ఆగని దిగుమతులు | peanut crop fair price is decreased | Sakshi
Sakshi News home page

ఆగని దిగుమతులు

Oct 15 2014 1:33 AM | Updated on Oct 1 2018 2:03 PM

కేంద్ర నిర్ణయం శనగ రైతుల పాలిట శాపంగా మారనుంది. ఒకపక్క ఇప్పటికే దిగుమతులు ఎక్కువ కావడంతో ఇక్కడ పండించిన శనగ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది.

శనగ దిగుమతులు మరో మూడు నెలలు పొడిగించిన కేంద్రం
ధర దిగజారి ఆందోళనలో రైతులు

 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్ర నిర్ణయం శనగ రైతుల పాలిట శాపంగా మారనుంది. ఒకపక్క ఇప్పటికే దిగుమతులు ఎక్కువ కావడంతో ఇక్కడ పండించిన శనగ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దీంతో మూడేళ్లుగా లక్షలాది క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజిల్లో మగ్గుతున్నాయి. కోల్డ్‌స్టోరేజిలో ఉన్న శనగలపై తీసుకున్న రుణం కాలపరిమితి ముగియడంతో వీటిని వేలం వేసేందుకు బ్యాంకర్లు సన్నద్ధమైన సంగతి తెలిసిందే.
 
 ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శనగల దిగుమతులను అడ్డుకుని, ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామని చెబుతున్న హామీలు నీటిపై రాతలుగా మారుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా పెద్ద ఎత్తున దిగుమతులు మన దేశానికి వచ్చాయి. ఇప్పటికే గుంటూరు, ప్రకాశంతో పాటు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కలిపి సుమారు 25 లక్షల క్వింటాళ్ల శనగలు రైతుల వద్దే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో శనగలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే మిగిలిన పప్పు ధాన్యాలకు ఆరు నెలలు, శనగలకు మూడు నెలల పాటు దిగుమతి చేసుకోవడానికి  అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల శనగరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మూడేళ్లుగా శనగలు పేరుకుపోవడంతో ఈ ఏడాది పొగాకు పంట వేయాలని ప్రకాశం జిల్లా రైతులు భావించారు. అయితే ఇప్పటి వరకూ వర్షాలు సరిగా పడకపోవడం, సాగునీరు సకాలంలో రాకపోవడంతో పొగాకు వేసే సమయం మించిపోయింది. దీంతో రైతు తప్పనిసరై మళ్లీ శనగ పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఫ్యూచర్ ట్రేడింగ్‌లో  ఈ ఏడాది మార్చిలో శనగ ధర క్వింటాలుకు రూ.3416లు ఉండగా అది జూలైకి రూ. 2650కి పడిపోయింది. భారీ ఎత్తున మన దేశానికి వచ్చిన శనగ దిగుమతులే దీనికి కారణం. ఆస్ట్రేలియా, టాంజానియా, మయన్మార్, ఇథియోపియా, మలేసియా, కెనడా, అరబ్ ఎమిరేట్స్, జపాన్ తదితర దేశాల నుంచి శనగలు దిగుమతి అవుతున్నాయి. 2014 సంవత్సరంలోనే పదివేల క్వింటాళ్ల వరకూ దిగుమతి అయ్యాయి.  

ఈ దిగుమతులు ఇంకా కొనసాగితే శనగల ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2012-13లో మన దేశంలో 8.83 మిలియన్ టన్నుల శనగ ఉత్పత్తి కాగా, 2013-14లలో 9.88 మిలియన్ టన్నులు అంటే 11.9 శాతం ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది కూడా  9.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శనగ సాగులో ఏడు శాతం మన దేశంలోనే ఉంది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న కాక్-2 రకం ఎగుమతి చేస్తుంటారు.  

2007లో దేశంలో పప్పు ధాన్యాల కొరత ఏర్పడిన సమయంలో పన్ను లేకుండా దిగుమతులకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో అన్ని పప్పు ధాన్యాల  ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. కాక్-2 రకం శనగల ఎగుమతిపై కూడా నిషేధం విధించింది. అప్పటి శనగరైతుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి వివరించగా ఆయన వెంటనే స్పందించారు. ఒక బృందాన్ని అప్పటి ఎంపీ పురంధరేశ్వరితోపాటు ఢిల్లీ పంపించారు. దీంతో కేంద్రం కాక్-2 రకంపై నిషేధం ఎత్తివేసింది.

ప్రస్తుతం కాక్-2 రకంపై నిషేధాం లేకపోయినా వాటిని ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శనగల దిగుమతులపై  సుంకం విధించడంతో పాటు కాక్-2 రకం శనగల ఎగుమతికి కృషి చేస్తేనే శనగరైతు కోలుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement