వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

Deputy CMs Alla Nani And Pilli Subhash Talks Over Water Grid Project In Godavari Districts - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : అందరి నోటా ఒకటే మాట.. గోదావరికి వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కావాల్సిందే.. మూడున్నరేళ్లలో పూర్తి చేయాల్సిందే.. ప్రతి ఇంటికీ శుద్ధిచేసిన కుళాయి నీటిని సరఫరా జరగాల్సిందే.. సూచనలు, సలహాలకు అనుగుణంగా లోటుపాట్లు సమీక్షించుకొని ముందుకు వెళదాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో వ్యక్తమైన ఏకాభిప్రాయం ఇదీ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాజెక్టుగా వాటర్‌గ్రిడ్‌ను గోదావరి జిల్లాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకోవడం ఈ ప్రాంత ప్రజలపై ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని స్పష్టం చేస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు.

చివరకు టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, మంతెన కూడా ప్రాజెక్టును స్వాగతించారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన సుమారు 5 గంటలపాటు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు జిల్లాలకు కలిపి రూ.8,500 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టుపై మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒకే మాట చెప్పారు. 

ప్రజాప్రతినిధులకు అవగాహన 
తొలుత ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు గాయత్రీదేవి, రాఘవయ్య పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు డీటైల్డ్‌ రిపోర్టుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించాలనే ముఖ్యమంత్రి బృహత్‌ సంకల్పంలో అంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల నాని సూచించారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం, ఐ.పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇన్‌టేక్‌ పాయింట్ల ఏర్పాటుపై చర్చ సాగింది. పేపర్‌ మిల్లు కాలుష్యం, నల్లా చానల్‌ కాలుష్యం ఉన్న ప్రాంతాల నుంచి గోదావరి ముడినీటిని (రావాటర్‌)ను సరఫరా చేయడమా లేక, ఎక్కడికక్కడ పంట కాలువల్లో నీటిని ఫిల్టర్‌చేసి సరఫరా చేయడం మంచిదా అనేది అధ్యయనం జరగాలని మంత్రులు పినిపే విశ్వరూప్, కన్నబాబు, శ్రీరంగనాథరాజు సూచించారు. తాను ఆర్‌డబ్ల్యూఎస్‌ మంత్రిగా ఉండగా కోనసీమకు మంజూరు చేసిన మంచినీటి ప్రాజెక్టును ఈ సందర్భంగా విశ్వరూప్‌ వివరించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువుల కాలుష్యంతో మంచినీటి కష్టాలను సోదాహరణంగా మంత్రి బోస్‌ వివరించి వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఇందుకు సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని గుర్తిం చాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రధాన కాలువల్లో నీటిని తీసుకుంటే ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాలని మంత్రి రంగనాథరాజు సూచించారు. ఇన్‌టేక్‌ పాయింట్‌ వద్దనే ఫిల్టరైజేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలా, నాలుగైదు నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్‌ పరిధి, మండల స్థాయిలో.. వీటిలో ఎక్కడ స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేయాలి, ఫిల్టరైజేషన్‌ ఎక్కడ చేయాలి తదితర అంశాలపై ఎంపీలు వంగా గీత, అనురాధ, భరత్‌రామ్, రఘురామకృష్ణంరాజు పలు సూచనలు చేశారు. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుతో ఇప్పుడున్న సీపీడబ్లు్యసీ, ఫిల్టరైజేషన్‌ ప్లాంట్‌లు ఎక్కడా వృథాకాకుండా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి బోస్‌ నొక్కిచెప్పారు.

గోరంట్లకు కన్నబాబు చురకలు
వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును తమ ప్రభుత్వంలోనే రూపొందించామని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి గొప్పలకు పోయే ప్రయత్నాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తిప్పికొట్టారు. చంద్రబాబు ఈ వాటర్‌ గ్రిడ్‌కు కన్సెల్టెన్సీ పేరు చెప్పి రూ.38 కోట్లు ఖాళీ చేసిన విషయాన్ని గుర్తుచేసి మంత్రి కన్నబాబు గోరంట్లకు చురకలంటించారు. అటువంటి కన్సెల్టెన్సీల ప్రమేయం లేకుండానే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల సమర్థతపై నమ్మకంతో ప్రాజెక్టు నివేదిక రూపొందించే బాధ్యత అప్పగించిన ముఖ్య మంత్రి నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. ఈ విషయంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు కృషిని మంత్రులు అభినందించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పాలకొల్లు వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్‌ కవురు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top