
పారదర్శకంగా కార్యకలాపాలు
– అముడా ఉపాధ్యక్షురాలు, జేసీ నిషాంతి
అమలాపురం టౌన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అముడా) చేపట్టే కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలని అముడా ఉపాధ్యక్షురాలు, జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) టి.నిషాంతి సూచించారు. ఇందుకోసం ఆముడాకు నియమితులైన బోర్డు కమిటీ సభ్యులు కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక అముడా కార్యాలయంలో బోర్డు కమిటీ సభ్యులు, అధికారులతో సోమవారం జరిగిన తొలి సమావేశంలో నిషాంతి మాట్లాడారు. అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం బోర్డు కమిటీ సభ్యులు చేసిన పలు ప్రతిపాదనలపై చర్చించింది. పలు తీర్మానాలను ఆమోదించింది. అముడా పరిధిలోని భవన నిర్మాణ అనుమతులు, ఫీజుల నిర్ణయం, లే అవుట్ల అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. పంచాయతీల నుంచి డెవలప్‌మెంట్ చార్జీలు, 300 గజాలు పైబడిన అనుమతులన్నింటినీ అముడా పరిధిలోనే ఇచ్చేందుకు సాఫ్ట్‌వేర్ రూకకల్పన వంటి అంశాలపై జేసీ సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో 300 గజాల లోపు స్థలాల్లో అనుమతులను ఆయా పట్టణ ప్రణాళిక విభాగాల ద్వారా ఇస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అముడా పరిధిలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన ప్రాంతాలు రుడా (రాజమహేంద్రవరం) కుడా (కాకినాడ) పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. జిల్లా అంతటిని ఒక యూనిట్‌గా పరిగణించి అముడాను విస్తరించేందుకు సమావేశంలో బోర్డు కమిటీ ప్రతిపాదించింది. 2024–25 ఖర్చుల నివేదికను జేసీ ఆమోదించారు. అముడా బోర్డు కమిటీ సభ్యులు జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్.రాజబాబు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకరరావు, జిల్లా ఆర్ అండ్ బీ ఎస్‌ఈ బి.రాము, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, జిల్లా ప్లానింగ్ అధికారి సత్యమూర్తి పాల్గొన్నారు.