
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ నగరంలో సుబ్బు హత్య మరవకముందే సోమవారం జరిగిన మరో హత్య చర్చనీయాంశమైంది. రాత్రిపూట బయటకు వచ్చిన వారికి రక్షణ కరువైందనడానికి నిదర్శనంగా నిలిచింది. చిన్నపాటి మొత్తాల కోసమే ప్రాణాలుతీసే స్థితికి గంజాయి, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం రాత్రి విజయవాడలోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో జరిగిన హత్య అటు పోలీసులను, ఇటు నగరవాసులను భయానికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.
కాలకృత్యాల కోసం వెళితే..
శ్రీనగర్ కాలనీకి చెందిన చిందా వెంకటేశ్వరరాజు (55) ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం సెంటర్‌లో నూడిల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. రోజూ రాత్రి కాలకృత్యాల కోసం రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని ఏలూరు కాలువ వద్దకు వెళ్తుంటాడు. ఆదివారం రాత్రి కూడా అలాగే వెళ్లాడు. అక్కడ మద్యం తాగి ఉన్న షేక్ బాజీ (21), కర్ల శశికుమార్ (22), ఓ జువైనల్ (18).. వెంకటేశ్వరరాజుపై దాడి చేశారు. ఆయన చేతికి ఉన్న ఉంగరం, సెల్‌ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించగా, వెంకటేశ్వరరాజు ప్రతిఘటించాడు. నిందితులు తమ వద్ద ఉన్న కత్తెరతో వెంకటేశ్వరరాజు డొక్కలో పొడవడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. సమీపంలోని బండరాయి తీసుకొని కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ ఘటనను దుర్గా అనే వ్యక్తి చూశాడు. నిందితులు దుర్గాను కూడా వెంబడించి గాయపరిచారు. వెంకటేశ్వరరాజు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుమారుడు బాలాజీ, కుమార్తె చౌదామణి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన చెందారు. గతంలో ఒకసారి కాలకృత్యాల కోసం వెళ్లిన వెంకటేశ్వరరాజు గాయపడటంతో అలాగే జరిగిందేమోనని ఆందోళన చెందారు. తండ్రి ఆచూకీ కోసం వెతికారు. రాత్రి 11.30 గంటలకు ఏలూరు కాలువ సమీపంలో వెంకటేశ్వరరాజు విగతజీవిగా కనిపించాడు. స్థానికులు అతనిని 108లో ఆస్పత్రికి పంపించారు. సమాచారం అందుకున్న సింగ్‌నగర్ సీఐ ఎం.సత్యనారాయణరావు, ఎస్‌ఐ నరేష్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, పైపులరోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారే నిందితులని తేలింది. హత్యకు కారణాలపై విచారణ చేస్తున్నారు.
నిందితుల అరెస్టు
విజయవాడ: హత్య కేసులో ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒక జువైనల్ ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి లా అండ్ ఆర్డర్ డీసీపీ క్రాంతిరాణా టాటా సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
బ్లేడ్ బ్యాచ్ కాదు
హత్య కేసులో నిందితులు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కాదని డీసీపీ తెలిపారు. నిందితులు ముగ్గురూ విద్యార్థులని చెప్పారు. జువైనల్ సీనియర్ ఇంటర్ సీఈసీ చదువుతుండగా, శశికుమార్ హౌస్ కీపింగ్ కోర్సు చేస్తున్నాడని, షేక్ బాజీ డిగ్రీ చదువుతున్నాడని వెల్లడించారు. తల్లిదండ్రులు పట్టించుకోక పోవడంతో వారు చెడు వ్యసనాలకు లోనై మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నారని వివరించారు. గతంలో నిందితులపై కొట్లాట కేసు ఉందన్నారు. నిందితులు ముగ్గురూ సోమవారం సాయంత్రం వైవీ రావు ఎస్టేట్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అరెస్టు చేశామన్నారు. సమావేశంలో ఏసీపీ శ్రావణి సీఐలు సత్యానందం, సహేరాబేగం పాల్గొన్నారు.