
రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా
టీడీపీ ఎంపీ హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే రాజీనామా చేసిన హరికృష్ణ ఈసారి నేరుగా స్పీకర్ ఫార్మాట్లో లేఖ అందించారు. గత కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో సమైక్య నినాదం ఎత్తుకున్న హరికృష్ణ తాజాగా రాజీనామా చేయటం రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది.
త్వరలో ఆయన రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలని, వారిని విడదీయొద్దని డిమాండ్ చేస్తూ కృష్ణాజిల్లా నుంచి చైతన్య రథ యాత్ర చేపట్టనున్నారు. కాగా హరికృష్ణ రాజీనామా టీడీపీలో ఇబ్బంది కలిగించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఈనెల 25 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఓ వైపు బావ, మరోవైపు బావమరిది చేపట్టనున్న యాత్రలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.