హెచ్‌డీఎఫ్‌సీ లాభం 2,862 కోట్లు | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 2,862 కోట్లు

Published Tue, May 14 2019 12:25 AM

HDFC Q4 net jumps 27%, announces ₹17.50/share dividend - Sakshi

న్యూఢిల్లీ: గృహరుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ... మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన లాభం 27 శాతం పెరిగి రూ.2,862 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం రూ.11,586 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.2,257 కోట్లు, ఆదాయం రూ.9,322 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం 2,650 కోట్ల నుంచి 3,161 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున తుది డివిడెండ్‌ పంపిణీకి హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి చూస్తే 2018–19 ఆర్థిక సంవత్సరానికి షేరు వారీ డివిడెండ్‌ రూ.21 అవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.20 డివిడెండ్‌ ఇవ్వడం గమనార్హం. 

పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిరాశ  
2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్‌ లాభం మాత్రం 12 శాతం తగ్గి రూ.9,632 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.10,959 కోట్లు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే మాత్రం లాభం గణనీయంగా మెరుగుపడింది. 2017–18లో రూ.13,111 కోట్ల కన్సాలిడేట్‌ లాభం రాగా, 35 శాతం వృద్ధితో 2018–19లో 17,580 కోట్లకు చేరింది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఐపీవో ద్వారా వచ్చిన మొత్తం ఇందులో చేరడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఐపీవో ద్వారా వాటాలు విక్రయించినందుకు క్రితం ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడం సరికాదని కంపెనీ అభిప్రాయపడింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం రూ.79,819 కోట్ల నుంచి రూ.96,195 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ.9,635 కోట్ల నుంచి రూ.11,403 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతంగా నమోదైంది. స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 1.18 శాతం మేర రూ.4,777 కోట్లు కాగా నికర ఎన్‌పీఏలు ఇండివిడ్యువల్‌ (వ్యక్తులు) పోర్ట్‌ఫోలియోలో 0.7 శాతం, నాన్‌ ఇండివిడ్యువల్‌ (సంస్థలు) పోర్ట్‌ఫోలియోలో 2.34 శాతం మేర ఉన్నట్టు కంపెనీ తెలిపింది.  

నిధుల సమీకరణ 
రిడీమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు లేదా ఇతర హైబ్రిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్లను ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే, నాసర్‌ ముంజీ, జేజే ఇరానీలను ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా జూలై 21 నుంచి మరో రెండేళ్ల కాలానికి పునర్‌నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 

Advertisement
Advertisement