బావిలో పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

బావిలో పడి వ్యక్తి మృతి

Published Wed, May 15 2024 1:25 AM

బావిల

పాన్‌గల్‌: బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేణు వివరాల ప్రకారం.. మండలంలోని శాగాపూర్‌ తండాకు చెందిన నేనావత్‌ స్వామి(36) ఈనెల 13న తన వ్యవసాయ పొలానికి వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి రాత్రి అయిన ఇంటికి రాలేదు. పొలం దగ్గరే ఉండి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది పొలం దగ్గర, తెలిసిన వారి గృహాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మధ్యాహ్నం వేళ తండాకు చెందిన ఇద్దరు యువకులు చేపలు పట్టడానికి వెళ్లారు. వాని పొలం సమీపంలో ఎరుకలి చిన్న నర్సింహ బావిలో మృతదేహం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో బావి దగ్గరికి వెళ్లి మృతదేహాన్ని నేనావత్‌ స్వామిగా గుర్తించారు. నీళ్లు తాగడానికి వెళ్లి బావిలో పడి మృతిచెందినట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. స్వామికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి..

ధరూరు: మండల కేంద్రంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. దాదాపు 50 ఏళ్ల వయసు గల వ్యక్తి రెండేళ్లుగా ధరూరు బైపాస్‌లో మతి స్థిమితం లేకుండా తిరుగుతూ.. హోటళ్ల వద్ద ఏదైనా ఆహారం పెడితే తింటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. ఎవరైనా గుర్తిస్తే సెల్‌ నం.87126 70293కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

ఆటో ఢీకొని బాలుడు..

కోస్గి: రోడ్డు దాటుతున్న బాలుడిని ఓ ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతిచెందిన సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్‌ మండలం హాజిపల్లికి చెందిన పద్మమ్మ, సందీప్‌కుమార్‌ల కుమారుడు అభిరామ్‌(7) వేసవి సెలవుల్లో అమ్మమ్మ గ్రామం కోస్గి మండలం ఈజీపూర్‌కు వెళ్లాడు. ప్రధాన రోడ్డు పక్కనే ఇల్లు ఉండటంతో రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న ఆటో బాలుడిని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. తల పగిలి తీవ్ర గాయాలైన బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆటోలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఆటో హన్వాడ మండలం సల్లోనిపల్లెకు చెందినది కాగా.. అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం పోలేపల్లి ఎల్లమ్మ ఆలయానికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాలుడి తండ్రి సందీప్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌ తిరుపతయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వచ్చి బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

చికిత్సపొందుతూ

వృద్ధురాలు..

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో రైల్వేట్రాక్‌ దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదానికి గురైన వృద్ధురాలు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ప్రస్తుతం మృతదేహం జిల్లా ఆస్పత్రి మార్చూరీలో ఉందని మున్సిపాలిటీ కౌన్సిలర్‌ ఎస్‌.రమేష్‌ తెలిపారు. వృద్ధురాలిని గుర్తిస్తే రైల్వే పోలీస్‌ 9441273164 నెంబరుకు ఫోన్‌చేసి సంప్రదించాలని ఆయన కోరారు.

పెళ్లి కాలేదని

యువకుడు ఆత్మహత్య

రాజోళి: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. రాజోళికి చెందిన ఉస్మాన్‌ బాషా (26) తన మామ మాబు దగ్గర ఉంటూ మగ్గం నేస్తుండేవాడు. కాగా.. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో మనస్తాపానికి గురైన ఈ నెల 10న సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రైలు కిందపడి

యువకుడు..

గద్వాల క్రైం: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ రామకృష్ణ కథనం ప్రకారం.. గద్వాల పట్టణానికి చెందిన మహ్మద్‌ మౌలాలి(26) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా మానసిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారి మంగళవారం సాయంత్రం పాతహౌసింగ్‌ కాలనీ సమీపంలోని గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై భార్య మహబూబ్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

బావిలో పడి వ్యక్తి మృతి
1/1

బావిలో పడి వ్యక్తి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement