‘ప్రైవేట్‌’కు పట్టని ‘నో బ్యాగ్‌ డే’  | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’కు పట్టని ‘నో బ్యాగ్‌ డే’ 

Published Mon, Aug 5 2019 4:33 AM

Private Schools negligence on Implementing No School bag day - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించే కార్యక్రమాల అమలులో ప్రైవేటు పాఠశాలలు బేఖాతరుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడిలేని చదువులు కొనసాగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరిగా నెలలో రెండు శనివారాలు ఆనంద వేదిక పేరుతో ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ను చేపట్టాలని నిర్దేశించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో అకడమిక్‌ వ్యవహారాలకు సంబంధించి ఏ యాజమాన్య పాఠశాల అయినా ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఎస్సీఈఆర్టీ రూపొందించే పాఠ్య ప్రణాళికలు, ఇతర అంశాలను ప్రైవేటు పాఠశాలలు సైతం అమలుచేయాల్సిందే. కానీ, ప్రభుత్వం ప్రకటించిన ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ను ప్రైవేటు పాఠశాలలు అమలుచేయడంలేదు. దీనిపై పాఠశాల విద్యా శాఖ కూడా పెద్దగా దృష్టి సారించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమ్మ ఒడి వంటి పథకాలను తమకు కూడా వర్తింపజేయాలని డిమాండ్‌ చేసిన ప్రైవేటు పాఠశాలలు ఆనంద వేదికను అమలుచేయకపోవడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.  

ప్రభుత్వ సిలబస్‌ కూడా బేఖాతర్‌ 
ఇదిలాఉంటే.. ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌లోని పుస్తకాలను కాకుండా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను ప్రైవేట్‌ స్కూళ్లు పిల్లలతో చదివిస్తున్నాయి. ఆటపాటలు, ఇతర కృత్యాలు ఇక్కడ లేనేలేవు. ఎస్సీఈఆర్టీ కూడా ప్రస్తుతానికి ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేసింది. హైస్కూలు విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బోధనకు ఆటంకం ఏర్పడుతుందేమోనన్న భావనతో వారికి ప్రస్తుతానికి ఈ ఆనందవేదిక కార్యక్రమాలను అమలుచేయడంలేదు. సమగ్ర నిరంతర మూల్యాంకనం కింద నిర్వహించే కృత్యాలనే కొనసాగిస్తోంది. ప్రాథమిక పాఠశాలలకే ఆనంద వేదిక కింద ‘సృజన’, ‘శనివారం సందడి’ కార్యక్రమాలను పరిమితం చేసినా ప్రైవేటు పాఠశాలలు వాటిని కూడా పాటించకపోవడం గమనార్హం. కాగా, రాష్ట్రంలోని దాదాపు 61 వేల పాఠశాలల్లో 70 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుతుండగా అందులో 42 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లోనే ఉన్నారు.  

ఒకటి, రెండు వారికి ఆనంద వేదిక ఇలా.. 
ఒకటి, రెండు తరగతులకు సంబంధించిన విద్యార్థులతో ఒకటి, మూడు శనివారాల్లో పాఠ్యపుస్తకాలు లేకుండా అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు పాడించడం, కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టితో బొమ్మలు చేయడం వంటి కార్యక్రమాలు అమలుచేయాలి. 

3, 4, 5 తరగతుల్లో ఇలా.. 
- బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బొమ్మలు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఏకపాత్రాభినయం, నాట్యం చేయడం వంటివి చేపట్టాలి.  
- పాఠశాలల్లో తోటల పెంపకం, పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి.  
- పాఠశాలను, తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా నేర్పాలి.  
- పుస్తకాల పఠనం, కథలు రాయడం, చెప్పడం వంటివి చేపట్టించాలి.  
- అలాగే గ్రామంలోని ముఖ్యమైన అధికారులు, ఇతర ముఖ్యులను పిలిచి వారితో మాట్లాడించాలి.  
- కానీ, ఇవేవీ ప్రైవేటు పాఠశాలల్లో అమలుచేయడంలేదు. ఇవే కాకుండా ఎస్సీఈఆర్టీ ఇచ్చే ఇతర ఆదేశాలను కూడా అవి పట్టించుకోవడంలేదు.  

Advertisement
Advertisement