lining canal
-
‘పాలమూరు’ అంచనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3 కింద నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్ మధ్య 8.32 కి.మీ.ల ఓపెన్ కాల్వ నిర్మాణం పనుల అంచనాల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. అంచనాలను రూ.416.1 కోట్ల నుంచి రూ.780.63 కోట్లకు సవరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ ప్రధాన కాల్వను 12.65– 31.2 కి.మీ.ల మధ్య రూ.148.76 కోట్ల అంచనాలతో లైనింగ్ చేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. రూ.153 కోట్లతో రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపు పనులకు కూడా ఓకే చెప్పింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ, ఆ మేరకు రూ.574.56 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చింది. గతంలో ఈ పనులను రూ.860.25 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనపర అనుమతులివ్వగా, రిజర్వాయర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత ఈ రిజర్వాయర్‌ను 9.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా, ఆ తర్వాత 4.8 టీఎంసీలకు, తాజాగా 1.41 టీఎంసీలకు తగ్గించారు. సీతారామపై మంత్రుల మధ్య సంవాదం !సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనాలు సవరించే అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య సంవాదం జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324 కోట్లకు పెంచాలనే ప్రతిపాదనలపై వాడీవేడి చర్చ జరిగింది. దీంతో ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించకుండా, రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో దీనిని రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా ప్రతిపాదించగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేసిందంటూ ఓ మంత్రి తప్పుబట్టినట్టు తెలిసింది. 67.5 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 3.89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన నేపథ్యంలో మళ్లీ పాత పథకాల ప్రస్తావన అనవసరమని మరో మంత్రి బదులిచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘంలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ నుంచి అనుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని, మళ్లీ పాత ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి సమస్యను జటిలం చేయవద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 2016 ఫిబ్రవరి 18న గత ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, 2018లో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచింది. -
పదేళ్లుగా సాగుతున్న పీబీసీ ఆధునికీకరణ పనులు
- లైనింగ్ కాలువలో పెరిగిన కంపచెట్లు - నీరు రాకముందే కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్న లైనింగ్‌లు పులివెందుల రూరల్ : దాదాపు పదేళ్ల నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) ఆధునీకరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పీబీసీ ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు వీలుగా కాలువల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. పీబీసీ ఆయకట్టు పరిధిలో కాలువలు 68కి.మీ ఉండగా.. 55,579ఎకరాల ఆయకట్టు పరిధి ఉంది. ఈ పరిధిలో మొత్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. 93 ప్యాకేజీలో తుంపెర డీప్‌కట్, బైపాస్ చానెల్, మెయిన్ కెనాల్లు కలిసి 23.2కి.మీ ఆధునీకరణ కోసం రూ32.69కోట్ల నిధులు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ28.08కోట్లు చేయగా.. 12.50శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా 92ప్యాకేజీలో 33కి.మీ నుంచి 68కిలోమీటరు వరకు కాలువలు లైనింగ్ వేయాల్సి ఉంది. ఇందుకు రూ44.04కోట్ల నిధులు మంజూరు కాగా.. దాదాపు రూ43.41కోట్లు ఖర్చు చేయగా.. 1.5శాతం పనులు మిగిలిపోయాయి. 93బిలో రూ73.06కోట్లు మంజూరు కాగా.. రూ55.47కోట్లు పనులు చేయడంతో 24.1శాతం పనులు నిలిచిపోయాయి. 92ఏలో రూ55.77కోట్లకు రూ30.73కోట్లు ఖర్చు చేయగా.. 32శాతం పనులు, 93ఏలో రూ38.81కోట్లకు రూ18.91కోట్లు చేయడంతో 50శాతం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. లైనింగ్ వేసిన కాలువల్లో మొలిచిన కంపచెట్లు : కాలువలను అధునీకరణలో భాగంగా కాలువలకు లైనింగ్ వేసిన నీరు సక్రమంగా రాకపోవడం, కాలువల సమీపంలోని పొలాలనుంచి మట్టి కోతకు గురి కావడంతో కాలువల్లో మట్టి రాళ్లతో ఉన్నాయి. దీంతో కాలువల్లో కంపచెట్లు పెరిగిపోయాయి. 6-8కి.మీ మధ్యలో అనంతపురం జిల్లా వెంకటాంపల్లె వద్ద కాలువలు లైనింగ్ వీసే సమయంలో పైనుంచి మట్టి జారిపడుతుండటంతో పనులు చేసేందుకు 6నెలల క్రితం ఎక్స్‌ఫర్ట్ కమిటీ పరిశీలన చేసిన పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దెబ్బతింటున్న లైనింగ్‌లు.. : పీబీసీ కాలువల ఆధునీకరణలో భాగంగా పాలూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పరిధిలో ఏర్పాటు చేసిన లైనింగ్‌లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల భూమి కోతకు గురి కావడంతో కాలువల రంథ్రాలు పడ్డాయి. నీరు రాకముందే దెబ్బతింటుండటంతో రైతులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెండింగ్ పనులకు టెండర్లు పిలిచే అవకాశం : పీబీసీ ఆధునీకరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. పెండింగ్‌లో ఉన్న పనులను తిరిగి టెండర్లకు పిలిచి పనులు చేయిస్తాం. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యం. - కిరణ్ కుమార్(పీబీసీ ఈఈ), పులివెందుల