
విజయనగరం, ప్రజాసంకల్ప యాత్ర బృందం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో చిన్నారులు, వృద్ధుల పట్ల ఎంతో జాగరూకత ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆదివారం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో గంట్యాడ మండలం చంద్రంపేటకు చెందిన చలుమూరి ఏలేష్, రమణమ్మలు తమ పిల్లలతో పాదయాత్రలో పాల్గొన్నారు. పాత భీమసింగి జంక్షన్ నుంచి బలరామపురం, కుమరాం మధ్యలో వీరు జగన్‌మోహన్‌రెడ్డితో అడుగు కలిపారు. అయితే ఎండ ఎక్కువగా ఉండడం.. ఆ సమయంలో చోటు చేసుకున్న తోపులాట వల్ల రమణమ్మ కుమార్తె సంగీత చెప్పు జారిపోయింది. అయినా పరవాలేదంటూ నడవబోగా కాళ్లు కాలిపోతాయి తల్లీ! అని జగన్ వారించారు. అయినా చిన్నారి వినకుండా నడుస్తానని చెప్పడంతో ఎండకు ఇబ్బంది పడతావమ్మా అని వారించారు. వెంటనే సెక్యూరిటీని పిలిచి అమ్మాయి చెప్పు గురించి చెప్పగా వారు కొద్దిసేపటికి చెప్పు తీసుకువచ్చారు. దీంతో చిన్నారి మళ్లీ జగనన్న వెనుక యాత్రలో పాల్గొంది.
ఈపీఎఫ్ లేనివారినిఆదుకోండి
రాష్ట్రంలో ఈపీఎఫ్ స్కీమ్ వర్తించని ఉద్యోగులను ఆదుకోవాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.కృష్ణంరాజు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. భీమసింగి వద్ద ప్రజాసంకల్పయాత్రలో ఆయనతో మాట్లాడుతూ దేశంలో సుమారు 75లక్షల మంది ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్) వర్తించే ఉద్యోగులున్నారని తెలిపారు. ఈ నిధి సుమారు రూ.3 లక్షల కోట్లు ఉందన్నారు. దేశంలో ఈపీఎఫ్ వర్తించిన కార్మికులు, ఉద్యోగులకు రూ.800 నుంచి రూ.1000 మాత్రమే ఇస్తున్నారన్నారు. మొత్తం రూ.3 లక్షల 44వేల కోట్లపై వచ్చిన వడ్డీతో ఒక్కొక్క ఉద్యోగికి నెలకు రూ.6వేలు అందించే అవకాశం ఉందని వివరించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని జగన్ హామీ ఇచ్చారు.