విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుపైఘోర ప్రమాదం
ప్రమాదం ధాటికి తెరుచుకున్న డోర్లు
దీంతో కారులో నుంచి కింద పడిన ఐదుగురు
వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి
ప్రాణాలతో పోరాడుతున్న మరో మహిళ
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు
మంటల్లో దగ్ధమయిన ఎలక్రి్టక్ వెహికిల్
బాధితులు విజయవాడ రూరల్ నున్న గ్రామస్తులు
గుంటూరు జిల్లా నంబూరులో ఓణీల వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం
సాక్షి, విజయవాడ/నున్న (విజయవాడ రూరల్): విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుపై సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా విజయవాడ రూరల్ నున్న గ్రామం నుంచి గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఓణీల వేడుకకు వెళ్లి ఎలక్రి్టక్ కారు (ఈవీ)లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గొల్లపూడి–పైడూరుపాడు మధ్యలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా రెయిలింగ్‌ను ఢీకొంది. ప్రమాదం ధాటికి డోర్లు తెరుచుకుని కారును నడుపుతున్న కొమ్మారెడ్డి రాందేవ్‌రెడ్డి (42), తల్లి కొమ్మారెడ్డి అరుణ (65), కొడుకు మహోత్రా (18 నెలలు)తోపాటు వారి పక్కింటి మహిళ భీమవరపు విజయ (68), తియ్యగూర స్వర్ణ రోడ్డుపై విసిరేసినట్లు పడిపోయారు.
ఈ ఘోర ఘటనలో రాందేవ్‌రెడ్డి, అరుణ, మహోత్రా, విజయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తియ్యగూర స్వర్ణ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. హైదరాబాద్‌లో నివాసముంటున్న స్వర్ణ ఓణీల వేడుకకు హాజరయ్యేందుకు నున్నకు వచ్చారు. కాగా, ప్రమాదం అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు క్షణాల్లోనే కాలిబూడిదైంది. ప్రమాదం విషయం తెలుసుకున్న కొమ్మారెడ్డి రాందేవ్‌రెడ్డి భార్య, అతడి తండ్రి కొమ్మారెడ్డి సుబ్బారెడ్డి స్పృహతప్పి పడిపోవడంతో వీరికి చికిత్స అందిస్తున్నారు. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి గురైన ఈవీ కారు పూర్తిగా దగ్ధమై, నలుగురు మృతిచెందడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


