
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన.
ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్‌లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు.
ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు.

గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.