ఖాకీ ఎస్కేప్‌! | Maharashtra Police Constable Ganja Case Incident | Sakshi
Sakshi News home page

ఖాకీ ఎస్కేప్‌!

Oct 13 2026 1:46 PM | Updated on Oct 13 2026 2:19 PM

Maharashtra Police Constable Ganja Case Incident

గంజాయి కేసులో నిందితుడిగా మహారాష్ట్ర కానిస్టేబుల్‌

అతడిని పట్టుకుని తీసుకువచ్చిన పటాన్‌చెరు పోలీసులు

బాత్‌రూంకి వెళ్లివస్తానని పోలీసుస్టేషన్‌ నుంచి పరార్‌

 గత బుధవారం ఘటన, నిందితుడి కోసం స్పెషల్‌ టీమ్స్‌

సాక్షి, హైదరాబాద్: గంజాయి అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర కానిస్టేబుల్‌ సైబరాబాద్‌ పోలీసులకు ఝలక్‌ ఇచ్చాడు. ఇతడిని పట్టుకున్న పటాన్‌చెరు పోలీసులు గత మంగళవారం ఠాణాకు తీసుకువచ్చారు. బాత్‌రూంకి వెళ్లివస్తానని చెప్పిన అతగాడు అదును చూసుకుని పోలీసుస్టేషన్‌ నుంచి ఎస్కేప్‌ అయ్యాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు కమిషనర్‌ ఎం.రమేష్‌ నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 

ఈ ఏడాది మేలో స్మగ్లింగ్‌ గుట్టురట్టు...
పటాన్ చెరు పోలీసుస్టేషన్  డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న బి.రాజుకు ఈ ఏడాది మే 11న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ స్మగ్లింగ్‌ గుట్టురట్టు అయింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తున్న రెండు వాహనాలు ముత్తంగి టోల్‌ప్లాజా ఎగ్జిట్‌–3 మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లనున్నాయన్నది ఆ సమాచారం సారాంశం. దీంతో ఆయన తన సిబ్బందితో ముత్తంగి టోల్‌ప్లాజా సమీపంలో నిఘా ఏర్పాటు చేసింది. అనుమానితంగా వస్తున్న ఎర్టిగా కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న నలుగురు విచారణలో డీసీఎంలో జరుగుతున్న రవాణాపై సమాచారం తెలిసింది. ఆ డీసీఎం వాహనం అంతకుముందు రోజు రాత్రి దారి తప్పి, ఆలయం ఎదురుగా ఉన్న సర్వీస్‌ రోడ్డుపై నిలిచిపోయినట్లు వాళ్లు చెప్పారు. దీంతో పోలీసులు వాళ్లు చూపించిన మార్గంలో వెళ్లి ఆ వాహనాన్ని గుర్తించారు. 

కోళ్ల దాణా బస్తాల మాటున ప్యాకెట్లు...
డీసీఎం క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో గంజాయి ఎక్కడ ఉందంటూ వారిని ప్రశ్నించగా, కోళ్ల దాణా బస్తాల్లో ఖాళీ ప్లాస్టిక్‌ ట్రేల వెనుక దాచిన ప్యాకెట్లను చూపించారు. అక్కడ ఉన్న బస్తాల్లో ప్యాకింగ్‌ టేపులతో చుట్టిన ప్యాకెట్లు బయటపడ్డాయి. మొత్తం 199 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని వేరు చేసి 17 ప్లాస్టిక్‌ బస్తాల్లో ప్యాక్‌ చేసిన అధికారులు అది రూ.2.20 కోట్ల విలువైన 398.65 కిలోలుగా తేల్చారు. ఈ కేసులో మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాకు చెందిన ప్రథాప్‌ హరిదాస్‌ పవార్, రంజీత్‌ రాజేంద్ర ఘడగే, బాలాజీ ధ్యానేశ్వర్‌ వన్మానే, ఆనంద్‌ మయ్యప్ప హోవల్, రోహిత్‌ బలాసో హోవల్, ఆడుంబర్‌ గజానంద్‌ చందన్ శివే, ఓ మైనర్‌ను నిందితులుగా పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొని కొందరిపై అప్పట్లోనే చర్యలు తీసుకున్నారు. 

కీలకంగా వ్యవహరించిన షోలాపూర్‌ కానిస్టేబుల్‌....
ఒడిశాలో ట్రిబ్యూన్‌ అనే వ్యక్తి నుంచి గంజాయిని సేకరించిన ముఠా మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాకు చెందిన మనీషా రామ్‌సింగ్‌ పౌడ్వాల్‌కు అందించడానికి బయలుదేరింది. ఎర్టిగా కారును ముందుగా పంపించి, పోలీసుల తనిఖీలపై నిఘా ఉంచేలా పథకం వేశారు. ఈ కేసులో మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో ఉన్న రాజేశ్వనగర్‌కు చెందిన షోలాపూర్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ కానిస్టేబుల్‌ చవాన్‌ వైభవ్‌ భగ్వాన్‌ (32) సైతం ఈ గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పటాన్‌చెరు పోలీసులు తన దర్యాప్తులో గుర్తించారు. దీంతో గత మంగళవారం షోలాపూర్‌ వెళ్లిన వైభన్‌ను పట్టుకున్న పోలీసులు పటాన్‌చెరు ఠాణాకు తరలించారు. గత బుధవారం ఉదయం పోలీసుస్టేషన్‌ నుంచి అతడు ఎస్కేప్‌ అయ్యాడు. ఇతడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement