ఒకే తేదీన ఐదు సిప్‌లు.. ఓకేనా?

expert advice  - Sakshi

నేను సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్‌  చేద్దామనుకుంటున్నాను. ఒక్కో సిప్‌కు నెలలో ఒక్కో తేదీని ఎంచుకోవాలా లేక అన్ని ఫండ్స్‌ల  సిప్‌ల్లో  ఒకే తేదీన ఇన్వెస్ట్‌ చేయమంటారా ? –వాణి, హైదరాబాద్‌  
మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయడానికి మీరు ఈ రెండింటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి, ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీని ఎంచుకున్నా, లేదా అన్ని ఫండ్స్‌ సిప్‌లకు ఒకే తేదీన ఇన్వెస్ట్‌ చేసినా మీరు పొందే రాబడులపై ఎలాంటి తేడా ఉండదు.

అందుకని ఈ విషయంలో ఎలాంటి ఆలోచన అవసరం లేదు. ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీని ఎంచుకోవడం వల్ల ప్రతి నెలా కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు కనుక నెలవారీ ఆదాయం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారైతే ఒకే రోజు అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు నెల మొదటి వారంలో సిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు.  

నేను ఐసీఐసీఐ ప్రు లైఫ్‌టైమ్‌ పెన్షన్‌–ఐఐ పాలసీని తీసుకున్నాను. పదేళ్ల పాటు ఏడాదికి రూ.10,000 చొప్పున వార్షిక ప్రీమియమ్‌ చెల్లించాను.  ఆరోగ్య  కారణాలను చూపుతూ ఈ పాలసీని ఇప్పుడు సరెండర్‌ చేయవచ్చా? నాకు ఎంత మొత్తం పెన్షన్‌ వస్తుంది? –చైతన్య, విజయవాడ  
ఐసీఐసీఐ ప్రు లైఫ్‌టైమ్‌ పెన్షన్‌–ఐఐ పాలసీ అనేది యునిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ ప్లాన్‌. ఈ తరహా పెన్షన్‌ ప్లాన్లు మెచ్యూర్‌ అయినప్పుడు, మెచ్యూరిటీ మొత్తంలో మూడో వంతు మొత్తాన్ని ఏక మొత్తంలో ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీగా మార్చుకోవాలి. ఇక ఇప్పుడు మీరు ప్లాన్‌ను సరెండర్‌ చేసే అవకాశం లేదు. ఆరోగ్య కారణాలను చూపుతూ కూడా ఈ పాలసీని సరెండర్‌ చేసే అవకాశాలు మీకు లేవు. అందుకని మీ మెచ్యూరిటీ మొత్తంలో మూడో వంతు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోండి. మిగిలిన దానిని మీ ఛాయిస్‌ ప్రకారం యాన్యుటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీకు దగ్గరలోని సదరు బీమా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి యాన్యుటీకి సంబంధించి మీకు లభించే ఛాయిస్‌లు, తదితర అంశాల గురించి వివరంగా తెలుసుకోండి. మీ పాలసీ మెచ్యూరిటీ తేదీని ఉన్న ఫండ్‌ విలువను బట్టి యాన్యుటీ విలువ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎప్పుడు బీమా సంబంధిత పాలసీలను తీసుకోవద్దు. పెట్టుబడికి, బీమాకు వేర్వేరుగా పెట్టుబడులు పెట్టాలి. జీవిత బీమా కోసం టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలి. టర్మ్‌ బీమా పాలసీల్లో తక్కువ ప్రీమియమ్‌తో ఎక్కువ బీమా కవరేజ్‌ పొందవచ్చు. ఇక పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలి.  

నా వయస్సు 43 సంవత్సరాలు. నేను హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ ఫండ్‌–హైబ్రిడ్‌ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాకు 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ ఫండ్‌ యూనిట్లను విక్రయిస్తే, నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్‌లో నాకు 58 సంవత్సరాలు వచ్చే వరకూ కొనసాగించి, ఆ తర్వాత వేరే డెట్‌ ఫండ్‌లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. ఇలా మార్చుకున్నందువల్ల అప్పుడు నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ?   –చెన్న గౌడ, బెంగళూరు  
హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ ఫండ్‌–హైబ్రిడ్‌ ఈక్విటీ ప్లాన్‌ అనేది ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌. ఇతర ఈక్విటీ ఫండ్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఈ ఫండ్‌కు కూడా వర్తిస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాదికి మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఈ ఫండ్‌లో దాదాపు 17 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి  మీరు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ ఫండ్‌–హైబ్రిడ్‌ ఈక్విటీ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ను వేరే డెట్‌ ఫండ్‌లోకి మార్చుకున్నందువల్ల మీపై ఎలాంటి పన్ను భారం ఉండదు.

ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవడం/బదిలీ చేయడాన్ని ఒక ఫండ్‌ నుంచి  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించి, మరో ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడంగా పరిగణిస్తారు. ఏడాది దాటిన ఈక్విటీ ఫండ్స్‌ను ఇతర ఫండ్స్‌లోకి బదిలీ చేస్తే ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే  హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ ఫండ్‌–హైబ్రిడ్‌ ఈక్విటీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను.. ఇన్వెస్ట్‌ చేసిన వ్యక్తి తనకు 59 సంవత్సరాలు రాకముందే విక్రయిస్తే, 1 శాతం ఎగ్జిట్‌ లోడ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు ఇతర ఫండ్స్‌లోకి మార్చుకునే విషయంపై నిర్ణయం తీసుకోండి. ఎలాగూ మీకు 58 సంవత్సరాలు వచ్చే వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి, మరో ఒక్క ఏడాది కూడా కొనసాగిస్తే, మీకు ఈ 1 శాతం ఎగ్జిట్‌ లోడ్‌ భారం కూడా ఉండదు.   

– ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top