విద్యార్థినితో ఇన్విజిలేటర్‌ అనుచిత ప్రవర్తన  | Sakshi
Sakshi News home page

విద్యార్థినితో ఇన్విజిలేటర్‌ అనుచిత ప్రవర్తన 

Published Wed, Aug 21 2019 10:55 AM

Private Engineering College Invigilator Misbehave With Girl Student In Manakondur - Sakshi

ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్‌ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.  

సాక్షి, మానకొండూర్‌(కరీంనగర్‌) :  ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్‌ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పరీక్ష నిర్వహించాల్సిన ఇన్విజిలేటర్‌ విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించడంతో బాధితురాలు తాను చదివే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చే సింది. ఈ మేరకు యాజమాన్యం సదరు అధ్యాపకుడిని పిలిపించి మందలించగా, విద్యార్థులు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతు న్న విద్యార్థిని జేఎన్‌టీయూ నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది. 

ఇదే మండలంలోని మరో ప్రైవేటు కళాశాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. రోజులాగే సోమవారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా, ఇన్విజిలేటర్‌గా బి.వెంకటేశ్‌ను కేటాయించారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన సదరు ఇన్విజిలేటర్‌ పరీక్ష రాస్తున్నంత సేపు తనను వేధించినట్లు విద్యార్థిని తెలిపింది. అవసరం లేకున్నా తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని, పరీక్ష పూర్తయ్యే సమయంలో ఫోన్‌ నంబర్‌ ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురించి మంగళవారం తాను చదివే కళాశాల యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కళాశాల చైర్మన్‌ అధ్యాపకుడిని కళాశాలకు పిలిపించి మందలించారు. విషయం తెలిసి అక్కడికి చేరిన విద్యార్థులు సదరు అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. చైర్మన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో గొడవ సద్దుమణిగింది. అధ్యాపకుడిని ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Advertisement
Advertisement