డీఎస్సీ ఆలస్యం | AP DSC Recruitment Notification will be late | Sakshi
Sakshi News home page

డీఎస్సీ ఆలస్యం

Published Fri, Dec 15 2017 4:05 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

AP DSC Recruitment Notification will be late - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్‌ మరింత ఆలస్యం కానుంది. వచ్చే నెలలో కానీ ఈ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కనిపించడం లేదు. టీచర్ల నియామక ప్రక్రియను ఈసారి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)కి అప్పగించాలని ప్రభుత్వం యోచించటమే దీనికి ప్రధాన కారణం. 12370 ఖాళీల భర్తీకి ఈనెల 15వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఉపాధ్యాయ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయటంపై ప్రభుత్వం ఇంతవరకూ కసరత్తు పూర్తిచేయలేదు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ‘డీఎస్సీ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేయడం లేదు. ఏపీపీఎస్సీతో దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. అవి కొలిక్కి వచ్చి తుది నిర్ణయం తీసుకున్న తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది’ అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి గురువారం ‘సాక్షి’కి వివరించారు.

దరఖాస్తుల స్వీకరణ గడువు కుదిస్తేనే షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియ
డీఎస్సీ నిర్వహణకు తాము సిద్ధమేనని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయభాస్కర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలిపారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం దీనిపై విద్యాశాఖ జీవోను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, జనవరి మూడో వారంలో కానీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం లేదని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి డీఎస్సీని పూర్తి చేసి కొత్త టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును కుదించి తక్కిన ప్రక్రియలను యధాతథంగా నిర్వహిస్తేనే అది  సాధ్యమవుతుందని చెబుతున్నారు. మరోపక్క జిల్లాల వారీగా ఖాళీల సమాచారం కూడా పాఠశాల విద్యాశాఖకు ఇంకా పూర్తిగా రాలేదు. అవన్నీ వచ్చాక మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు అవకాశముంది.

18 నుంచి టెట్‌ ఫీజు చెల్లింపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌–2017) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఠీఠీఠీ.ఛిట్ఛ.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్‌ బులిటెన్, సిలబస్‌ను పొందుపరిచింది. పరీక్షల తేదీలు, రుసుము, సూచనలు కూడా అందులో తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. సోమవారం నుంచి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌ పరీక్ష జనవరి 17 నుంచి 27వ తేదీవరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement