
యమదూతలు ఓ మనిషిని తీసుకొచ్చి యమలోకాన యమ ధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ మనిషి ఎంతో దిగాలు ముఖం వేసుకుని నిల్చున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు ఆ మనిషి ఖాతాను తరచి చూస్తున్నాడు. అతను ఏం తప్పు చేశాడని యమధర్మరాజు అడిగాడు. చిత్రగుప్తుడు అదే పనిగా అతని గురించి నమోదు చేసిన పేజీలను చదువుతుంటే తలతిరుగుతోంది. అంతా విన్నాడు యమధర్మరాజు.
‘అతనిని నరకలోకంలో పడేయండి’ అన్నాడు యముడు. వెంటనే చిత్రగుప్తుడు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ‘అతను అన్ని పాపాలు చేసిన ప్పటికీ ఒకే ఒక్క పుణ్యం చేశాడు. ఓరోజు ఓ వృద్ధురాలు గుడికి వెళ్ళడా నికి దారి అడిగితే చూపుడు వేలుతో దారి చెప్పడమే కాకుండా ఆమె చేయి పట్టుకుని వెళ్ళి దిగబెట్టాడు’. ఆ మాటతో యముడు తన తీర్పుని అప్పటికప్పుడు మార్చు కున్నాడు. ‘అతని చేతికి గంధం పూసి ముందుగా స్వర్గానికి తీసుకుపోండి. అనంతరం అతనిని నరకానికి తరలించవచ్చు’ అని ఆదేశించాడు.
కర్ణుడు వంటి పుణ్యాత్మునికీ మరణానంతరం ఓ సమస్య ఎదురయ్యింది. ఆయన మహాదాత. అయితే ఆయన ధన రాశులను, వస్తువులనే ఇచ్చాడు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చిన చరిత్ర ఆయనకు లేదు. నిర్యాణానంతరం కర్ణుడు స్వర్గానికే వెళ్లాడు. స్వర్గానికి వెళ్ళే వారికి ఆకలి అనేది ఉండదు. కానీ కర్ణుడికి ఆకలి వేసింది. ఓమారు కర్ణుడు ‘నాకు మాత్రమే ఎందుకు ఆకలి వేస్తోంది’ అని స్వర్గ లోక ద్వార పాలకుని అడిగాడు. అప్పుడతను ‘నువ్వు భూలోకంలో ఎవరికీ అన్నదానం చేయలేదు. అందుకే నీకు ఆకలి వేస్తోంద’ని చెప్పాడు. ‘మరిప్పుడు ఏం చేయాలి. ఆకలి ఎక్కువై భరించలేకపోతు న్నాను’ అన్నాడు కర్ణుడు. వెంటనే ద్వారపాలకుడు ‘కర్ణా, నీ చూపుడు వేలుని నోట పెట్టుకో. ఆకలి తగ్గిపోతుంది’ అన్నాడు. కర్ణుడు అలాగే చేశాడు. ఆకలి పోయింది. ఇందుకు కారణమేమిటి?
ఓసారి కృష్ణుడి సన్నిహితులకు కర్ణుడు అన్నం తినడానికి ఓ చోటును తన చూపుడు వేలుతో చూపించాడట. అది కాస్తా ఓ పుణ్య కార్యంగా కర్ణుడి ఖాతాలో జమైంది. పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న ఇటువంటి కథలను నమ్మవచ్చా, అసలు స్వర్గ–నరకాలు ఉన్నాయా అంటూ చర్చోప చర్చలు ఇక్కడ అనవసరం. మనిషిగా పుట్టినవాడు సాటి మనిషికి సాయం చేయడం అతడి కనీస ధర్మం అని తెలియచేయడానికి ఇటువంటి కథలు వాహకాలుగా నిలుస్తాయి. మానవ విలువలను ప్రోది చేసే భారతీయ తత్త్వం సర్వదా ఆచరణీయం. – యామిజాల జగదీశ్