ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా

Published Mon, Dec 1 2014 2:00 AM

AIDS Control Machinery Society  programs

రాజాం :  కొద్ది సంవత్సరాల క్రితం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా ప్రస్తుతం నియంత్రణ దిశలో సాగుతోంది. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ యంత్రాంగం చైతన్య కార్యక్రమాలు, ప్రజల్లో కూడా వ్యాధి తీవ్రతపై అవగాహన పెంపొందించడం వంటి వాటి వల్ల క్రమేపీ హెచ్‌ఐవీ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మం చి పరిణామంగా వైద్య యంత్రాంగం పరిగణి స్తోంది. అయితే ఈ వ్యాధి తమకు సోకిందని తెలియని వారు, తెలిసీ బయటకు చెప్పుకోలేని వారు, మానసికంగా కుంగిపోతున్నవారి లెక్కలు లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.
 
 జిల్లాలో తాజా స్థితిగతులు ఇలా...
 జిల్లాలో 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఇతర సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు ద్వారా సేకరించిన రక్తం యూనిట్లు 6480 కాగా వీరిలో 25 మందికి హెచ్‌ఐవీ పాజి టివ్‌గా నిర్ధారించారు. ఇది 0.39 శాతం. అలాగే గ ర్భిణులను 20,268 మందిని పరీక్షించగా వీరిలో 29 మంది హెచ్‌ఐవీ(0.14 శాతం)తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇక సాధారణ పరీక్షలు 29,628 మందికి జరపగా 667 మంది (2.25 శాతం)కి హెచ్‌ఐవీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే గతేడాది(2013-14)తో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది రక్తదాతలకు 0.71 శాతం, గర్భిణులకు 0.16 శాతం, సాధారణ పరీక్షల్లో 2.52 శాతం కాగా ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టింది.
 
 రోగ నిర్ధారణ...రోగులకు చికిత్స ఇలా...
 జిల్లా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ కేంద్రాలు(ఐసీటీసీలు) 15 చోట్ల ఉన్నాయి. అలాగే గ ర్భిణులను ప్రత్యేకంగా పరీక్షించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌తో పాటు పాలకొండ, టెక్కలి ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పీపీటీసీ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. హెచ్‌ఐవీ సోకిన వారికి సేవలందించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌లో యాంటీ రిట్రో వైరల్(ఏఆర్‌టీ) కేంద్రం ఏర్పాటు కాగా దీనికి అనుబంధంగా ఏఆర్‌టీలను రాజాం, టెక్కలి,  పాలకొండ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉచితంగా మందుల పంపిణీ, కౌన్సిలింగ్ తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. అలాగే వ్యాధి సోకిన గర్భిణులకు చికిత్స ప్రారంభించేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రాగోలులో కేర్ అండ్ సపోర్టు సెంట ర్‌ను ఏర్పా టు చేశారు. జిల్లా వ్యాప్తం గా శ్రీకాకుళం, పలాసలలో రెండేసి, సోంపేట, పాతపట్నం, పూండిలలో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు పార్టనర్ల పేరిట పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే జిల్లాలోని మొత్తం 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెస్టింగ్ కిట్లను పంపిణీ చేయడంతో పీహెచ్‌సీ స్థాయిలోనూ పరీక్షలు ఆరంభం కానున్నాయి.
 
 అవగాహన పెంపొందించుకుంటే నియంత్రణ...
 ఇదే విషయమై జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నోడల్ అధికారి, జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ డి.రత్నకుమారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఉమా మహేశ్వరరావు ఆదివారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ అవగాహన పెంచుకుంటే హెచ్‌ఐవీని అదుపులో ఉంచవచ్చునన్నారు. సందేహం ఉంటే పరీక్ష చేయించుకోవాలని, సరైన చికిత్స పొందితే దాదాపు 20 ఏళ్లు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని అన్నారు. కాగా హెచ్‌ఐవీ సోకిన రోగులకు రూ.వెయ్యి పింఛను, ఆర్టీసీలో ప్రయాణానికి 50 శాతం రాయితీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా 50 శాతం రాయితీతో రుణాలు అందజేస్తున్నారు.
 
 కొద్ది నిమిషాలు చర్చిస్తే చాలు...
 హెచ్‌ఐవీ, ఎయిడ్స్ తీవ్రతను ప్రజలకు తెలియజేందుకు ప్రభుత్వ యంత్రాంగం బహుముఖ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. అలాగే జిల్లాలో ఏ స్థాయి అధికారిక సమావేశం జరిగినా ప్రారంభంలో కొద్ది నిముషాలు ఎయిడ్స్‌పై చర్చించాలని నిర్దిష్టమైన ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఆరంభంలో అధికారులు ఈ నిబంధన పాటించి తర్వాత వదిలేశారు. మరో పక్క హెచ్‌ఐవీ, ఎయిడ్స్ జిల్లాలో చాపకింద నీరులా ప్రవేశిస్తోంది. రాజాం ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగులున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సమావేశాల ముందు ఎయిడ్స్‌పై చర్చించే ప్రక్రియ దాదాపు నిలిచిపోవడంతో గ్రామస్థాయి ప్రజలకు వ్యాధి తీవ్రతపై అవగాహన కలగడం లేదు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్యామల వివరణ ఇస్తూ ఇకపై అన్ని అధికారిక సమావేశాల్లో హెచ్‌ఐవీపై రెండు నిమిషాలైనా చర్చించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 వ్యర్థ్దాలతో ఎయిడ్‌‌స చిహ్నం
 సీతంపేట : స్థానిక మం డల సహిత ఉపాధ్యాయుడు కందికప్ప చక్రధర్ నేడు ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా వ్యర్థపదార్థాలతో ఎయిడ్స్ చిహ్నమైన రెడ్‌రిబ్బన్‌ను వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. దీనికి మధ్యలో గ్లోబు ఉంచారు.  దీన్ని తయారు చేయడానికి స్పైరల్ బైండింగ్ ఎరుపు పేపరు, ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ పైపు, పాత బంతి, రక్త పరీక్షల బీడలు, ఫెవికిక్ ఉపయోగించారు. రెండు గంటల సమయంలో దీన్ని తయారు చేసినట్టు చక్రధర్ తెలిపారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement