చెట్టెక్కిన చదువులు

Tackle Challenges Of Online Classes Due To COVID-19 In Telangana - Sakshi

పాఠం వినాలంటే ఎత్తయిన ప్రదేశానికి వెళ్లాల్సిందే..

ఆన్‌లైన్‌ క్లాసులకు సిగ్నల్స్‌ సమస్య

ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో సమస్య మరీ తీవ్రం

పర్యవేక్షణ లేక కూలి పనులకు.. ఆటపాటల్లో మునిగి తేలుతున్న విద్యార్థులు

‘‘చెట్టు లెక్కగలవా.. ఓ విద్యార్థి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన సిగ్నల్‌ చూడగలవా’’.. ఇదీ.. ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న విద్యార్థుల పరిస్థితి. ఆన్‌లైన్‌ తరగతులు పిల్లలను చెట్లు, పుట్టలు, గడ్డివాములు, మంచెలు, ఎత్తయిన ప్రదేశాలను ఎక్కిస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ వివరాలు.. 

పై ఫొటోను చూశారా.. అందులో ఉన్న చెట్టుమీద పిల్లలను గమనించారా.. వారెక్కింది చిగురు కోసమో, కోతికొమ్మచ్చి ఆట కోసమో కాదు. క్లాస్‌ కోసం!అదేలా అనుకుంటున్నారా? అవును.. అది అక్షరాలా.. చెట్టుబడి, అది కొమ్మ క్లాస్‌! ప్రయాణంలో అలసిపోయి సేద తీరుదామని ఓ చెట్టు కిందికి చేరిన ‘సాక్షి’ కంటబడిన దృశ్యమిది. అది ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని మల్కపల్లి శివారు. అక్కడ ఫోన్‌ సిగ్నల్‌ లేక రోజూ ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చింతచెట్టు ఎక్కి ఇలా పాఠాలు వింటున్నారు.

ఇదివరకైతే క్లాస్‌రూంలో పాఠాలు వినేవారు.. ఇప్పుడు చెట్టుకొకరు, పుట్టకొకరైతే తప్ప క్లాస్‌ వినే పరిస్థితిలేదు. చెట్టుకొమ్మలే పాఠాలకు ‘పట్టు’ గొమ్మలయ్యాయి. చిటారుకొమ్మనకెళ్తే చిగురన్నా దక్కుతుందేమోకానీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ దొరుకుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఫోన్‌కు సిగ్నల్స్‌ అందితేనే తరగతి. లేదంటే.. అది గతి తప్పుతుంది. ఇదీ ఊళ్లల్లో ఆన్‌లైన్‌ క్లాసుల పరిస్థితి. ఏజెన్సీ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాల్లో మరీ దారుణం. ఆన్‌లైన్‌ తరగతులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రతినిధులు వరంగల్‌ అర్బన్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాంతాలను విజిట్‌ చేశారు. ఆ విజిట్‌లో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఆయా ప్రాంతాల నుంచి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇది.

ఈ పిల్లాడి పేరు రవీందర్‌. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ క్లాసులు తరువాతైనా వినొచ్చంటూ తండ్రికి బదులు గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్తూ కనిపించాడు.

టెన్షన్‌.. టెన్షన్‌! 
పాల్వంచ మండలం సారెకల్లులో కణితి కీర్తన అనే విద్యార్థిని చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకొని టెన్షన్‌గా అటూ, ఇటూ తిరుగుతోంది. ఏమైంది అని ‘సాక్షి’ప్రతినిధి అడగగా.. ‘నేను 9వ తరగతి చదువుతున్నా. ఆన్‌లైన్‌ తరగతులు విందామని సిగ్నల్స్‌ కోసం ట్రై చేస్తున్నా.

ఊరులో ఏ దిక్కుకుపోయి చూసినా సిగ్నల్‌ అందుతలేదు. ఒక్కోసారి బాగానే ఉంటది. సిగ్నల్‌ సతాయించడంతో పాఠాలు సరిగా వినలేకపోతున్నా’అంటూ వాపోయింది. ఈ సమస్య ఇక్కడే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, టేకులపల్లి, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అంతటా ఉంది. చాలా గ్రామాల్లో టీశాట్, దూరదర్శన్‌ యదగిరి ఛానల్స్‌ ప్రసారాలు కూడా సరిగా రావట్లేదు. 

పత్తి తీస్తూ.. గోలీలు ఆడుతూ.. 
అది ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం బెజ్జూర్‌. ‘సాక్షి’ప్రతినిధులు అలా నడుచుకుంటూ ఊరిలోకి వెళ్లగా ఒకచోట బడీడు పిల్లలు సీసం గోలీలు ఆడుకుంటూ కనిపించారు. మరికొందరు పిల్లల చేతుల్లో సద్దిమూటలు కనిపించాయి. వారంతా తల్లిదండ్రులతో కలసి నడుచుకుంటూ పోతున్నారు. వారిని ఆపి, ఎటుపోతున్నారు, ఆన్‌లైన్‌ క్లాసులు లేవా.. అని అడిగాం. ‘ఆన్‌లైన్‌క్లాసుల్లో పాఠాలు స్పీడ్‌గా చెబుతుండ్రు. అవి మాకు అర్థమైతలె. ఇంటికాడ ఉండి ఏం జేయాలని పత్తిచేనుకు పోతున్నాం. ఇప్పుడు పత్తి సీజన్‌. పత్తి ఏరుదామని వెళ్తున్నాం ’అని చెప్పారు.

