ఎప్పటికైనా ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం’ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుందని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం వ్యాఖ్యానించారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ ఎప్పుడూ మన మనస్సులో ఉంటారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్ జీవితం నాలో స్ఫూర్తి నింపింది. మా అమ్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. డెలివరీ సమయంలో కూడా అక్కినేని సినిమా చూడాలంటూ అమ్మ పట్టుబట్టి మరీ చూశారట. అందుకేనేమో ఆమె కడుపులో ఉన్న నాకు సినిమాలు అంటే ఇష్టం ఏర్పడిందేమో. అక్కినేని గారితో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో కలిసి నటించా. ఆయన చాలా బాగా మాట్లాడేవారు. అక్కినేని దగ్గర చాలా నేర్చుకున్నా.’ అంటూ అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.