
స్వామి సంబరానికి.. వాహనాల ముస్తాబు
● రేపటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
● ఊపందుకున్న ఏర్పాట్లు
● ఉత్సవ వాహనాలకు తుది మెరుగులు
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. కాస్త ఆలస్యంగా మొదలైన ఏర్పాట్లు నెమ్మదిగా ఊపందుకున్నాయి. కల్యాణోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్న వేళ రత్నగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ముఖ్యంగా రత్నగిరి రామాలయం పక్కన ఉన్న సత్యదేవుని వార్షిక కల్యాణ వేదిక అలవకరణ పనులు మొదలయ్యాయి. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లను ఊరేగించే ఉత్సవ వాహనాలను దాదాపు సిద్ధం చేశారు. వెండి గజ, గరుడ, ఆంజనేయ వాహనాలకు మెరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆ వాహనాలు నూతన శోభతో తళతళా మెరుస్తున్నాయి. కాకినాడకు చెందిన పీవీఎల్ మూర్తి తన బృందంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా తాను ఉత్సవ వాహనాలతో పాటు, వెండి సింహాసనాలు, వెండి మకర తోరణం వంటి వాటికి మెరుగు పెట్టిస్తానని ఆయన తెలిపారు. అలాగే, కొండ దిగువన ఉన్న రావణబ్రహ్మ, పొన్నచెట్టు చెక్క వాహనాలకు కూడా దేవస్థానం అధికారులు రంగులు వేయించి ముస్తాబు చేయించారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌కు గత శనివారం సత్యదేవుని కల్యాణోత్సవ శుభలేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 11న జరిగే రథోత్సవం పకడ్బందీగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని ఈఓ వీర్ల సుబ్బారావుకు కమిషనర్ సూచించారు. రథోత్సవం సందర్భంగా గత ఏడాది తాను అప్పటి ఈఓగా తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. కాగా, రథోత్సవం నాడు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ కూడా ఇప్పటికే ఈఓను ఆదేశించారు.
సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో
ప్రారంభమైన అలంకరణ

స్వామి సంబరానికి.. వాహనాల ముస్తాబు

స్వామి సంబరానికి.. వాహనాల ముస్తాబు

స్వామి సంబరానికి.. వాహనాల ముస్తాబు