
శాట్‌కామ్ సంస్థలపై ట్రాయ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: స్టార్లింక్లాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) కంపెనీలు అడుగుతున్న దానికంటే అధిక స్థాయిలో స్పెక్ట్రం చార్జీలు విధించేలా కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు చేసింది. కంపెనీల సవరించిన ఆదాయాల్లో (ఏజీఆర్) 4 శాతాన్ని చార్జీగా నిర్ణయించాలని పేర్కొంది. ప్రతి మెగాహెట్జ్‌కి వార్షికంగా విధించే రూ. 3,500 స్పెక్ట్రం చార్జీకి ఇది అదనంగా ఉంటుంది.
ఇక, పట్టణ ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సరీ్వసులు అందించే ఆపరేటర్లు, ప్రతి యూజరుపై అదనంగా ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు మాత్రం అదనంగా చార్జీలేమీ ఉండవు. టెలికం శాఖకు (డాట్) ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. స్పెక్ట్రంను కంపెనీలకు అయిదేళ్ల పాటు కేటాయించాలని, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. శాట్‌కామ్ సరీ్వసులు ప్రారంభమైతే టెలికం నెట్‌వర్క్‌లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు.
శాట్‌కామ్ కంపెనీలు అభ్యరి్ధస్తున్న రేటు కంటే ట్రాయ్ సిఫార్సు చేసిన చార్జీలు గణనీయంగా అధికంగా ఉండటం గమనార్హం. స్పెక్ట్రం చార్జీని ఏజీఆర్‌లో 1 శాతం కన్నా తక్కువగానే ఉంచాలని, అదనంగా చార్జీలేమీ విధించొద్దని ట్రాయ్‌తో సంప్రదింపుల సందర్భంగా స్టార్‌లింక్, అమెజాన్‌కి చెందిన క్విపర్ సిస్టమ్స్ కోరాయి. ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పటికే శాట్‌కామ్ సేవల లైసెన్సులు లభించాయి. స్టార్‌లింక్ తుది లైసెన్సు తీసుకునే దశలో ఉంది.