సీమాంధ్రలో కదిలిన బస్సు | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో కదిలిన బస్సు

Published Sat, Oct 12 2013 9:34 AM

: సీమాంధ్రలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి యథావిధిగా బస్సు రథచక్రం కదిలింది. దాదాపు రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆర్‌టీసీ కార్మికులతో ప్రభుత్వం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు శుక్రవారం రాత్రికి కొలిక్కివచ్చాయి. బస్ భవన్‌లో రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌లతో జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో గత 60 రోజులపాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లపై మంత్రి బొత్స ఆధ్వర్యంలో బస్ భవన్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 11 గంటల వరకూ ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించేందుకు అంగీకరించాయి. ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను అంగీకరిస్తూ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు సర్కారు ముందుకు రావటంతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా అంగీకరించడంతో.. 60 రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. మా డిమాండ్లకు అంగీకరించారు: కార్మిక సంఘాలు సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రస్తుత తుఫాను పరిస్థితిని పరిగణలోకి తీసుకుని సమ్మెను విరమిస్తున్నట్టు ఈయూ అధ్యక్షడు పద్మాకర్ తెలిపారు. ప్రధానంగా ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఇందుకోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం జారీచేసిన జీవో సంతృప్తికరంగా లేదన్న తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, దీనిని సవరిస్తూ శుక్రవారం కొత్త జీవోను జారీచేయటాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దీనితో పాటు సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించటంతో పాటు.. కార్మికులకు పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమించేందుకు సిద్ధమయ్యామన్నారు. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరతారని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు మహ్మమూద్ తెలిపారు. సమ్మె విరమించారు: బొత్స ‘‘రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో గత 60 రోజులుగా జరుగుతున్న ఉద్యమం వల్ల ఆర్‌టీసీ తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రజలు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సున్నితాంశ పరిష్కారం రాజకీయపరంగా జరగాల్సి ఉంది. దీనిని ప్రభుత్వంపై ఉంచి సమ్మె విరమించాలని చేసిన విజ్ఞప్తికి ఆర్‌టీసీ కార్మికులు అంగీకరించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వస్తామని హామీ ఇచ్చారు’’ అని మంత్రి బొత్స అనంతరం మీడియాకు తెలిపారు. డిమాండ్లు - పరిష్కారాలు ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మేరకు సవరణ ఉత్తర్వులను శుక్రవారం ప్రభుత్వం జారీచేసింది. ఆర్‌టీసీలో ఉన్న అప్పులపై కోటి రూపాయలు వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీని ప్రభుత్వమే భరించటంతో పాటు ఇప్పటివరకు ఉన్న అప్పులను మాఫీ చేసేందుకు ప్రభుత్వ సాయాన్ని పరిశీలిస్తున్నామని సర్కారు స్పందించింది. సకల జనుల సమ్మె సందర్భంగా మోటార్ వెహికల్ (ఎంవీ) ట్యాక్స్‌ను మినహాయించారని.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కూడా ఎంవీ ట్యాక్స్‌ను మినహాయించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్‌టీసీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దృష్ట్యా డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను మినహాయించి ట్యాక్స్ హాలిడేగా ప్రకటించాలని కోరారు. అయితే, ట్యాక్స్ మొత్తాన్ని రీ-యింబర్స్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని, ఇప్పటికే కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా.. ఇందుకు కూడా అంగీకరిస్తూ 100 కోట్లు కేటాయించేం దుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, నవంబర్1 నాటికి 9,500మంది కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్సు రూపంలో రెగ్యులర్ కార్మికులకు రూ.25వేలు, కాంట్రాక్టు కార్మికులకు రూ.15 వేలు చెల్లించనున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు యాజ మాన్యం అంగీకరించింది. 1-4-2013 నుంచి ఆర్‌టీసీ కార్మికులకు వేతన సవరణ అమల్లోకి వచ్చే విధంగా చర్యలను తీసుకోవాలని సంఘాలు కోరాయి. వచ్చే జనవరి 31 నాటికి వేతన సవరణ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement