్‌ పంపిస్తూ.. అందులో బ్యాంక్‌ ఖాతా మారిందంటూ తమది పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్‌ నేరగాడి ఖాతాలోకి వచ్చిపడతాయి. నగదు చెల్లింపులు జరిపే సందర్భాల్లో ఖాతాలు మారినట్లు సమాచారం అందితే నేరుగా సంప్రదించి నిర్థారించుకున్న తర్వాతే డిపాజిట్‌ చేస్తే ఉత్తమం.  

ఆశపడితే అంతే....
సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితర ప్రాంతాల్లో సర్వే ల పేరుతో చేతిలో డబ్బాలు పట్టుకొని నిలబడే వారు కనిపిస్తుంటారు. వారిచ్చిన కాగితంలో ఈ–మెయిల్‌ ఐడీ, సెల్‌ఫోన్‌ నెంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహుమతి అందిస్తామని చెబుతుంటారు. వీటికి ఆశపడి ఎవరైనా వివరాలు రాసి అందిస్తే... ఇక అంతే మరి. ఇలా సేకరించిన డేటాను కొందరు అనేక మందికి అమ్ముకుంటారు. సైబర్‌ నేరగాళ్లు సైతం వీటిని కొని తమ పని కానిస్తుంటారు. ఇంటర్‌నెట్‌లోనూ ఇలాంటి సర్వేలు కనిపిస్తుంటాయి. సైబర్‌ నేరాలకు బీజం ఇక్కడి నుంచే పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిచయం లేని వారికి వివరాలు అందించకూడదు. అలాగే అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్, ఎమ్‌ఎమ్మెస్‌లకు స్పందించకూడదు.  

కీ లాగర్స్‌...
కంప్యూటర్‌ ద్వారా నిర్వహించే ప్రతి లావాదేవీని తెలుసుకునేందుకు కీ లాగర్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇటీవల సెల్‌ఫోన్ల మీదకూ దీన్ని ప్రయోగిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. దీన్ని నిక్షిప్తం చేస్తే.. ఎవరైనా ఓ కంప్యూటర్‌ను వినియోగించి వెళ్లిపోయిన తరవాత వారు ఏమి టైప్‌ చేశారో తేలిగ్గా తెలుసుకోవచ్చు. నెట్‌ కేఫ్‌ల్లోని అనేక సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్‌ కార్డు వివరాలు ఉంటే ఎదుటి వ్యక్తిని నిండా ముంచుతున్నారు. సెల్‌ఫోన్లకు పంపిన కీ లాగర్స్‌తో పాస్‌వర్డ్స్‌తో పాటు వ్యక్తిగత సమాచారం తదితరాలు తెలుసుకుని దుర్వినియోగం చేస్తున్నారు.  

క్రెడిట్‌ కార్డుతో జాగ్రత్త...
క్రెడిట్‌ కార్డు వాడకం ఇప్పుడు మామూలైంది. ఏదైనా దుకాణానికి వెళ్లో... లేదా పెట్రోల్‌ పోయించుకునో కార్డు ఇస్తాం. బిల్లుకు సంబంధించిన అసలు ప్రతి మనకు ఇచ్చి... కాపీ వారే ఉంచుకుంటారు. కార్డు వెనుక సీవీవీ నెంబర్‌ ఉంటుంది. వారు తమ దగ్గర ఉంచుకునే బిల్లు కాపీలో ఉన్న పేరు, కార్డు నెంబరు ఎలాగూ ఉంటాయి. ఇక ఈ సీవీవీ కోడ్‌ కూడా అవతలి వ్యక్తులు నోట్‌ చేసుకుంటే చాలు. ఇంటర్‌నెట్‌లో మీ ఖాతాను వినియోగించి ఏకంగా షాపింగ్‌ చేసుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో స్కిమ్మర్లను వినియోగించి కార్డులోని డేటా థెఫ్ట్‌ చేస్తున్నారు. ఆనక మరో కార్డు తయారు చేసి జల్సాలు చేస్తున్నారు. బ్యాంకులు ఓటీపీ తప్పనిసరి చేసిన తర్వాత ఈ తరహా నేరాలు గణనీయంగా తగ్గాయి.  

ఒక్క మెయిల్‌తో ఖాతా ఖాళీ...
మేం ఫలానా బ్యాంకు నుంచి మెయిల్‌ చేస్తున్నాం... భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం. మీ అకౌంట్‌ నెంబర్, పాస్‌వర్డ్‌ చెబితే ఎవరూ టాంపర్‌ చేయకుండా చర్యలు తీసుకుంటాం... ఈ రకంగా ఓ ఈ–మెయిల్‌ మీకు వచ్చిందా? ఇలాంటి ఫోన్‌కాల్‌ అందుకున్నారా? జాగ్రత్త సుమా... దానికి స్పందించారో మీ ఖాతా ఖాళీ అయిపోయినట్లే. మీ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు వేసే ఈ ఎత్తుకు ఫిషింగ్‌ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇంటర్‌నెట్‌ వినియోగదారులకు, ఆర్థిక సంస్థలకు ఇది పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ 9.8 మిలియన్ల ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపుతున్నట్లు అంచనా. ఎస్‌ఎమ్మెస్‌ ద్వారానూ ఇలాంటి సందేశం రావచ్చు. అలా ఫోన్‌కు వచ్చిన దానిని స్మిషింగ్‌ అంటారు.  

