నేనున్నానని.. | Sakshi
Sakshi News home page

నేనున్నానని..

Published Wed, Oct 3 2018 6:41 AM

People Sharing Their Problems to YS Jagan - Sakshi

విజయనగరం, నెల్లిమర్ల  నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన ప్రజాసంకల్ప యాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రజలు అధిక సంఖ్యలో పోటెత్తి జననేత జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్లు, జర్నలిస్టులతో పాటు విభిన్న రంగాలకు చెందిన వారు తమ సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి  తీసుకువచ్చారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తమపై చల్లని చూపు ప్రసరించాలని కోరుకుంటూ వినతిపత్రాలు అందజేశారు. అందరి సమస్యలు ఓపిగ్గా విన్న జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే అందరికీ మంచి రోజులు వస్తాయని.. ప్రతి ఒక్కరికీ నేనున్నానని... భరోసా ఇవ్వడంతో ప్రతిఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు.

విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం:  మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలని మున్సిపల్‌ వర్కర్స్, ఎంప్లాయీస్‌ యూనియన్‌  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి టీవీ రమణ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని పారిశుద్ధ్య కార్మికులతో కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్మార్ట్‌ సిటీలుగా మార్చుతామని గత ఎన్నికల సభల్లో చంద్రబాబునాయుడు ప్రకటించారన్నారు. స్మార్ట్‌ సీటీల సంగతి ఎలా ఉన్నా పట్టణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పౌరసేవలను ప్రైవేటీకరణ చేస్తూ మున్సిపల్‌ కార్మికులపై తీవ్రమైన పనిభారం పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులను ప్రైవేట్‌ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు జీఓ 279ను తీసుకువచ్చారని చెప్పారు. ఆ జీఓను రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి  పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం మెండిగా వ్యవహరిస్తోందన్నారు. విజయనగరం జిల్లాలో కార్మికులతో చర్చించకుండానే దొంగదారిన జీఓ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని... దీనిపై ఆగస్టు 8వ తేదీ నుంచి   సమ్మె చేస్తున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిం చాల్సిన మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు 32 మంది కార్మికులను ఇబ్బంది గురిచేస్తున్నారని వాపోయారు.  కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ తరఫున సహకారం అందించాలని కోరగా... జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఒప్పంద సహాయ అధ్యాపకులతొలగింపునకు రంగం సిద్ధం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ (కే) ఒప్పంద సహాయ అధ్యాపకులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బృందం ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొత్తపేటలో జగన్‌మోహన్‌రెడ్డి బస చేసిన దగ్గర వీరంతా ఆయన్ని కలిసి సమస్య వివరించారు. పదేళ్లుగా తాము పనిచేస్తున్నామని.. ఇప్పుడు ఏపీపీఎస్సీ నుంచి కొత్తగా రిక్రూట్‌చేసి మమ్మల్ని తొలగించేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. నాలుగేళ్లుగా వేతనాలు పెంచలేదని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం విషయంలో సుప్రీంకోర్టు నిబంధనను అమలు చేయడం లేదన్నారు. ఇందుకోసం నియమించిన ఫోర్‌మెన్‌ కమిటీ నివేదిక ఇచ్చినా బహిర్గతం చేయడం లేదని చెప్పారు. త్వరలో మీ ప్రభుత్వం వచ్చాక మాకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్‌ చేయాలని బీఆర్‌ అంబేడ్కర్, బొత్స ధర్మారావు తదితరులు  కోరారు.

మహిళలనికూడా చూడలేదు..
మహిళలని కూడా చూడకుండా పోలీస్‌స్టేషన్లలో కూర్చోబెట్టారని పారిశుద్ధ్య కార్మికులు బండి ఎర్రమ్మ, అప్పలకొండ, జి. గౌరిలు వాపోయారు. కొత్తపేట గొల్లవీధి వద్ద కార్మిక సంఘ నాయకుడు టీవీ రమణ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జీఓ 279 వల్ల తాము కాంట్రాక్టర్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతామని చెప్పారు. ధర్నా చేసినప్పుడు మహిళలపై కూడా పోలీసులు, అధికారులు చేయి చేసుకున్నారని తెలిపారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక మాలాంటి వారికి న్యాయం చేయాలని కోరారు.

జర్నలిస్టుల జీవన ప్రమాణాలు మెరుగుపరచండి
రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల (ఏపీయూడబ్ల్యూజే) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు కోరారు. విజయనగరం పట్టణ పరిధిలో గల కొత్తపేట శిబిరం వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని సంఘ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మారావు, తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. అయితే జర్నలిస్టుల జీవన ప్రమాణాలు మాత్రం బాగా దిగజారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదన్నారు. జర్నలిస్టుల వృత్తి భద్రతకు మహరాష్ట్ర మాదిరిగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని, జర్నలిస్టులు సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరుకు ప్రత్యేక జీఓలు తీసుకురావాలని.. కార్పొరేట్‌ ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కనీసం గ్రాడ్యుయేట్‌ స్థాయి వరకు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. 20 ఏళ్ల సర్వీస్, 50 ఏళ్ల వయస్సు పూర్తయిన జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల ఫించన్‌ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సంఘ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement