ఆంధ్రా సింగపూర్!
సహజంగా సింగపూర్ పేరు వినగానే జీవితంలో ఒక్కసారైనా అక్కడి అందాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి రావాలని.. అక్కడ షాపింగ్ చేయాలని సరదా పడుతుంటారు.
సాక్షి, నరసరావుపేట :సహజంగా సింగపూర్ పేరు వినగానే జీవితంలో ఒక్కసారైనా అక్కడి అందాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి రావాలని.. అక్కడ షాపింగ్ చేయాలని సరదా పడుతుంటారు. అదంతా స్థితిమంతుల ఆలోచనలు. అయితే పస్తులతో గడపలేక కాయకష్టం చేసేందుకు సింగపూర్‌కు తరలివెళ్లి అక్కడ అష్టకష్టాలు పడి బతుకుజీవుడా అంటూ తిరిగి స్వగ్రామానికి చేరుకున్న కొందరు శ్రామికులను సృశిస్తే స్వగ్రామం కంటే సింగపూర్ ఏం గొప్పది కాదన్నవైనం స్పష్టమవుతుంది. ఒకరిని చూసి ఒకరు 300 మందిపైగా స్వగ్రామం వీడి అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేసేందుకు సింగపూర్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లాలంటే విమాన ఖర్చులతో పాటు కంపెనీ వీసా పొందేందుకు ఒక్కొక్కరికి సుమారు రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ఈ మొత్తాన్ని తీసుకున్న దళారులు కొందరికి మంచి కంపెనీల్లో పని ఇప్పించి అక్కడ అంతా బ్రహ్మాండంగా ఉందని తెలిసేలా మొదట్లో కొందరికి అవకాశం కల్పించారు.
ఆ తరువాత దళారుల చేతుల్లో మోసపోయి కంపెనీలో పనిదొరక్క సింగపూర్ వీధుల్లో అక్కడి పోలీసులకు దొరక్కుండా దొంగచాటుగా పనులు వెతుక్కొని దుర్భర జీవితం అనుభవించిన వారు కోకొల్లలు. వివరాలు పరిశీలిస్తే.. పల్నాడు ప్రాంతంలోని చారిత్రాత్మక గ్రామమైన గురజాల మండలం జంగమహేశ్వపురం నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మంచి పంటలు పండుతూ కళకళలాడుతుండేది. అయితే 2004 ముందు ఐదేళ్ల పాటు రాక్షసకరువు తాండవించడంతో సాగర్ కాలువల ద్వారా నీరు రాక, వర్షాలు కురవక పంట పొలాలన్నీ బీడు భూములుగా మారి రైతుల ఆత్మహత్యలకు, వలసలకు వేదికగా నిలిచింది. చాలామంది రైతులు లారీ క్లీనర్‌గా, పట్టణాల్లోని పత్తి మిల్లులు, పొగాకు బ్యారన్‌లలో ముఠా కూలీలు వలసలు వెళ్లి జీవనం సాగించాల్సిన దుస్థితి.
ఈ నేపథ్యంలో సింగపూర్ వెళితే రోజుకు 8 గంటల వంతున పనిచేస్తే నెలకు వెయ్యి నుంచి రెండువేల డాలర్లు సంపాదించవచ్చని దళారులు ఆశ చూపడంతో అనేకమంది అమాయకులు వారి బుట్టలో పడ్డారు. మొదట్లో సింగపూర్ వెళ్లిన వారి పరిస్థితి బాగుండడంతో గ్రామంలోని వందలాది మంది వారిని ఆదర్శంగా తీసుకొని సింగపూర్ వెళ్లేందుకు దళారులను ఆశ్రయించారు. సింగపూర్‌లో ఉన్న కంపెనీలకు పదుల సంఖ్యలో మాత్రమే కూలీలు అవసరమైనప్పటికీ ఇక్కడి నుంచి వందల సంఖ్యలో పంపి దళారులు డబ్బు దండుకున్నారు. సింగపూర్ వెళ్లిన వారిలో అధిక శాతం మందికి కంపెనీలు పని చూపలేకపోవడంతో ఏంచేయాలో పాలుపోక దళారులకు చెల్లించిన డబ్బు అయినా సంపాదించుకొని స్వగ్రామానికి వచ్చేయాలనే ఉద్దేశంతో కంపెనీ నుంచి పారిపోయి రోడ్లవెంట పనులు చేసుకుంటూ అక్కడి పోలీసులకు దొరకకుండా దొంగతనంగా జీవనం గడపాల్సిన దుస్థితి నెలకొందని అనేకమంది వాపోయారు.
మరికొందరైతే పోలీసులకు దొరికిపోయి అక్కడి నిబంధనల ప్రకారం ఒంటిపై వాతలు వేయించుకొని జైలు జీవితం గడిపి కట్టిన డబ్బులు సైతం చెల్లించుకోలేక అప్పులపాలై ఇంటికి తిరిగివచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే జంగమేశ్వరపురం నుంచి ఎక్కువ మంది వెళ్లడంతో ఈ గ్రామానికి మాత్రం ఆంధ్రా సింగపూర్‌గా పేరొచ్చింది. అయితే సింగపూర్ వెళ్లి జల్సాగా బతకలేదని... కూలి పని చేసి కష్టాలుపడి మోసపోయామని సింగపూర్ వెళ్లి వచ్చిన అనేకమంది బాధితులు సాక్షికి తెలిపారు. 2004 తరువాత ఆ గ్రామం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. వర్షాలు సకాలంలో కురవడం, సాగర్ కాలువల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందడంతోపాటు పండిన పంటకు గిట్టుబాటు ఉండడంతో గతేడాది వరకు రైతుల పరిస్థితి మెరుగైంది. గతంలో ఉన్న అప్పులను తీర్చుకొని హాయిగా జీవనం సాగిస్తున్నారు. దీంతోపాటు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రస్తుతం గ్రామానికి చెందిన సుమారు వంద మంది వరకు సాఫ్ట్‌వేర్ రంగంలో వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు.