తెలంగాణలో ఏడున్నర నెలలుగా 3,45,445 ఉపాధి కూలీలకు పనేది ?
తొలగించిన జాబ్‌కార్డుల సంఖ్య 67,070
ఆధార్ ఆధారిత చెల్లింపులు తప్పనిసరి చేయడమే ప్రధాన సమస్య
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గత ఏడున్నర నెలల కాలంలో 67,070 ఉపాధి హామీ జాబ్‌కార్డులతోపాటు 3,45,445 మంది ఉపాధి కూలీలు తొలగింపునకు గురయ్యారు. 2022–23లో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం (ఏబీపీఎస్) అమలు సమయంలో రాష్ట్రంలో 5.1 లక్షల జాబ్‌కార్డులను తొలగించారు. ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోగా, 2025–26లో కూడా జాబ్‌కార్డులు, ఉపాధికూలీల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
32 జిల్లాల్లో రిజిస్టర్డ్ జాబ్ కార్డులు 52,42,794 కాగా, రిజిస్టర్డ్ వర్కర్లు 1.01 కోట్ల మంది. అయితే ఏప్రిల్–నవంబర్ 12 వరకు చూస్తే 20.11 లక్షల జాబ్ కార్డులకుగాను 30.33 లక్షల మంది ఉపాధికూలీలకే పని దొరికింది. అంటే దాదాపు 22 లక్షల జాబ్‌కార్డుల వారికి, దాదాపు 69–70 లక్షల కూలీలకు పని లభ్యం కాలేదని స్పష్టమవుతోంది. దీంతోపాటు తెలంగాణలో నమోదైన 53 లక్షలకు పైగా కార్మికులకు ఇంకా ఈ–కేవైసీ పూర్తి కాలేదు.
దీంతో వేతనాల చెల్లింపు ఆలస్యం కావడమో లేదా నిరాకరించే ప్రమాదం ఏర్పడింది. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థతో సాంకేతిక సమస్యలు, మొబైల్ ఆధారిత హాజరు కోసం కొత్త జియో–ఫెన్సింగ్ ఆవశ్యకతతో పెద్ద ఎత్తున సమస్యలు ఎదురవుతున్నాయి. ఆధార్ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేయడం సమస్యలకు ప్రధాన కారణం.
ఎన్‌ఎంఎంఎస్ యాప్ తప్పనిసరితో...
ఉపాధి కూలీల హాజరు నమోదుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్) యాప్ వినియోగం తప్పనిసరి చేశారు. వర్క్‌సైట్‌లలో కార్మికుల రియల్–టైమ్, జియో ట్యాగ్ చేసే హాజరు నమోదుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇది సాంకేతిక లోపాలు, నెట్‌వర్క్ కనెక్టివిటీలో సమస్యలతోపాటు ఏబీపీఎస్ ఈ–కేవైసీ ఇబ్బందులు వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. దీనివల్ల హాజరును స్థిరంగా గుర్తించడం అసాధ్యంగా మారింది.
సాంకేతిక లోపాలతో కూలీల హాజరు నమోదు చేయలేని పరిస్థితులు ఏర్పడి జీతం పొందకుండానే కొన్నిచోట్ల కూలీలు పని చేయాల్సి వస్తోంది. ఏబీపీఎస్ చెల్లింపులను సులభతరం చేయడానికి ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాలు, జాబ్ కార్డులతో (ఈ–కేవైసీ) తప్పనిసరి చేయడంతో మరిన్ని సమస్యలు తలెత్తాయి. కూలీ చెల్లింపు కోసం, కార్మికుడి ఆధార్‌ను వారి బ్యాంక్ ఖాతాకు సరిగ్గా లింక్ చేయాలి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సృష్టించిన నిర్దిష్ట డేటాబేస్ (మ్యాపర్)కు కూడా మ్యాప్ చేయాలి. ఈ బహుళ–దశల ప్రక్రియలో బహుళ వైఫల్యాలు ఉన్నాయి. ఈ–కేవైసీ లేదా ఏబీపీఎస్‌తో సమస్యలు తలెత్తినప్పుడు స్పష్టమైన పరిష్కార మార్గాలు ఉండటం లేదనేది కూలీల ప్రధాన ఫిర్యాదు.
ఆరునెలల్లోనూ భారీగా పనిదినాల తగ్గుదల
రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ దాకా మొత్తం ఉపాధి హామీ పనిదినాలు 47.6 శాతం మేర (గత ఏడాదితో పోల్చితే) భారీగా తగ్గాయి.ఈ ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్‌ల మధ్యలో (మొదటి ఆరునెలల్లో) దేశవ్యాప్తంగా పనిదినాల తగ్గుదల 10.4% మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం ఈ తగ్గుదల దానికంటే నాలుగు రెట్లు అధికంగా ఉంది. మన దగ్గర ప్రతీ కుటుంబానికి లభించిన సగటు పనిదినాలు 41 రోజుల నుంచి 27 రోజులకు పడిపోయాయి.
ఇది కార్మికుల హక్కుల ఉల్లంఘనే
ఉపాధి హామీలో తీసుకొస్తున్న సాంకేతిక మార్పులు కార్మికుల హక్కులను నేరుగా ఉల్లంఘిస్తున్నాయి. విస్తరించాల్సిన పథకాన్ని, సాంకేతికత పేరుతో పరిమితం చేస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. హాజరు నమోదుకు తీసుకొచ్చిన మొబైల్ ఆధారిత విధానం, ఆధార్ ఆధారిత చెల్లింపు పద్ధతి వంటి సాంకేతికతలు హక్కుల సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై వెంటనే అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలి. ఈ సాంకేతిక జోక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్‌టెక్ ఇండియా సంస్థ.
సమస్య పరిష్కారానికి అధికారులు చెబుతున్నది...
» పెండింగ్ ఈ–కేవైసీ కూలీలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సహాయం పొందడం
»ఆధార్ సేవా కేంద్రంలో వివరాల నవీకరణకు లేదా బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా ఈ–కేవైసీ పూర్తి
» ఆధార్ మొబైల్ యాప్‌ను ఉపయోగించి రిజిస్టర్డ్ ఫోన్‌నంబర్ ద్వారా ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈ–కేవైసీ డేటాను పొందొచ్చు
హాజరు/జియో–ఫెన్సింగ్ సమస్యలపై...
» సైట్‌లో పనిచేసేటప్పుడు ఎదురయ్యే ఏవైనా కనెక్టివిటీ లేదా జియో–ఫెన్సింగ్ సమస్యల గురించి వెంటనే సూపర్‌వైజర్‌కు తెలియజేయాలి
» హాజరు వ్యవస్థ యొక్క పారామీటర్లలో అవసరమైన స్థానానికి సాధ్యమైనంత దగ్గరగా గుర్తింపును నిర్ధారించుకోవాలి
జాబ్‌కార్డులను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు
జాబ్‌కార్డులను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఇది చట్టవిరుద్ధం. ఒకవేళ తొలగించాల్సి వస్తే ముందుగా నోటీసులివ్వాలి. గ్రామసభలో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో గతమూడునెలలుగా అసలు పనులు ఇవ్వడం లేదు. కూలీలు ఎప్పుడు పని అడిగినా ఇవ్వాలనే ఉపాధి చట్టం ప్రాథమిక సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం.
ఈ విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూలీల హక్కులను హరిస్తున్నాయి. కేంద్రం ఈ పథకాన్ని నీరుగారుస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వమైనా స్పందించి ఒడిశా ప్రభుత్వ తరహాలో అదనంగా వికలాంగులు, ఒంటరి మహిళలకు 50 రోజులు పనిదినాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. – పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్, జాతీయ కార్యదర్శి


