BHIMILI Beach Road
-
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
విశాఖపట్నం: బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్‌ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో.. ఆయన పంపిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్సూ్టడియో సమీపంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు. -
అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై!
విశాఖపట్నం: భీమిలి బీచ్‌రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కలకలం రేపింది. సంఘటనా స్థలంలో పూసలు, సగం కాలిన దుర్గాదేవి ఫొటో, పంచె ఆధారంగా.. ఈ అస్థిపంజరం పెందుర్తికి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న(50)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని ఇక్కడకు తీసుకుని వచ్చి.. హత్య చేసి, అనంతరం కాల్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు అఖిల, భారతి అనే కుమార్తెలు కూడా ఉన్నారు. వీరికి వివాహం అయింది. 9న ఇంటి నుంచి బయటకు వెళ్లి.. వృత్తి రీత్యా ఇంటింటికి వెళ్లి జ్యోతిష్యం చెప్పే అప్పన్న ఈ నెల 9న ఆనందపురం వెళ్తానని ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి తిరిగి రాలేదు. ఈ నెల 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో తన తండ్రి కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో ఆయన కోసం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆనందపురం, బోయపాలెం ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. బోయపాలెం నుంచి కాపులుప్పాడ వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తితో అప్పన్న ద్విచక్ర వాహనం(పల్సర్ 220)పై వెళ్లినట్లు గుర్తించారు. దీంతో బోయపాలెం, పరదేశిపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు వెతికారు. కాపులుప్పాడ ఆర్ఎన్పీ లేఅవుట్లో బుధవారం గాలించగా.. అక్కడ ఓ వ్యక్తి ఎముకలు, పుర్రె వంటివి చెల్లాచెదురుగా కనిపించాయి. వెంటనే దుర్గాప్రసాద్ భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. కాల్ డేటానే కీలకం? అప్పన్న తమ్ముడు కుమార్తె పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు ఈ నెల 8న అప్పన్న వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లాడు. తిరిగి అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్న అప్పన్న.. ఫోన్లో ఎవరితో గట్టిగా మాట్లాడి వాగ్వాదానికి దిగినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. తమకు ఎటువంటి అప్పులు లేవని, సంతోషంగా జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీన రాత్రి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత రోజున అప్పన్న కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. అప్పన్న కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. క్లూస్ టీం వివరాలు సేకరించిందని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అస్థిపంజరాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. అప్పన్న చనిపోయి 4, 5 రోజులు అయి ఉంటుందని, శరీరం సగం కాలడంతో పలు భాగాలను కుక్కలు చెల్లా చెదురుగా తీసుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. భీమిలి సీఐ సుధాకర్ కేసు నమోదు చేశారు. అప్పన్నగా గుర్తింపు సంఘటనా స్థలంలో కేవలం పుర్రె, ఎముకలు వంటివి కాలిపోయి ఉన్నాయి. వాటి పక్కనే మెడలో వేసుకునే పూసలు, సగం కాలిన దుర్గాదేవి ఫొటో, పంచె ఆధారంగా కుటుంబ సభ్యులు అప్పన్నగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడకు తీసుకుని వచ్చి, హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
బీచ్‌రోడ్డులో రాజ్ తరుణ్ సందడి
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట, తొట్లకొండ బీచ్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నటుడు రాజ్ తరుణ్, నటి మనీషా కందూర్ నటిస్తున్న భలే ఉన్నాడే సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతోందని, హీరో రాజ్ తరుణ్ న్యూలుక్లో కనిపించబోతున్నారని దర్శకుడు జె. శివసాయి వర్ధన్ తెలిపారు. ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ ప్రముఖ పాత్రలో నటించగా, అమ్ము అభి (నారప్ప ఫేమ్), కృష్ణ భగవాన్, హైపర్ ఆది ఇతర పాత్రలో నటిస్తున్నారన్నారు. సంగీతం శేఖర్ చంద్ర అందిస్తున్నారు. మరో 8 రోజుల పాటు బీచ్‌రోడ్డు ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందన్నారు. -
భీమిలిలో కలర్స్ స్వాతి సందడి
కొమ్మాది(భీమిలి): భీమిలి బీచ్‌రోడ్డు మంగమారిపేట తీరం వద్ద బుధవారం హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేసింది. అందాల రాక్షసి ఫేమ్ నవీన్‌చంద్ర నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. పల్లెటూరు నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కళాశాలకు వెళ్లే సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్వంత్ నిర్మాత. హీరో నవీన్‌చంద్రపై చిత్రీకరిస్తున్న దృశ్యం -
బీచ్ రోడ్డులో...
శుక్రవారం ఉదయం విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో ట్రాఫిక్ నార్మల్‌గానే ఉంది. కానీ, కాసేపటికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వెంకటేశ్ రావడంతో ఆ ఏరియా అంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ జామ్ కావడంతో బౌన్సర్లు వెంకీకి రక్షణగా రంగంలోకి దిగారు. అసలు వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న సినిమా ‘గురు’. మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన తమిళ సినిమా ‘ఇరుది సుట్రు’కి తెలుగు రీమేక్ ఇది. విశాఖలో భీమిలి బీచ్ రోడ్డులో వెంకటేశ్ జాగింగ్ చేస్తున్న దృశ్యాలతో పాటు బైక్‌పై వెళ్తున్న సీన్స్, బోయవీధిలో కిక్ బాక్సింగ్ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ రితికా సింగ్, సీనియర్ నటుడు నాజర్ తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు. తరువాతి షెడ్యూల్ చెన్నైలో మొదలుకానుంది.