ప్రొఫైల్స్‌తో పెనుముప్పు...
ఉపాధి అవకాశాలను వెతుక్కునే వారి సౌకర్యార్థం అనేక వెబ్‌సైట్లు ప్రొఫైల్స్‌ పేరుతో ప్రత్యేక సదుపాయాలు అందిస్తున్నాయి. ఎవరైనా తమ ఫొటోలతో పాటు ఇతర వివరాలనూ ఇందులో పొందు పరచవచ్చు. కొందరు సైబర్‌ నేరగాళ్లు వీటిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరైనా అమ్మాయి ఫొటోలు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు దొరికితే చాలు... వాటిని అసభ్య పదజాలంతో, ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్‌లో పెట్టేస్తున్నారు. దీంతో సదరు యువతికి వేధింపు ఫోన్‌కాల్స్‌ తప్పట్లేదు. మరికొన్ని సందర్భాల్లో మార్ఫింగ్‌ ద్వారా ఫోర్న్‌ ఫొటోలకు ఈ యువతులు తలలు పెట్టి నిలువుగా పరువు తీస్తున్నారు. అందుకే యువతులు, మహిళలు తమ ఫొటోలు పరాయి వ్యక్తుల చేతిలో పడకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఫొటో స్టూడియోలకు వెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.  

అసలుకే మోసం...
ఉచితంగా స్క్రీ సేవర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు... కొత్తగా యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారు చేశాం... పరిశీలన నిమిత్తం కొద్ది రోజులు ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాం... ఇలాంటి ప్రకటనలు ఇంటర్‌నెట్‌లో ఊరిస్తుంటాయి. వీటికి ఆశపడి ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకుంటే నిండా మునిగినట్లే. ఇలా ఉచితంగా అందించే వాటి వెనుక ఓ ప్రొగ్రామింగ్‌ నిబిడీకృతమై ఉంటుంది. దీన్ని ‘ట్రూజన్‌ హార్ట్స్‌’ అంటారు. అంటే ఏదైనా సదుపాయాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో నిక్షిప్తమై ఉన్న ప్రొగ్రామింగ్‌ మన కంప్యూటర్‌లో జరిగే ప్రతి లావాదేవీని ఎక్కడో ఉన్న సైబర్‌ నేరగాడికి అందిస్తుంది. ఈ రకంగా మన కంప్యూటర్‌లో చేసిన బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలు వారికి చేరినట్లే. సెల్‌ఫోన్లకూ ఈ తరహా వైరస్‌లు పంపేందుకు ఆస్కారం ఉంది.  

అంగట్లో వ్యక్తిగత జీవితం...
సెల్‌ఫోన్‌లో కెమెరాలు వచ్చిన తరవాత వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... రహస్య జీవితాన్ని అత్యంత రహస్యంగా చిత్రీకరించి ఇంటర్‌నెట్‌లో పెట్టేస్తున్నారు. మాజీ భర్తలు, ప్రియులు వీటిలో ముందుంటున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి పరిచయస్తుడైనా... అతడిని మీ పర్సనల్‌ స్పేల్‌లోకి అనుమతించకూడదు.  

ఇంకా మరెన్నో...
ఎదుటి వారి అనుమతి లేకుండా నెట్‌ సహాయంతో వారి కంప్యూటర్‌లోకి ప్రవేశించే హ్యాకింగ్, వివిధ రకాలైన వైరస్‌లను పంపే వైరస్, డిసిమినేషన్, ఛాట్‌ రూమ్స్‌ను ఆధారంగా చేసుకుని చేసే ఇంటర్‌నెట్‌ రిలే ఛాట్‌ (ఐఆర్‌సీ) క్రైమ్, లాటరీలు వచ్చాయంటూ, వ్యాపార భాగస్వాములుగా మారతామంటూ నిండా ముంచే నైజీరియన్‌ ఫ్రాడ్స్, ఆర్కూట్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా మోసాలు చేసే సోషల్‌ ఇంజినీరింగ్, సైబర్‌ స్టాకర్‌గా పిలిచే ఆన్‌లైన్‌ ద్వారా వేధింపులకు పాల్పడటం, ఓఎల్‌ఎక్స్‌లో వివిధ రకాలైన ప్రకటనలు చేసి దండుకోవడం, బ్యాంకు అధికారులుగా ఫోన్లు చేసి ఓటీపీ తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేయడం తదితరాలన్నీ సైబర్‌ నేరాల కిందికే వస్తాయి. ఇవన్నీ ఇటీవల గణనీయంగా పెరిగిపోతున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top