తిర్యాణి మండలంలో మంగీ గ్రామానికి వెళ్లిన ‘సాక్షి’ప్రతినిధులకు ఓ సమస్య వచ్చి పడింది. తమ చేతుల్లోని సెల్‌ఫోన్‌లను పరిశీలించగా దేంట్లోనూ సిగ్నల్స్‌ లేవు. ఈ సమస్య ఒక్క మంగీ గ్రామంలోనే కాదు, మాణిక్యాపూర్, రోంపెల్లి, మెస్రంగూడ, మందగూడ, పంగిడిమాదర, భీంజిగూడ, గోపెర, కౌటగం, మర్కగూడ, ముల్కలమంద, మొర్రిగూడల్లోనూ ఉంది. అయితే, అప్పుడప్పుడూ, మిణుకుమిణుకుమంటూ సిగ్నల్స్‌ వచ్చిపోతుంటాయని ముల్కలమంద గ్రామస్తులు చెప్పారు. అందుకే చాలామందికి స్మార్ట్‌ఫోన్లు, డిష్‌ టీవీ కనెక్షన్‌ లేవు. కెరమెరిలోనూ సిగ్నల్‌ కష్టాలు ఉన్నాయి.  అయితే, రెబ్బెనలో కాస్తా పరిస్థితి భిన్నంగా ఉంది. రెబ్బెనలో విద్యావంతులైన తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో మాత్రమే టీవీలు, మొబైల్‌ ఫోన్‌లు ఉన్నా యి. వీరంతా రెగ్యులర్‌గా పాఠాలు వింటున్నారు. 

చేపలు పడుతూ..క్రికెట్‌ ఆడుతూ.. 
మహబూబ్‌గర్‌ మండలం బొక్కలోనిపల్లిలో కొందరు పిల్లలు రోడ్లపై ఆడుతూ, ఇంకొందరు క్రికెట్‌ అడుకుంటూ గోలగోల చేస్తున్న దృశ్యం మా కంట పడింది. భూత్పూర్‌ మండలంలోని తాటికొండ, గాజులపేటలో విద్యార్థులు చెరువుగట్ల వద్ద చేపలు పడతూ కనిపించారు. అల్లీపూర్‌ ఊరి బయట ఓ మిరప తోటలో పని చేస్తున్న విద్యార్థి దగ్గరకు వెళ్లి పలకరించగా.. ‘ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న. ఇంట్లో టీవీ పాడైపోవడంతో తరగతులు వినలేకపోతున్నా’అని చెప్పాడు. దేవరకద్ర మండలంలోని చాలా తండాల్లో టీవీలు కూడా అందుబాటులో లేని విద్యార్థులు ఉన్నారు.  

పిల్లలు ఆడుకుంటున్న ఈ ఊరి పేరు మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గురిమిళ్ల. గ్రామంలో సరిగ్గా సెల్‌ సిగ్నల్‌ అందదు. దీనికి తోడు ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు.. ఇంట్లో ఉన్నది ఒక్కటే ఫోన్‌.. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు వినే అవకాశం లేని విద్యార్థులిలా ఆడుకుంటూ కనిపించారు. – బయ్యారం

పిల్లలతోపాటు పెద్దలకూ క్లాసులే 
మా ఇద్దరు పిల్లల్ని చెరో గదిలో ఉంచాలి. క్లాసులు వింటూ.. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మల్ని పిలుస్తున్నారు. మేం బయటకు కదలడానికి వీల్లేకుండాపోయింది. ఆన్‌లైన్‌ క్లాసులనేవి పిల్లతోపాటు పెద్దలకు కూడా క్లాస్‌ల్లా మారాయి.  – జి.రమాదేవి, హన్మకొండ 

డిష్‌ కొనిచ్చాను.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కిష్టారంపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని. ఇక్కడ 22 మంది విద్యార్థులున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్నవారు గ్రామంలో మరో 15 మంది ఉన్నారు. ఇక్కడ కేబుల్‌ కనెక్షన్‌ లేదు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేవు. విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని గ్రహించి సొంత ఖర్చులతో ఒక టీవీ, డీటీహెచ్‌ డిష్‌ కొని గ్రామంలోని ఒక ఇంట్లో ఏర్పాటు చేశాను. విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించాను.  – అజ్మీరా రాము, హెచ్‌ఎం, ఎంపీపీఎస్, కిష్టారంపాడు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం 


ఈ విద్యార్థి పేరు శివగంగకృష్ణ. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు కావడంతో ఎక్కడైనా వినొచ్చని ఇలా  పుస్తకాలు పట్టుకుని ఆవును పొలానికి తోలుకెళ్తున్నాడు.     – సాక్షి, ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

ఆన్‌లైన్‌ పాఠాలు– సమస్యలు 
►ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు గ్రామీణ, వ్యవసాయాధారిత, పేద, మధ్య తరగతి కుటుంబాలు అధికం. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్నవారు చాలా తక్కువ. సగం మంది విద్యార్థులు టీవీల మీదే ఆధారపడ్డారు. 
►గ్రామాల్లో వీశాట్‌ ప్రసారాలు సక్రమంగా ఉండడం లేదు.  
►మూడు నెలల నుంచి వ్యవసాయ పనులు జోరుగా సాగడంతో చాలామంది విద్యార్థులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కొన్నిచోట్ల తల్లిదండ్రులు పనులకు వెళ్తుండటంతో పిల్లలపై పర్యవేక్షణ కొరవడుతోంది. 
►ఆన్‌లైన్‌ తరగతుల వేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది.  
► టీవీల్లేని విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు.
►ఆర్థిక భారమైనా.. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. 

పాల్వంచ మండలం కారెగట్టు గ్రామంలో సిగ్నల్‌ కోసం చెట్టెక్కిన విద్యార్థులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top