కార్డు అక్కడ.. స్వైపింగ్‌ ఇక్కడ..

International credit cards data hacking - Sakshi - Sakshi

     విదేశీయులే బకరాలు

     ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ డేటా హ్యాకింగ్‌

     పీఓఎస్‌ల ద్వారా స్వైపింగ్‌ చేసి నగదు స్వాహా

     మూడు నెలల్లో రూ.30 లక్షలకు పైగా కైంకర్యం

     ఐదుగురిని అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లు వివిధ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డుల డేటాను హ్యాకింగ్‌ ద్వారా తస్కరిస్తున్నారు. దీన్ని డార్క్‌ నెట్‌ ద్వారా పలువురికి విక్రయించేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా క్లోన్డ్‌ క్రెడిట్‌ కార్డులు తయారు చేసి, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మిషన్ల ద్వారా అందినకాడికి దండుకుం టున్నారు. ఈ స్కామ్‌కు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌ గడిచిన మూడు నెలల్లో రూ.30 లక్షలకు పైగా కాజేసినట్లు పోలీసు కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ వెల్లడించారు. 

ఆ మూడు దేశాల వారి డేటా...
వివిధ దేశాల్లో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న హ్యాకర్లు పిన్, ఓటీపీ వంటివి ఉండని ఇంట ర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డుల డేటాను బ్యాంకుల నుంచి ఆన్‌లైన్‌లో తస్కరిస్తున్నారు. ప్రధానం గా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా జాతీ యులనే ఎంచుకుంటున్నారు. ఈ డేటాను ఇంటర్నెట్‌లో మాఫియాగా పరిగణిం చే డార్క్‌ నెట్‌ ద్వారా విక్రయిస్తున్నారు. చెన్నైకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంజనీర్‌ అయ్యప్పన్‌ అలియాస్‌ రాజేశ్‌ సోషల్‌ మీడియాలో భాగమై న ఐసీక్యూ యాప్‌ ద్వారా  పరిచయాలు ఏర్పా టు చేసుకున్నాడు. వారి ద్వారానే ఇంటర్నే షనల్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ క్లోనింగ్‌ విషయం తెలుసుకున్నాడు. వారి నుంచే 100 క్రెడిట్‌ కార్డుల డేటా రూ.5 లక్షల వంతున వెచ్చించి కొంటు న్నాడు. రాజేంద్రనగర్‌కు చెందిన రాఘవేంద్ర, కొత్తపేట వాసి వంశీకృష్ణలకు కమీషన్‌ ఆశచూ పి తన దందాలో చేర్చుకున్నాడు.

వాట్సాప్‌ ద్వారా ‘నంబర్‌’ పంపి...
డార్క్‌ నెట్‌ ద్వారా కొనుగోలు చేసిన క్రెడిట్‌ కార్డుల డేటాలో ఆరు డిజిట్స్‌ మాత్రమే ఉంటాయి. దీంతో ఈ నంబర్లను బిన్‌ చెక్కర్‌ అనే అప్లికేషన్‌లో ఫీడ్‌ చేసేవాడు. ఇది సదరు కార్డు పూర్తి వివరాలను అందించేది. వీటిని రాజేశ్‌ నగరంలో ఉంటున్న రాఘవేంద్ర, వంశీలకు వాట్సాప్‌ ద్వారా చేరవేసేవాడు. ఇంటర్నెట్‌ నుంచే ఖరీదు చేసిన ఓ క్లోనింగ్‌ మిషన్‌ను సైతం వీరికి పంపాడు. క్లోనింగ్‌ మిషన్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేసే వీరిద్దరూ క్రెడిట్‌కార్డుల డేటాను మాగ్నెటిక్‌ స్ట్రిప్‌తో కూడిన కార్డుల్లోకి ఫీడ్‌ చేసేవారు. బిగ్‌బజార్, రిలయన్స్‌ డిజిటల్, షాపర్స్‌ స్టాప్‌ వంటి సంస్థలు అందించే ప్రమోషనల్‌ మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ కార్డుల్ని దీనికోసం వాడారు. ఇలా విదేశీయులకు చెందిన క్రెడిట్‌ కార్డులకు క్లోన్డ్‌ కార్డులు తయారు చేసేవారు. 

హవాలా సొమ్ము వస్తోందని చెప్పి
క్లోన్డ్‌ కార్డుల్ని స్వైపింగ్‌ చేసుకోవడానికి సిటీలో ఉంటున్న నలుగురు చిన్న వ్యాపారుల నుంచి పీఓఎస్‌ మిషన్లు తీసుకున్నారు. తమకు హవాలా నగదు వస్తోందని, దాన్ని మీ ఖాతాలకు మళ్లిస్తామంటూ వారికి చెప్పారు. విశాఖపట్నానికి చెందిన సీహెచ్‌ భాస్కర్‌రావు ఎనిమిది, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్‌ 4, కాకినాడకు చెందిన కనకరాజు, దిల్‌సుఖ్‌నగర్‌ వాసి సుభాష్‌ రెండేసి చొప్పున పీఓఎస్‌ మిషన్లు అందించారు. చైతన్యపురిలో ఓ గది అద్దెకు తీసుకున్న రాఘవేంద్ర, వంశీకృష్ణ అందులో పీఓఎస్‌ మిషన్లు ఏర్పాటు చేసి.. నగదును సదరు వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవారు. దీన్ని ఎప్పటికప్పుడు డ్రా చేసి ఇచ్చే వ్యాపారులు 20 శాతం కమీషన్‌ తీసుకునే వారు. మిగిలిన 80 శాతంలో రాఘవేంద్ర, వంశీ 20 శాతం తీసుకుని మిగిలిన 60 శాతం రాజేశ్‌కు పంపేవారు. ఇలా గడిచిన మూడు నెలల్లో రూ.30 లక్షలకు పైగా స్వైపింగ్‌ చేశారు.

ఓ లావాదేవీపై అనుమానంతో
ఈ గ్యాంగ్‌కు స్వైపింగ్‌ మిషన్లు ఇచ్చిన వారిలో కూకట్‌పల్లికి చెందిన వస్త్ర వ్యాపారి శ్రీనివాసరావు సైతం ఉన్నారు. ఒకరోజు ఇతడి ఖాతాలోకి రూ.2.3 లక్షలు వచ్చిపడటం, అదీ ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డుతో చేసిన లావాదేవీ కావడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ఆయన్ను ప్రశ్నించారు. దీంతో శ్రీనివాసరావు.. రాఘవేంద్ర గదికి వెళ్లాడు. అక్కడ స్వైపింగ్‌ మిషన్లు, ల్యాప్‌టాప్‌ లను చూసి అనుమానం వచ్చి రాచకొండ పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాడు. పోలీసులు  ఆరా తీయగా విషయం బయటపడింది. అయ్యప్పన్, రాఘవేంద్ర, వంశీ కృష్ణ, భాస్కర్‌రావు, భాస్కర్‌లను అరెస్టు చేసి రూ.2 లక్షల నగదుతో పాటు 16 స్వైపింగ్‌ మిషన్లు, ఇతర ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు.  స్వైపింగ్‌ మిషన్లు ఇచ్చిన ఇతరుల్నీ అరెస్టు చేయనున్నామని కమిషనర్‌ భగవత్‌ చెప్పారు. ఐటీలో బీటెక్‌ చేసిన రాఘవేంద్రకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై పట్టుందని, గతంలో ఢిల్లీ కేంద్రంగా రెండు జర్నల్స్‌ కూడా ప్రచురించాడని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top