ఏసీబీ వలలో చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి, వీఆర్ఏ విజయ్‌కుమార్‌రెడ్డి, కాంట్రాక్ట్ ఉద్యోగి బాలకృష్ణ
లంచం తీసుకుంటూ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్, వీఆర్ఏ,కాంట్రాక్టు ఉద్యోగి
మాదన్నపేట సబ్‌స్టేషన్ పరిధిలో పట్టుబడిన విద్యుత్ ఏఈ
వేములవాడ రూరల్ తహసీల్దార్‌తోపాటు భూభారతి ఆపరేటర్ సైతం..
కీసర/సంతోష్ నగర్/వేములవాడ రూరల్: రాష్ట్రంలో ఒకే రోజు(గురువారం) జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్‌రెడ్డి రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కీసరకు చెందిన పన్నాల గిరిధర్‌రెడ్డి ఇటీవల మృతిచెందిన తన తల్లి పన్నాల సుశీలకు చెందిన కీసర దాయిరా రెవెన్యూ పరిధిలోని భూమిని విరాసత్ (సక్షేషన్) కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఇదే విషయమై కీసర తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి, వీఆర్ఏ విజయ్కుమార్రెడ్డిలను సంప్రదించగా సక్షేషన్ కోసం పెట్టిన భూములు నిషేదిత జాబితా (22ఏ)లో ఉన్నాయని, వాటిని 22–ఏ నుంచి తొలగించి సక్షేషన్ చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక గిరిధర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్న సమయంలో మొదటి విడతలో భాగంగా రూ.2.50 లక్షల లంచం నగదును డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి, వీఆర్ఏ విజయ్‌కుమార్‌రెడ్డి, రికార్డు సెక్షన్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి బాలకృష్ణ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.
విద్యుత్ మీటర్ల మంజూరు కోసం...
మరో ఘటనలో విద్యుత్ మీటర్ల మంజూరు కోసం విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాతబస్తీ సంతోష్ నగర్ సబ్ స్టేçషన్ పరిధి మాదన్నపేట్ సెక్షన్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా రాకేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. సెక్షన్ పరిధిలోని ఓ వ్యక్తి ఐదు నూతన విద్యుత్ మీటర్ల కోసం ఏఈ రాకేశ్‌ను ఆశ్రయించాడు. ఈ విషయమై రూ.1.20 లక్షలను డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ చేసి పట్టుకున్నారు.
గిఫ్ట్‌డీడ్ రిజి్రస్టేషన్ చేసేందుకు..: ఇంకో ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ మహ్మద్ అబుబాకర్, భూభారతి ప్రైవేటు ఆపరేటర్ సంకశాల అనిల్కుమార్లను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లిలో భూమిని తన మేనత్త పేరు నుంచి తండ్రి పేరు మీద గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.10వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో తహసీల్దార్‌కు ఇవ్వాల్సిన డబ్బులను రూ.8వేలను భూభారతి ఆపరేటర్ అనిల్ తీసుకోగా అక్కడే మఫ్టీలో ఉన్న ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి, తదితర బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించారు.


