తరిమేశారు! | Sakshi
Sakshi News home page

తరిమేశారు!

Published Sat, Nov 11 2023 12:46 AM

- - Sakshi

● శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల మాయాజాలం ● రూ.కోట్ల విలువచేసే 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ ● సబ్‌ డివిజన్లు చేసి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు ● ఒక్కొక్కరూ 30 ఎకరాల చొప్పున ఆక్రమించి దర్జాగా సాగు ● నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీలు చేసుకుంటున్న భూముల్లో పాగా

సాక్షి, తిరుపతి: టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుంటున్న గయాలు(పచ్చిక బయలు) బీడు భూములను ఆ పార్టీ నేతలు ఆక్రమించుకున్నారు. కబ్జా చేసిన ఆ భూములకు సంబంధించి కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో సబ్‌ డివిజన్‌చేసి వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ భూములు కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు. శ్రీకాళహస్తి రూరల్‌ మండలంలోని మారుమూల గ్రామమైన గంగలపూడిలో జరిగిన ఈ భూ ఆక్రమణల పర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. శ్రీకాళహస్తి పట్టణం నుంచి సుమారు 15 కి.మీ దూరంలో ఉన్న గంగలపూడి గ్రామం వేలవేడు రెవెన్యూ పరిధిలో సర్వే నం.2లో 428.64 ఎకరాల గయాలు (పచ్చిక బయలు) భూములు ఉన్నాయి. శ్రీకాళహస్తి–పల్లంపేటకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ భూముల్లో స్థానికులు పశువుల మేతకు వినియోగించుకునేవారు. కొంతకాలం తర్వాత భూములు బీడుగా ఉన్నాయని ఎస్సీ, ఎస్టీలు కొందరు ఎకరం చొప్పున సాగులోకి తెచ్చారు. అప్పట్లో అధికారులు కూడా వారికి పట్టాలు ఇప్పిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొందరు పెత్తందారులు ఎస్సీ, ఎస్టీలను అక్కడి నుంచి తరిమేశారు. కాస్త గట్టిగా నిలబడ్డ వారికి ఎకరం రూ.10 వేలు లేదా రూ.20 వేలు ఇచ్చి పంపేశారు. రికార్డుల్లో ఎస్సీ, ఎస్టీల పేర్లు లేకపోయినా కొందరు పెత్తందారులు మరళా ఆ భూముల్లోకి ప్రవేశించకుండా అగ్రిమెంట్‌ పత్రం రాసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఎటువంటి అధికారం లేకపోయినా..

వేలవేడు రెవెన్యూ పరిధిలోని గయాలు భూములపై టీడీపీ నేతలకు ఎటువంటి అధికారం లేకపోయినా ఎస్సీ, ఎస్టీలను తరిమేసి దర్జాగా సాగు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుని కొందరు సర్వే నంబర్‌ని డివిజన్‌ చేసినట్టు, ఆ భూములు వారివే అన్నట్టు రికార్డులు సృష్టించుకున్నారు. అయితే ఆ పత్రాలేవీ వారు బయటపెట్ట లేదు. స్థానికులు అడిగితే ఆ భూములు తమవే అని, కొనుగోలు చేసుకున్నామని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా సర్వే నం.2పీలోని 18 ఎకరాలపై చిలుకు భూమిని సైతం ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నారు. ఆక్రమణల విషయంపై స్థానికులు అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎకరం భూమి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం

వేలవేడు రెవెన్యూ పరిధిలో ఒకే ఒక్క బ్లాక్‌లో మొత్తం 900 ఎకరాల భూమి ఉంది. అయితే గతంలో ఎస్సీ, ఎస్టీలకు భూములు పంపిణీ చేసి ఉన్నారు. కొంత క్వారీలకు కూడా అనుమతులు ఇచ్చి ఉన్నారు. ఆ భూములను ఎవరెవరు ఆక్రమించుకున్నారనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతాం. ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం.

– రవిశంకర్‌రెడ్డి, ఆర్డీఓ, శ్రీకాళహస్తి

అక్రమార్కులంతా బొజ్జల అనుచరులే

వేలవేడు పరిధిలోని 500 ఎకరాలే కాదు.. నియోజకవర్గ పరిధిలో టీడీపీ శ్రేణులు నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములకు కొందరు అధికారులు అండదండలు మెండుగా ఉండడంతో దర్జాగా సాగు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి మండలం, వాగివేడు పరిధిలోని వెంగళ్లపల్లిలో టీడీపీ శ్రేణులు సుమారు 50 ఎకరాల అనాధీనం భూమిని కొన్నేళ్లుగా ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. భూ ఆక్రమణలపై పలుమార్లు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సాక్షి దినపత్రికలోనూ ఈనెల 7న ‘శ్రీకాళహస్తిలో బొజ్జల అనుచరుల భూ కబ్జా’ శీర్షికన వెలుగులోకి తీసుకొచ్చింది. ఆక్రమణల విషయంపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

1/1

Advertisement
Advertisement