స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదు | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదు

Published Thu, Nov 9 2023 12:22 AM

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పోరాట కమిటీ నాయకులు, కార్మికులు - Sakshi

కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఉక్కు ఉద్యమం బుధవారం నాటికి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద భారీ నిరసన చేపట్టి, అన్ని సంఘాల నాయకులతో కలిసి సభ నిర్వహించారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ 26 వేల ఎకరాల భూములిచ్చి.. 32 మంది పోరాట యోధుల ప్రాణత్యాగాలు చేస్తే ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటామన్నారు. ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం సాగిస్తున్న కార్మికుల స్ఫూర్తికి సలామ్‌ కొట్టారు. ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపద అని, ప్లాంట్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. కార్మిక సంఘాల నాయ కులు మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు ప్రధాని మోదీ కొమ్ముకాస్తున్నారని.. ఇందుల్లో భాగంగానే ప్లాంట్‌ను నష్టాల్లో నడిపించి, ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కూర్మన్నపాలెం కూడలిలో కార్మికులు హైవేపై బైఠాయించి నినాదాలు చేయడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడకి చేరు కుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. యూనియన్‌ ఆఫ్‌ స్టీల్‌ ఎంప్లాయీస్‌ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కొప్పో లు పరంధామయ్య రచించిన ‘విశాఖ ఉక్కు పడిలేచిన కెరటం–ఒక సామాజిక పునర్‌జీవం’అనే పుస్తకాన్ని ప్రొఫెసర్లు బాలమోహన్‌దాస్‌, జె.వి.ప్రభాకర్‌, లజపతిరాయ్‌, సీపీఎం రాష్ట్ర నాయకుడు నరసింగరావు ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ రఘువర్మ, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పల్లా శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దామా సుబ్బారావు, కోమటి శ్రీనివాసరావు, వేణు బాబు, పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, కారు రమణ, కె.ఎస్‌.ఎన్‌.రావు, జె.అయోధ్యరామ్‌, వై.టి.దాస్‌, జె.రామకృష్ణ, బొడ్డు పైడిరాజు, విల్లా రామ్మోహనకుమార్‌, వరసాల శ్రీనివాసరావు, వై.మస్తానప్ప, పిట్టారెడ్డి, గుమ్మడి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం

వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

కార్మికుల పోరాటానికి సలామ్‌: నాగిరెడ్డి

నగరంలో మానవహారం

సీతమ్మధార: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని కూర్మన్నపాలెం జంక్షన్‌లో చేస్తున్న పోరాటానికి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం నగరంలో వామపక్ష పార్టీలు, అఖిల పక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ దరి గురజాడ విగ్రహం వద్ద కార్మికులు మానవహారం చేశారు. ఈ సందర్భంగా సిటు జిల్లా కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, కార్పొరేటర్‌ గంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ జయప్రదమైందన్నారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మి క, కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 72 గంటలపాటు మహాధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అచ్యుతరావు, ప్రజాపోరు నాయకులు దేవా, కె.శంకరావు, పి.లక్ష్మి, తిరుపతిరావు, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

శిబిరం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి
1/2

శిబిరం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ర్యాలీగా వస్తున్న కార్మిక సంఘాల నాయకులు
2/2

ర్యాలీగా వస్తున్న కార్మిక సంఘాల నాయకులు

Advertisement
Advertisement