విద్యార్థినితో  రెండోపెళ్లి, మొదటి భార్య ఫిర్యాదు

Wife Complaint against the second marriage of husband - Sakshi

సాక్షి, అనంతపురం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుడు...విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడపడమే కాకుండా ఏకంగా రెండోపెళ్లి చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. మొదటి భార‍్య ఫిర్యాదుతో అయ్యగారి బాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌ ప్రవీణ్‌ కుమార్‌.. తాను పనిచేసే కళాశాల విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడికి ఇంతకు ముందే త్రివేణి అనే యువతితో వివాహం అయ్యింది. అంతేకాకుండా ఆమెను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. తనకు వివాహం అయిన విషయాన్ని దాచిపెట్టి రెండోపెళ్లి చేసుకున్న ప్రవీణ్‌కుమార్‌పై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ముగ్గురు ఏపీఆర్‌ఎస్‌ విద్యార్థులపై కేసు..
మరోవైపు విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక దాడికి యత్నించడం, సహకరించకపోవడంతో ఇష్టారాజ్యంగా చితకబాదిన ఘటన మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌ ఎక్సలెంట్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్‌ చేశారు.

కాగా గత ఆగస్టు 15న పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నలుగురు ఒకే రూంలో ఉన్నారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక సహ విద్యార్థిపై మరో ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడికి యత్నించారు. ఆ సమయంలో విద్యార్థి అరవకుండా నోట్లో గుడ్డ కుక్కారు. ఎంతకీ సహకరించకపోవడంతో చితకబాదారు. మరుసటి రోజు హౌస్‌ ఇన్‌చార్జ్‌ సుకన్యకు బాధిత విద్యార్థి విషయం తెలపడంతో వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. 

అయితే పాఠశాల ప్రిన్సిపాల్‌ వాసుదేవరెడ్డి గత ఆదివారం రాత్రి బాధిత, బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. బాధ్యులైన ముగ్గురు విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు సిద్ధపడగా, అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదుకు సిద్ధం అయ్యాడు.  అయితే రాజీ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ప్రిన్సిపాల్‌ వాసుదేవరెడ్డి బాధ్యులైన విద్యార్థులను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించి 16న రాత్రి విద్యార్థులను వారి తల్లిదండ్రులతో పాటు పంపించేశారు. 

విద్యార్థులపై కేసు నమోదు 
అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధిత విద్యార్థి తండ్రిని పిలిపించి విచారణ చేపట్టారు. లైంగికంగా వేధించడమే కాకుండా అందుకు సహకరించలేదని చితకబాదిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం పరిగి పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన ముగ్గురు విద్యార్థులను జే–1, జే–2, జే–3గా పరిగణించి బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top