ఆర్‌బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!

Raiding RBI reserves shows govts desperation - Sakshi

మాజీ గవర్నర్‌ దువ్వూరి అభిప్రాయం

ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికి ఇది సూచిక

తరచూ సావరిన్‌ బాండ్ల జారీ సరికాదు

సెంట్రల్‌ బ్యాంక్‌ స్వయంప్రతిపత్తి నిర్వహణ కీలకాంశం  

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ నేతృత్వంలోని బిమల్‌జలాన్‌ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.  తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి  సీఎఫ్‌ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్‌ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది.

► సెంట్రల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది.  

► ప్రపంచంలోని ఇతర సెంట్రల్‌ బ్యాంకులతో ఆర్‌బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్‌బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్‌లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు.  

► అటు ప్రభుత్వ బ్యాలెన్స్‌ షీట్స్‌తో ఇటు సెంట్రల్‌బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్స్‌ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు.  

ట    ఆర్‌బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్‌బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్‌బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం.  

► ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్‌బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా.  నిధుల బదిలీ అంశమై బిమల్‌ జలాన్‌ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్‌లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్‌బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్‌బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్‌ కమిటీ, 2013లో మాలేగామ్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్‌బీఐ  12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top