ఆయువు నిలిపే అంబులెన్స్‌లేవీ?

ఆయువు నిలిపే అంబులెన్స్‌లేవీ? - Sakshi

ఎమర్జెన్సీ కేసులకు అందుబాటులో లేని ‘ఆక్సిజన్‌’ అంబులెన్స్‌లు

రాష్ట్రంలో సరిపోయినన్ని లేని ఏఎల్‌ఎస్‌ 108 వాహనాలు

 

సాక్షి, అమరావతి: ఆస్పత్రిలోగానీ, అంబులెన్స్‌లోగానీ రోగులకు ప్రాణవాయువును అందుబాటులో ఉంచాలన్నది సాధారణ పౌరులకు కూడా తెలిసిన విషయమే. సమయానికి ప్రాణవాయువు అందకపోతే ఎంత ప్రమాదమో ఇటీవల గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో మృత్యువాత పడిన చిన్నారులే ప్రత్యక్ష సాక్ష్యం. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు, విపత్కర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు నిలిపేవి అంబులెన్స్‌లు. రోగులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు వారిని వేగంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చేయ డంలో అంబులెన్స్‌లదే కీలకపాత్ర. రాష్ట్రంలో సేవలందిస్తున్న 108 అంబులెన్స్‌ల్లో ప్రాణాలు నిలిపే పరికరాలు ఉన్నవి కొద్ది శాతమే కావడం ఆందోళన కలిగించే అంశం. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.



ఇలాంటి ప్రమాదానికి గురైనప్పుడు పేషెంట్లకు విధిగా ప్రాణవాయువుతో కూడిన అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ఏఎల్‌ఎస్‌) అంబులెన్సులు ఉండాలి. కానీ అలాంటి 108 వాహనాలు మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉండటం బాధితులకు శాపంగా మారింది. తలకు తీవ్ర గాయాలైనప్పుడు, శ్వాస తీసుకోవడం కూడా కష్టమైన పరిస్థితి ఉన్నపుడు బాధితుడిని లైఫ్‌ సపోర్ట్‌ లేకుండానే ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. వాహనాల కొనుగోళ్లలో జాప్యం, నిర్వహణా వ్యయానికి సర్కారు వెనుకడుగు వేస్తుండటం తదితర కారణాలతో ఏఎల్‌ఎస్‌ వాహనాలు రోడ్డుమీదకు రాలేకపోతున్నాయి.

 

మెజార్టీ వాహనాలు బేసిక్‌ లైఫ్‌ సపోర్టువే

రాష్ట్రంలో 108 వాహనాలు 439 ఉన్నట్లు లెక్క చూపిస్తుండగా అందులో 363 వాహనాలు సాధారణ వాహనాలే. 5 కోట్లు దాటిన రాష్ట్ర జనాభాలో అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు ఉన్నది కేవలం 77 వాహనాల్లో మాత్రమే. ఒక్కో వాహనం రోజుకు 4 కేసులకు మించి అందుబాటులో ఉండలేదు. అంటే 300 పైచిలుకు ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే ఈ వాహనాలు అందుబాటులో ఉండగలవు. మిగతా ఎమర్జెన్సీ కేసుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకమే. ఇక ఈ వాహనాలకు మరమ్మతులు వచ్చినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది.

 

సగటున రోజుకు 17 వేలకు పైగా కేసులు

రాష్ట్రంలో రోజుకు సగటున 17,400కు పైగా 108 అంబులెన్సులకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. ఇందులో 1,900 వరకూ ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి. ఇందులో 80 శాతం రోడ్డు ప్రమాద బాధితులే ఉంటున్నారు. వీరికి విధిగా ప్రాణవాయువుతో కూడిన అంబులెన్సు కావాల్సిందే. కానీ అన్ని కేసులకు కావాల్సినన్ని అంబులెన్సులు రాష్ట్రంలో లేవు. ఇలాంటి కేసుల విషయంలో పట్టణ ప్రాంతాల్లో అయితే 20 నిముషాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 25 నిముషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకోవాలి. నిర్ణయించిన సమయానికి కూడా చేరలేని పరిస్థితి ఉంది.

 

గోల్డెన్‌ అవర్‌ కోల్పోతున్నారు

ప్రమాదం జరిగిన తొలి గంటలో బాధితుడిని ఆస్పత్రికి చేర్చి వైద్యం అందించడాన్ని ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు. ఈ గోల్డెన్‌ æఅవర్‌ ఎంత ముఖ్యమైనదో ఆ బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చే పద్ధతి కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా తలకు గాయాలైన బాధితులను అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వాహనాల్లోనే తీసుకురావాలి. కానీ మన రాష్ట్రంలో చాలామంది బాధితులు గోల్డెన్‌ అవర్‌ను కోల్పోతున్నారు. తొలి గంటలో ఆస్పత్రి రాలేకపోవడం ఒకెత్తయితే.. అంబులెన్సులో సరైన చికిత్స అందించలేకపోవడం మరో ఎత్తు. ఏటా మన రాష్ట్రంలో 8 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లోనే మృతిచెందుతుండటం కూడా గమనార్హం.

 

బేసిక్‌ లైఫ్‌సపోర్ట్‌ వాహనంలో ఉండేవి

బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ వాహనాల్లో కేవలం మల్టీ చానెల్‌ మానిటర్, పల్సాక్సీ మీటర్, బీపీ మానిటర్‌ వంటి ప్రాథమిక వైద్యానికి పనికివచ్చే పరికరాలు మాత్రమే ఉంటాయి. వీటితో పాటు థర్మామీటర్, స్టెతస్కొప్‌ వంటివి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. ఈ వాహనాల్లో ఉన్న పరికరాలు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే అవకాశం ఉండదు. ఆక్సిజన్‌ అవసరమైనప్పుడు ఇలాంటి వాహనాలు అసలే పనికిరావు. ఇందులో సాధారణ స్ట్రెచర్‌ మాత్రమే ఉంటుంది.

 

అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వాహనంలో ఉండేవి

ఏఎల్‌ఎస్‌ వాహనాల్లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా బాధితుడు శ్వాస తీసుకోలేని సమయంలో కృత్రిమ శ్వాస అందించడానికి ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ ఉంటుంది. దీంతో పాటు గుండెపోటు బాధితులకు ఉపయోగపడే డిఫ్రిబ్యులేటర్‌ అందుబాటులో కూడా ఉంటుంది. వీటితో పాటు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అత్యాధునిక పరికరం ఇన్‌ఫ్యూజన్‌ పంపు కూడా ఉంటుంది. ఇందులో ఉన్న స్ట్రెచర్‌ కూడా పేషెంటు పరిస్థితిని బట్టి వాడుకునేటట్టు తయారు చేసి ఉంటుంది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top