ఎఫ్‌ఐఐల అమ్మకాలు... లాభాలు పరిమితం | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఐల అమ్మకాలు... లాభాలు పరిమితం

Published Tue, Oct 10 2017 1:49 AM

Sensex gains 32 points, Nifty up 9 points - Sakshi

ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. గత శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి పలు ప్రోత్సాహకర నిర్ణయాలు వెలువడడంతో మార్కెట్లలో సానుకూలత చోటు చేసుకుంది. ఇదే సమయంలో సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభం అవుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

విదేశీ ఇన్వెస్టర్లు రూ.475 కోట్ల విలువ మేర షేర్లను విక్రయించడం, దేశీయ ఇనిస్టిట్యూషన్ల నికర కొనుగోళ్లు రూ.55 కోట్లకే పరిమితం కావడం సూచీలను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 31,935.63 వరకు వెళ్లి చివరికి 32.67 పాయింట్ల లాభంతో 31,846.89 వద్ద క్లోజయింది. గత శుక్రవారం సెన్సెక్స్‌ 222 పాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 10,000 మార్కు పైకి వెళ్లినప్పటికీ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేదు. ముగింపునకు 9 పా యింట్ల లాభంతో 9,988.75 వద్ద స్థిరపడింది.


రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవోకు దరఖాస్తు
అనిల్‌ అంబానీ గ్రూపులో భాగమైన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవోకు సంబంధించి అనుమతి కోరుతూ సెబీ ముందు ముసాయిదా పత్రాలను సోమవారం దాఖలు చేసింది. ఈ ఐపీవోలో భాగంగా కంపెనీ 1.67 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తుండగా, ప్రమోటర్‌ రిలయన్స్‌ క్యాపిటల్‌ తన వాటా నుంచి 5.03 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో జారీ చేయనుంది.

తాజా షేర్ల విక్రయంతో వచ్చే నిధులను సాల్వెన్సీ మార్జిన్‌ పెంచుకోవటానికి వాడుకోవాలని  కంపెనీ భావిస్తోంది.  ఈ ఏడాది మార్చి నాటికి రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పుస్తక విలువ రూ.1,250 కోట్లుగా ఉంది. దీనికి కనీసం ఐదు రెట్లు వేసుకుంటే కంపెనీ విలువ రూ.6,000 కోట్లు.

Advertisement
Advertisement