Cyber Crimes: పారా హుషార్‌: కొత్త ఏడాది.. కొత్త ఆశలతో పాటు కొత్త సమస్యలు

Norton Labs Cyber Security Says Cyber Crimes Increase In Year 2022 - Sakshi

‘కొత్త’ ముసుగుతో సైబర్‌ దొంగలు

ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటోంది! కానీ..ఏళ్లుగా పీడిస్తున్న హ్యాకింగ్, స్కామింగ్‌ చికాకులు మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు సరికదా... వచ్చే ఏడాది మరింత పెరుగుతాయంటోంది నార్టన్‌ ల్యాబ్స్‌!! కొత్త పోకడలతో, కొంగొత్త పద్ధతులతో ఐటీ వినియోగదారుల నుంచి  డబ్బు లాగేసేందుకు స్కీములేస్తారని... పారాహుషార్‌ అని హెచ్చరిస్తోందీ సంస్థ! 

సాక్షి, హైదరాబాద్‌: 2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నార్టన్‌ ల్యాబ్స్‌. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్‌ ఆక్టివిజమ్‌ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్‌ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్‌ ల్యాబ్స్‌ అంచనాల మేరకు... 

క్రిప్టో కరెన్సీ తోడుగా... 
2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్‌ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్‌లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. 

ఎలక్ట్రానిక్‌ ఐడీలు? 
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, జూమ్‌ కాల్, ఆన్‌లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్‌ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎల్రక్టానిక్‌ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్‌చెయిన్‌ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి.  

సైబర్‌ నిరసనలు, ఉగ్రవాదమూ... 
సైబర్‌ టెర్రరిజమ్, ఆక్టివిజమ్‌ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్‌ క్రిమినల్స్‌ చేసే పనైతే.. హ్యాకింగ్‌ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్‌ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది.

నేరగాళ్లకూ అండగా ఏఐ... 
మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్‌ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్‌ఫేక్‌ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు.  

కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... 
మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు.  

చదవండి:
సైబర్‌ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్‌ మీకోసమే..
ఎందుకింత గలీజ్‌ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top