కోడెల కుమారుడిపై కేసు 

Case against Kodela son - Sakshi

బైక్‌ షోరూమ్‌లో వాహన విక్రయాల్లో భారీ కుంభకోణం 

వినియోగదారుల నుంచి రూ.80లక్షలు వసూలు చేసి  ప్రభుత్వానికి చెల్లించని వైనం

విచారణ అనంతరం కోడెల శివరామ్‌పై పోలీసులకు గుంటూరు డీటీసీ మీరాప్రసాద్‌ ఫిర్యాదు   

సాక్షి, గుంటూరు:  బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణానికి పాల్పడిన శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణపై పోలీసు కేసు నమోదు అయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో కోడెల శివరామ్‌కు గౌతమ్‌ హీరో బైక్‌ షోరూమ్‌ ఉంది. దీనికి అనుబంధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా 50కుపైగా సబ్‌ డీలర్‌లు ఉన్నారు.

గత కొన్ని రోజులుగా శివరామ్‌ షోరూమ్‌లో టీఆర్‌ (తాత్కాలిక రిజిస్ట్రేషన్‌) లేకుండా బైక్‌లు డెలివరీ చేస్తున్నారు. దీనిపై గత ఏడాదే రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే కోడెల తనయుడి షోరూమ్‌ కావడంతో గత ప్రభుత్వ హయాంలోను అధికారులు గౌతమ్‌ షోరూమ్‌ జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ కమిషనర్‌ విచారణ చేయించారు. గత ఏడాది కాలంలో టీఆర్‌ లేకుండా 1,025 బైక్‌లు విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. టీఆర్, లైఫ్‌ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్‌ తదితర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8వేల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసిన శివరామ్‌ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా నొక్కేశారు. 

కేసు నమోదు..
విచారణ అనంతరం గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్‌ మీరాప్రసాద్‌ గౌతమ్‌ హీరో షోరూమ్‌ యజమాని శివరామ్‌పై నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 1,025 బైక్‌లు టీఆర్‌ లేకుండా విక్రయించి 1989 కేంద్ర మోటర్‌ వాహన చట్టం నిబంధన 42ను కోడెల శివరామ్‌ అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కోడెల శివరామ్‌పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్‌ల కింద శనివారం కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top